హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి పి.ఎ.సంగ్మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సంగ్మా సోమవారం హైదరాబాద్‌లోని విజయమ్మ నివాసంలో ఆమెతో కొద్దిసేపు సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని సంగ్మాతో విజయమ్మ చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం సంగ్మా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. విజయమ్మతోనూ, పార్టీ ఇతర నాయకులతోనూ తాను జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, వారు తమ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని తెలిపారు. ఈ భేటీ పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని, వారు చూపిన ఆదరణకు తాను కృతజ్ఞుడనని చెప్పారు. ఇటీవల పలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వమైన విజయం సాధించినందుకు విజయమ్మకు అభినందనలు తెలిపానన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన కుటుంబంతో 21 ఏళ్లుగా తనకు సంబంధాలు ఉన్నాయని సంగ్మా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని సంగ్మా విజ్ఞప్తి చేశారనీ తమ పార్టీలో చర్చించి తర్వాత నిర్ణయం చెబుతామన్నామని సమావేశం అనంతరం పార్టీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి విలేకరులకు చెప్పారు.
28న సంగ్మా నామినేషన్
రాష్ట్రపతి పదవికి 28న నామినేషన్‌ను దాఖలు చేస్తానని పి.ఏ.సంగ్మా విలేకరులకు వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కూడా కలుసుకోవాలని భావించాననీ అయితే వారిద్దరూ నగరంలో లేరనే విషయం తెలిసిందని సంగ్మా అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితను కలుసుకున్నానని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత తాను దేశమంతటా పర్యటి ంచి అందరి మద్దతు కోరుతానన్నారు.
జేఏసీ నేతలకు సంగ్మా ఫోన్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో-చైర్మన్‌కు మల్లేపల్లి లక్ష్మయ్య, అధికారప్రతినిధి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న పి.ఏ.సంగ్మా సోమవారం ఫోన్‌చేశారు. తెలంగాణ అంశానికి ఎలాంటి మద్దతైనా ఇస్తానని, రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు అండగా ఉండాలంటూ ఆయన వారిని కోరినట్లుగా సమాచారం. జేఏసీలో చర్చించి మద్దతు విషయాన్ని వెల్లడిస్తామని జేఏసీ నేతలు ఆయనకు చెప్పారు.
No comments:
Post a Comment