YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 25 June 2012

‘మందు’కు 35 వేల దరఖాస్తులే!

6,596 దుకాణాలకుగాను 35 వేల దరఖాస్తులు.. గత ఏడాది కంటే 14 వేల టెండర్లు తక్కువ
రాష్ట్రవ్యాప్తంగా 550 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ పడని వైనం
వీటిని డిస్టిలరీలకు అప్పగించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం
అదే జరిగితే.. ఒకటే బ్రాండ్ ప్రమోషన్‌కు డిస్టిలరీలు యత్నించే ప్రమాదం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కొత్త అబ్కారీ పాలసీ వికటించింది. ఎక్సైజ్ అధికారుల సూచనలు, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం సొంత నిర్ణయాలతో రూపొందించిన నూతన మద్య విధానంలో డొల్లతనం బయటపడింది. ఎలాంటి శాస్త్రీయతాలేకుండా జనాభా ప్రాతిపదికన లెసైన్స్ ఫీజులు భారీగా పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు ఇప్పుడు కార్పొరేషన్లలోని దుకాణాల లెసైన్స్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సోమవారం దరఖాస్తుల దాఖలుకు చివరి రోజు కావడంతో వ్యాపారుల తాకిడి భారీగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు భావించారు. జిల్లాల్లో వ్యాపారుల కోలాహలం కనిపించినా.. అధిక ఆదాయం రావాల్సిన కార్పొరేషన్లలో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో అధికారులు కంగు తిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకుగాను రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి దాదాపు 35 వేల దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇవే దుకాణాల కోసం 49 వేల దరఖాస్తులు వచ్చాయి. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రాతో అత్యవసరంగా సమావేశమ్యారు.

ఒక్క దరఖాస్తు కూడా పడలేదు..

లెసైన్స్ ఫీజు ఎక్కువగా ఉందన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. ఈ దుకాణాలన్నీ కూడా రూ.64 లక్షల నుంచి రూ.1.4 కోట్ల క్యాటగిరీలో ఉన్న దుకాణాలే. లాటరీ విధానంలో ఇప్పటికే రూ.900 కోట్లు నష్టపోయిన ప్రభుత్వం తాజా పరిణామాలతో మరో రూ.400 కోట్లు నష్టపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో 390 దుకాణాలకు గాను 80 దుకాణాల్లో , హైదరాబాద్ లో 212 దుకాణాలకు గాను 30 దుకాణాలకు, మెదక్ జిల్లాలో 165 దుకాణాలకు గాను 25 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆదిలాబాద్‌లో 207 దుకాణాలకుగాను 50 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. విశాఖపట్టణంలోని 406 దుకాణాలకుగాను 120 దుకాణాలకు, చిత్తూరులో 458 దుకాణాలకుగాను 95 దుకాణాలకు, కృష్ణా జిల్లాలో 335 దుకాణాలకుగాను 51 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. గిట్టుబాటు కాదనే కారణంతో వ్యాపారులు ఇక్కడి దుకాణాలకు దరఖాస్తు చేసుకోలేదు.

డిస్టిలరీలకు ఇస్తే బ్రాండ్ ప్రమోషన్ ముప్పు

ఎవరూ కూడా లెసైన్స్ తీసుకోని దుకాణాలను ఏపీబీసీఎల్ ద్వారా నడిపిస్తామని మద్యం పాలసీ నియమావళిలో పేర్కొన్నప్పటికీ ఆచరణలో అది సాధ్యం కాదని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ని దుకాణాలను నడిపించేంత సిబ్బంది ఏపీబీసీఎల్‌కు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన దుకాణాలను ఆంధ్రప్రదేశ్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) ద్వారా డిస్టిలరీలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే జరిగితే డిస్టిలరీల యాజమాన్యం వారి బ్రాండు ప్రమోషన్ కోసం పాట్లు పడుతుంది. అమ్మకాలు పెంచుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. దీని ద్వారా మరిన్ని బెల్టు దుకాణాలు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.

జిల్లాల్లో తగ్గని జోరు..: జిల్లాల్లో ఎక్సైజ్ అధికారుల అంచనాలకు తగ్గట్లుగానే వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోమవారం గడువు ముగియడంతో వ్యాపారులు భారీగా కదిలొచ్చారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉన్నారు. 

ఉదయం కాస్త మందకొడిగా సాగినా మధ్యాహ్నానికి వేగం పుంజుకుంది. సాయంత్రం ఐదు గంటల తరువాత డీసీ కార్యాలయాల వద్ద ఔత్సాహికులు బారులు తీరారు. వీళ్లందరికీ కూడా టోకెన్లు ఇచ్చి దరఖాస్తుకు అనుమతించారు. జిల్లాల్లో దరఖాస్తు చేసుకోలేనివారికి హైదరాబాద్‌లోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక దరఖాస్తుల జాబితాను క్రోడీకరించి ఆ వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు లాటరీ పద్ధతిలో లెసైన్స్‌దారులను ఎంపిక చేస్తారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!