నిర్మించితీరుతామన్న చంద్రబాబు
అసెంబ్లీలో వద్దని ఇప్పుడీ డ్రామా ఏమిటన్న లగడపాటి
దుర్గమ్మ సాక్షిగా ఇరుపక్షాల
బలప్రదర్శనకు యత్నాలు
ఆరుగంటల హైడ్రామా...తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు, భక్తులు
విజయవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతులు కుదేలవుతున్నారు. ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధరలు అన్నదాతలను అప్పులపాలు చేస్తుంటే...అవేవీ పట్టని పాలక, ప్రధాన ప్రతిపక్షాలు ఉత్తుత్తి ఆందోళనలతో ప్రచార ఆర్భాటానికి తెర తీశాయి. విజయవాడలో దుర్గమ్మ సాక్షిగా ‘ప్లై ఓవర్ ’ వంతెన నిర్మాణం గురించి సోమవారం పోటాపోటీగా బల ప్రదర్శనకు దిగాయి. సాక్షాత్తూ తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు తమపార్టీ చేపట్టిన ‘మహా ధర్నా’లో పాల్గొన్నారు . ప్రతిగా ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసలు వంతెన నిర్మాణమే అక్కరలేదంటూ ‘అభివృద్ధి సదస్సు’ పేరిట హంగామా చేశారు. ఇరువురు నేతల వైఖరితో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉనికి కోసం రెండు పక్షాలు ఆరుగంటల పాటు జాతీయ రహదారిపై పోటాపోటీగా సృష్టించిన హైడ్రామాతో నగరవాసులు బిక్కుబిక్కుమని గడిపారు.
మ్యానిఫెస్టోలో ఫ్లైఓవర్: బాబు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దుర్గగుడి వద్ద ‘ఫ్లైఓవర్’ నిర్మించకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నిర్మించి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. కుమ్మరిపాలెం సెంటర్‌లో నిర్వహించిన మహాధర్నా నుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని తమ మ్యానిఫెస్టోలో పెడతామని ప్రకటించారు. ప్లైఓవర్ నిర్మించడం సీఎంకు, కేంద్ర ప్రభుత్వానికి చేతకాకపోతే తన వద్దకు ఇంజనీర్లను పంపితే వారికి నేర్పుతానని సవాల్ విసిరారు. ఇన్నర్ , అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తరువాత ఫ్లైఓవర్ నిర్మిస్తామంటే అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
ఇక్కడ కొందరు నేతలు తెలుగుదేశంతో పెట్టుకోవాలని చూస్తున్నారని వారు ఫినిష్ అయి పోతారని హెచ్చరించారు. తాను ఇందిర, రాజీవ్‌గాంధీ వంటి వారితోనే పోరాడానని ఆయన గుర్తుచేశారు. ఫ్లైఓవర్ కోసం రూ. వంద కోట్లు కావాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 35 కోట్లే మంజూరు చేసి ప్రజల్ని మభ్యపెడుతోందని చెప్పారు. బెల్టుషాపులను నియంత్రించమని తాము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తూ బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.
అభివృద్ధి అంటే ఏమిటో బాబుకు చెబుతా : లగడపాటి
చంద్రబాబునాయుడిని కలిసి అభివృద్ధి అంటే ఏంటో తాను వివరిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హడావుడి చేశారు.
పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద అభివృద్ధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత పోలీసు వలయాన్ని ఛేదించుకుని బాబును కలిసేందుకు యత్నించారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు లగడపాటిని అడ్డుకున్నారు. 2002లో అప్పటి కాంగ్రెస్ ఎంఎల్‌ఏ మండలి బుద్ధప్రసాద్ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ అంశాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తే..అక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టి సాధ్యం కాదని చంద్రబాబు చెప్పారని లగడపాటి గుర్తుచేశారు. ఈ రోజున ఏ మొహం పెట్టుకుని ధర్నాకు వచ్చారని ఆయన బాబును ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు వాడుకలోకి వస్తే.. ట్రాఫిక్ మళ్లించిన తర్వాత విస్తరణ ఆలోచిస్తామన్నారు. సూర్యుడు అస్తమించేలోగా చంద్రబాబును కలిసి అభివృద్ధి అంటే ఏంటో చెబుతామని, ఒక్కో కార్యకర్త గబ్బర్‌సింగ్‌లా కెవ్వు కేక అనిపించాలని లగడపాటి ప్రకటించారు.
యువ కార్యకర్తలు రచ్చ చేయాలని రెచ్చగొట్టారు. ఢిల్లీని శాసించానని చెప్పుకునే చంద్రబాబు గల్లీ నాయకులు పెట్టిన ధర్నాకు రావడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ధర్నా వద్ద బాబును కలవడం సాధ్యం కాకపోవడంతో విమానాశ్రయం వద్ద ఆయన కోసం ఎంపీ ఎదురుచూశారు. తిరువూరు పర్యటన ఆలస్యం కావడంతో చంద్రబాబు తన షెడ్యూల్‌ను మార్చుకుని రైల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడంతో లగడపాటి శపథం నెరవేరలేదు. బాబును కలవకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. మంగళవారం బాబు ఇంటి ముందు ధర్నా చేసైనా తన వాదన వినిపిస్తానని స్పష్టం చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకూ జాతీయ రహదారిపై తెలుగు దేశం ధర్నా, లగడపాటి అనుచరుల హడావుడికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దుర్గగుడికి వచ్చిన భక్తులు కూడా ఈ రగడ చూసి వెనుతిరిగారు.
బాబుకు ఎమ్మెల్యేల షాక్ : విజయవాడ ధర్నాకు వచ్చిన చంద్రబాబుకు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు షాకిచ్చారు. అసంతృప్తితో ఉన్న నూజివీడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చంద్రబాబు పాల్గొన్న ధర్నాకు హాజరుకాలేదు. సోమవారం పూర్తిగా ఆయన నూజివీడులోని తన కార్యాలయంలోనే గడిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కూడా చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా లగడపాటి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
No comments:
Post a Comment