YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 5 July 2012

జేడీ లక్ష్మీనారాయణను విచారిస్తాం! సీవీసీ ప్రదీప్‌కుమార్ హామీ ఇచ్చారు

* వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వెల్లడి
* దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తామన్నారు
* సీబీఐ కక్షసాధింపు చర్యలను సావధానంగా విన్నారు
* జేడీకి నోటీసిచ్చి, వివరణ కోరతామన్నారు: మైసూరారెడ్డి
* సీవీసీతో 50 నిమిషాలు భేటీ అయిన విజయమ్మ
* జగన్‌ను దోషిగా చూపేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది
* వ్యతిరేక మీడియాకు కావాలనే జేడీ లీకులిస్తున్నారు
* మెమోరాండం అందించిన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు
* సీబీఐ దర్యాప్తు తీరు జాతీయ నేతల దృష్టికి..
* కేరళలోనూ సీపీఎం నేతలను సీబీఐతో వేధిస్తున్నారన్న కారత్

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరిని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) ప్రదీప్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. మేం సమర్పించిన మెమొరాండంను ఆయన పరిశీలించారు. మా ఫిర్యాదుపై పూర్తి సానుకూలంగా స్పందించారు. మేం చెప్పిన ప్రతి పాయింట్‌నూ నోట్ చేసుకున్నారు. ఈ విషయంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణను పిలిపించి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌పై దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తామని కూడా చెప్పారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. 

రాష్ట్రంలో రైతు సమస్యలను, జగన్‌పై సీబీఐ దర్యాప్తు తీరుతెన్నులను జాతీయ స్థాయి నేతలకు వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. వారు గురువారం ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్, తృణమూల్ కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి సుల్తాన్ అహ్మద్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌లతో పాటు సీవీసీ ప్రదీప్‌కుమార్‌తో కూడా భేటీ అయ్యారు. అనంతరం శోభ, సుచరిత మీడియాతో మాట్లాడారు. 

సీబీఐని అడ్డుపెట్టుకొని జేడీ లక్ష్మీనారాయణ ఏ విధంగా జగన్‌ను కక్షపూరితంగా ఇబ్బందులు పెడుతున్నారో సీవీసీకి వివరించాం. జేడీగా ఉంటూ విలేకరులకు స్వయంగా ఫోన్ చేయడం, కొందరు వ్యక్తులకు మరీ ఎక్కువగా ఫోన్ చేయడం వంటివాటిని ఆయన ముందుంచాం. వాటన్నింటిపై దర్యాప్తు జరిపించాలని కోరాం. సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారిని ఎలా ఇబ్బందులు పెడుతున్నదీ, రాజకీయ కుట్రలో భాగంగా జగన్‌ను దోషిగా చూపాలని ఎలా ప్రయత్నిస్తున్నదీ వివరించాం. సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారందరిపై ఒత్తిడి తెచ్చి, ఎలాగోలా జగన్ పేరు చెప్పించేలా ప్రయత్నిస్తున్న వైనాన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లాం. వీటిపై సీవీసీ చాలా సానుకూలంగా స్పందించారు. మేం చెప్పిన ప్రతీ పాయింట్‌నూ నోట్ చేసుకున్నారు. జేడీని పిలిపించి అన్నీ విచారిస్తామని, ఎవరి ప్రభావమూ లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకుంటామని విజయమ్మకు హామీ ఇచ్చారు’ అని వారు వివరించారు. జేడీకి నోటీసులిచ్చి, ఆయన వివరణ కోరతామని కూడా సీవీసీ చెప్పారని మైసూరా వెల్లడించారు. 

సీబీఐ దురాగతాలకు సాక్ష్యాలివిగో
సీవీసీ ప్రదీప్‌కుమార్‌తో విజయమ్మ దాదాపు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనేక అంశాల్లో జగన్‌పై సాగుతున్న కక్షసాధింపు దర్యాప్తు తీరుతెన్నులను ఆయన ముందుంచారు. జగన్‌పై సీబీఐ కేసు నమోదైంది మొదలు అరెస్టు వరకు, ఆ తర్వాత బెయిల్ రాకుండా సృష్టిస్తున్న అడ్డంకుల గురించి సమగ్రంగా వివరించారు. ‘‘హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ, వాటిలో ఉన్న ‘ప్రభుత్వం’ అనే పదాన్ని తొలగించి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చింది. జగన్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరించింది’’ అని విజయమ్మ వివరించారు. 

ఎమ్మార్ భూముల కుంభకోణం మూలాలు 2004కు ముందే ఉన్నా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును సీబీఐ ఇంతవరకూ ప్రశ్నించలేదు. జగన్‌పై పది నెలలుగా విచారణ జరుపుతూ కూడా ఇంతకాలం మిన్నకుండి, తీరా ఉప ఎన్నికల సమయంలో ఆయనను అరెస్టు చేసింది. అదీ కోర్టు నుంచి సమన్లు అందుకున్నాక, ‘ఈ దశలో సీబీఐ అరెస్టు చేసే అవకాశమే లేదు. కాబట్టి ముందస్తు బెయిలు అవసరం లేదు’ అని కోర్టు స్పష్టంగా అభిప్రాయపడ్డ తర్వాత కూడా జగన్‌ను అరెస్టు చేసింది. దీన్ని కక్షపూరిత చర్యగానే మేం భావిస్తున్నాం’’ అని ఆమె వివరించారు. 

జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకుంటున్న తీరును కూడా సీవీసీ ముందుంచారు. బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగేలా చేసేందుకు కావాలనే చార్జి షీట్ల మీద చార్జిషీట్లు దాఖలు చేస్తోందన్నారు. ఇటీవలే జగన్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు రోజు అనుబంధ చార్జిషీటు దాఖలు చేసి తన ప్రతికారేచ్ఛను నిరూపించుకుందని వివరించారు. సీబీఐ జేడీ తీరును, ఎంచుకున్న మీడియాకు విచారణపై ఆయన ముందస్తు లీకులిస్తున్న వైనాన్ని ఆధారాలతో సహా సీవీసీ ముందుంచారు. 

‘‘మా ప్రత్యర్థి వర్గ మీడియాకు ఇలా ముందస్తు లీకులివ్వడం ద్వారా ప్రజల్లో మమ్మల్ని చులకన చేసేందుకు జేడీ ప్రయత్నించారు. ఆ స్థాయి వ్యక్తికి ఇది తగునా?’’ అని ప్రశ్నించారు. వీటితో పాటు అనేక అంశాలను సీవీసీ దృష్టికి తీసుకెళ్లిన విజయమ్మ.. దర్యాప్తు ముసుగులో అక్రమ కేసులు బనాయిస్తూ, ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న తీరును నిబద్ధత గల అధికారిగా అడ్డుకోవాలని ఆయనను కోరారు. ఆమె చెప్పిన వివరాలన్నింటినీ నోట్ చేసుకున్న సీవీసీ, దీనిపై జేడీ వివరణ కోరుతామని హామీ ఇచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా, దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

బెదరొద్దన్న కారత్.. అండగా ఉంటామన్న సుల్తాన్
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేంద్రమంత్రి సుల్తాన్ అహ్మద్ (తృణమూల్ కాంగ్రెస్)లతో కూడా విజయమ్మ బృందం విడివిడిగా భేటీ అయింది. సీబీఐ కక్షపూరిత దర్యాప్తు తీరుతెన్నులను వివరిస్తూ వారికి మెమొరాండం సమర్పించింది. సీబీఐని రాజకీయ దురుద్దేశాలకు వాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటేనని కారత్ అన్నారు. కేరళలో తమ పార్టీ నేతలపై ఇలాగే అక్రమ కేసులు బనాయించి సీబీఐని ఉసిగొల్పారని వివరించారు. ‘‘సీబీఐ వైఖరిని మేం మొదటి నుంచీ తప్పుబడుతున్నాం. దానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని గట్టిగా కోరుతున్నాం. సీబీఐ దాడులపై బెదరొద్దు. దీనిపై మా పార్టీ అండగా ఉంటుంది’’ అంటూ విజయమ్మ బృందానికి ఆయన భరోసా ఇచ్చారు. 

భేటీ అనంతరం సీపీఎం కేంద్ర కమీటీ సభ్యుడు శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు సీబీఐని వాడుకుంటున్నారనే మచ్చ ఎప్పటినుంచో ఉందన్నారు. దాన్ని చెరిపేసేందుకు సీబీఐ ప్రయత్నించాలని హితవు పలికారు. జేడీ గనుక సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించి ఉంటే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సుల్తాన్ అహ్మద్ కూడా విజయమ్మ బృందానికి ఇలాంటి హామీయే ఇచ్చారు. వారిచ్చిన మెమొరాండం కాపీని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి స్వయంగా అందిస్తానని వివరించారు. అన్ని విషయాలనూ ఆమె దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. భవిష్యత్తులో తృణమూల్ నుంచి పూర్తి మద్దతుంటుందని కూడా హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!