YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 4 July 2012

ప్రధానికి విజయమ్మ అందజేసిన లేఖ పూర్తిపాఠం

* రాష్ట్రంలో అన్నదాతలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు 

రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అందజేసిన లేఖ పూర్తిపాఠమిదీ..

గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి..
విపత్తులు, కరువుకాటకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులు గత రెండేళ్లుగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందడం లేదు. పెట్టుబడి ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, పండించిన పంటకు మార్కెట్‌లో సరైన ధరలు లేకపోవడంతో దేశంలోనే తొలిసారిగా రైతులు పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించారు. క్రాప్‌హాలిడే ప్రకటించింది నీటిలభ్యత లేనిచోటో లేదా మెట్ట ప్రాంతాల్లోనే కాదు.. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడే డెల్టా ప్రాంతంలో. దీన్నిబట్టే రైతులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

రుతుపవనాలు వచ్చినా ప్రస్తుత ఖరీఫ్‌కుగాను రాష్ట్రంలో సాగు కార్యకలాపాలు ఇంకా పుంజుకోలేదు. సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా సరైన చర్యలు తీసుకోకపోయినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలిగే ప్రమాదం ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అదికూడా అందుబాటు ధరలో లభ్యంకాకపోతే రైతులు ఎదుర్కొనే దుర్భర పరిస్థితిని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నా. సాగు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. గడచిన రెండేళ్లలోనే ఎరువుల ధరలు 12సార్లు పెరిగాయి. సకాలంలో విత్తనాలు దొరకకపోవడం, బ్యాంకు రుణాలు అందకపోవడంతోపాటు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం కావటంతో నదీ జలాల్లో సముచిత వాటా దక్కకపోవటం కూడా రైతుల కష్టాలకు కారణమవుతోంది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే ఆయువుపట్టు అన్న సంగతి నిర్వివాదాంశం. కానీ ఏటేటా సాగు విస్తీర్ణం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకరంగా కనిపిస్తోంది. అందుకు మా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలే ఉదాహరణ. పచ్చటి పైర్లతో అలరారే ఆ ప్రాంతంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 

వ్యవసాయ రంగాన్ని మార్కెట్ శక్తులు శాసిస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనమవడం కూడా ఆ రంగంపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపుతోంది. అలాగే సీజన్ ప్రారంభానికి ముందే బడా వ్యాపారులు విత్తనాలు, ఎరువుల అక్రమ నిల్వలకు పాల్పడుతూ రైతు ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతు ప్రయోజనాలను దెబ్బతీసేలా నిబంధనలు సడలించాలంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. 

2010-11లో డీఏపీ ఎరువు బస్తా రూ. 527.45 ఉండేది. ఇప్పుడు దాని ధర రూ. 1,272.35కు చేరింది. పొటాషియం, యూరియా, నైట్రోజన్, అమ్మోనియా తదితర ఎరువుల రేట్లు కూడా ఇదే తరహాలో పెరిగిపోయాయి. అంతర్జాతీయ ముడి వస్తువుల ధరలకు అనుగుణంగా ఎరువుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోయేందుకు అనుమతిస్తున్న ‘పోషకాధార ఎరువుల సబ్సిడీ’ విధానమే ఈ పరిస్థితికి కారణం. కేంద్రీకృత ఎరువుల పంపిణీ విధానం కూడా రైతులకు లబ్ధి చేకూర్చడం లేదు. రాష్ట్రాల నెలవారీ అవసరాల మేరకు ఎరువులు రావడం లేదు. డిమాండ్, సరఫరా మధ్య భారీ తేడా ఉండడంతో రైతులు ఇబ్బందులపాలవుతున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను, ప్రకటించిన సహాయ ప్యాకేజీలను అమలు చేయడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కిందటేడాది తిండి గింజల దిగుబడి 30 శాతం పడిపోయింది. రూ. 15,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ధాన్యం సేకరణ కూడా సరిగా లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువ ధరకే తెగనమ్ముకుంటున్నారు. వరి ధాన్యాన్ని మద్దతు ధర కంటే రూ. 200 నుంచి రూ. 300 తక్కువకు అమ్ముకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 

ప్రస్తుతం పెరిగిపోయిన పెట్టుబడి ధరలతో పోల్చుకుంటే కేంద్ర ప్రభుత్వం క్వింటాలు వరి ధాన్యానికి ప్రకటించిన రూ. 1,250 ఏమాత్రం సరిపోదు. ఇది పెట్టుబడి ఖర్చుల్లో 75 శాతానికి కూడా సరిపోదు. జాతికి ఆహార భద్రత కల్పించడంతోపాటు రైతుల జీవనోపాధి గురించి కూడా ఆలోచించాల్సి అవసరం ఉంది. గ్రామీణ భారతాన్ని, రైతును కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చే దిశగా కొన్ని విధానాలను సవరించడం లేదా పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుతం ఉన్న ఎరువుల ధరలను 2009 నాటి స్థాయికి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. పెట్టుబడి ఖర్చులను కనీసం 50 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఎన్నో కమిటీలు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వ్యవసాయంపై స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని, కనీస మద్దతు ధర పొందడం అనేది రైతుకు ఉన్న చట్టపరంగా అమలయ్యే రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!