ప్రజలకు ఏది అవసరం? వారి కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చి అందుకు చిత్తశుద్ధితో యోచన చేసేవారు. అధికారులతో సమస్యల గురించి, పథకాల గురించి ఆలోచనలు చేసేప్పుడు వారిని విశ్వాసంలోకి తీసుకుని వారు చెప్పే అంశాలు అవలోకించి తదుపరి చర్యలు చేపట్టడం చాలా మంది ఐఏఎస్ అధికారులు నేటికీ గుర్తు పెట్టుకుంటారు.‘బతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. చచ్చిన చేప ప్రవాహవేగంలో కొట్టుకుపోతుంది’. మహానేత మావో ప్రజానాయకులకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పిన మాట ఇది. ఒక కార్యకర్త లేదా నాయకుడు నీటిలో చేపలాగా నిరంతరం ప్రజల గుండెల్లో నిలవాలి. ప్రజలతో ఐక్యం కావాలి. వారి విశ్వాసాన్ని పరిపూర్ణంగా చూరగొనాలి. ఈ మాటలు కూడా ఆ మహానేతే చెప్పారు. వైఎస్సార్ రాజకీయ జీవితంలో ఈ మాటలు అక్షరసత్యాలు.
పేరుకు కాంగ్రెస్ నాయకుడే అయినా ప్రజల సమస్యలపై రెండు దశాబ్దాలపాటు జరిపిన ఆందోళనలు, రాజకీయ పోరాటాలు ఆయనను విలక్షణ నేతగా తీర్చిదిద్దాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా వైఎస్ తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం తనను తాను ఉన్నతీకరించుకున్న తీరు, అవమానాలకు, అపనిందలకు, అపోహలకు గురవుతూనే ఆ పార్టీలో కొనసాగుతూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన తీరు ప్రశంసనీయం. ఆయన అవలంబించిన దీక్షలు, పాదయాత్రలు, పోరాటాలు, ఒక్కొక్కటీ ఒక్కో చరిత్ర.
కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ నాయకత్వంలో అమలు చేసిన మిశ్రమ ఆర్థిక విధానాన్ని, అలీన విధానాన్ని, పంచవర్ష ప్రణాళికలను వైఎస్ లోతుగా అధ్యయనం చేశారు. అలాగే ఇందిరాగాంధీ సంక్షేమ కార్యక్రమాలు, భూసంస్కరణలు ఆయనపై ఎనలేని ప్రభావం చూపాయి. ఇరవై ఏళ్లుగా ప్రభుత్వాలు ఆచరిస్తూ వస్తున్న బహుళ జాతిసంస్థల, ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాలు మన ప్రజల భవిష్యత్తును ప్రతికూలంగా ప్రభావితం చేయడాన్ని వైఎస్ గమనించారు.
కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ పాలనా కాలంలో అన్ని రంగాల్లో సంక్షోభం ఏర్పడటం గమనించిన వైఎస్ తన భావి రాజకీయార్థిక విధివిధానాలను ఖరారు చేసుకున్నారు. గ్రామీణ జీవనంలో, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ఆయనను కలచివేసింది. గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు వలసపోవడం, రైతన్నకు వ్యవసాయం గిట్టుబాటుకాకపోవడం, చేసిన అప్పులు తీరక చివరకు ఆత్మహత్యలను రైతాంగం పరిష్కార మార్గంగా ఎంచుకోవడం... సభ్యసమాజానికి సవాలుగా వైఎస్ భావించారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి రైతన్నకు భరోసా ఇచ్చే పాలన అందించగలనని హామీ ఇచ్చారు.
సరిగ్గా ఇక్కడే వైఎస్, కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిన సరళీకృత ఆర్థిక విధానాలతో దాదాపు రాజకీయంగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉచిత విద్యుత్తు, రైతులకు అప్పులపై రాయితీ, రుణాల మాఫీ, జలయజ్ఞం వంటి ఎన్నెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను ఆయన చేపట్టడాన్ని యూపీఏ సర్కారు జీర్ణించుకోలేకపోయింది. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, మహిళలకు పావలా వడ్డీకి రుణాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు, రాజీవ్ ఉద్యోగశ్రీ... తదితర అనేక సంక్షేమ- అభివృద్ధి పథకాలు... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలుకు నోచుకోలేదు.
దిగ్విజయ్‌సింగ్, గెహ్లాట్, ఎస్‌ఎం కృష్ణ వంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చేకూర్చని ప్రతిష్టను, విజయాలను వైఎస్ చేకూర్చారు. ప్రజలకు ఏది అవసరం? వారి కోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చి అందుకు చిత్తశుద్ధితో యోచన చేసేవారు. అధికారులతో సమస్యల గురించి, పథకాల గురించి ఆలోచనలు చేసేప్పుడు వారిని విశ్వాసంలోకి తీసుకుని వారు చెప్పే అంశాలు అవలోకించి తదుపరి చర్యలు చేపట్టడం చాలా మంది ఐఏఎస్ అధికారులు నేటికీ గుర్తు పెట్టుకుంటారు.
సాదాసీదాగా కనిపించడం వలన, ఎదుటివారికి ఆయనతో మనసువిప్పి తమ సమస్యలు చెప్పుకోవచ్చు అనే భావన కలిగేది. అదే ఆయన ప్రత్యేకత. సమస్యలపై చర్చ జరిగినపుడు తన లోతైన అవగాహనను ఎదుటివారితో పంచుకోవడం, తనకు తెలియని అంశాలను ఎదుటివారు వివరిస్తున్నపుడు వాటిని అర్థం చేసుకొని, చెప్పేవారిని అభినందించడం ఆయన లక్షణాల్లో ఒకటి. వైఎస్ ఎంపీగా ఉండగా ఆయన వద్ద శర్మ అనే ఒక రిటైర్డ్ గ్రూప్-1 అధికారి పనిచేశారు.
అనేక మంది ఎంపీల దగ్గర తను ఆఫీసర్‌గా పనిచేశానని, కానీ, వైఎస్ లాగా ఢిల్లీ సెక్రటేరియట్‌లో పనులు నెరవేరేదాకా పట్టువిడవక కృషి చేసిన నేతను చూడలేదని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలు వారి నోటే వినడం, వాటికి తగు విధంగా స్పందించి, పరిష్కారాలకు యంత్రాంగాన్ని సిద్ధంగా పెట్టుకోవడం ఆయనకు నిత్యకృత్యం. తనను కలవడానికి వచ్చిన సందర్శకుల సమస్యలు విని వినతి పత్రాలను తీసుకొని అక్కడికక్కడే పరిష్కారానికి నివేదించడం ఆయనలో ఓ విలక్షణమైన శైలి. వైఎస్ దగ్గరకు సమస్యలతో వచ్చిన తన అభిమానులను, పేరుపేరునా గుర్తుపట్టడం తాను వైఎస్ దగ్గరే చూశానని ముద్దుకృష్ణమనాయుడు ఒక సందర్భంలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైఎస్ మాదిరి ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రీ అందించకపోవడం ఆయన ప్రజాసృ్ప హకు తార్కాణం. సామాన్య కార్యకర్తల బాగోగులను, వారి కుటుంబ సమస్యలను పట్టించుకుని వారి అవసరాలు తీర్చడానికి శక్తిమేర కృషి చేయడం వైఎస్‌లో మనం చూస్తాం. ఒకసందర్భంలో తన పుట్టిన రోజున తన భార్యకు సిగరెట్ మానేస్తున్నట్లు మాటిచ్చి చెయిన్ స్మోకర్‌గా ఉన్న తాను నాన్‌స్మోకర్‌గా మారిపోవడం గురించి ప్రస్తావిస్తూ.. ‘మనం అనుకుంటే సాధించగలం. కావాల్సిందల్లా పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసం..,’ అంటూ చెప్పేవారు.
కొందరు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఒక మేర ముఖ్యమంత్రులుగా ఎదగడానికి ఆయన నుంచి సహాయ సహకారాలు పొంది నేడు ఆయనపై ఆరోపణలు గుప్పించడం వారి లజ్జారహితమైన సంస్కృతికి నిలువుటద్దం. అవినీతి, అక్రమాలతో సంపాదించిన డబ్బును ఢిల్లీ పెద్దలకు వైఎస్ చేర్చాడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామోజీరావు, చంద్రబాబులు అదే పనిగా ఆరోపణలు గుప్పించేవారు.
నేడు అదే చంద్రబాబు, అదే రామోజీతో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి సోనియాగాంధీ చేతులు కలపడం, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించడం ప్రజలు సహించలేకపోతున్నారు, ఇటీవలి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వైస్ చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు పొందిన ప్రజల గుండెలపై ఆయన చెరగని ముద్ర వేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.
వైఎస్ బలమైన ప్రజా పునాది కలిగిన శక్తిమంతమైన నాయకుడు. అందుకే ఆయన ప్రత్యర్థులు కూడా బలమైన వాళ్లే. ప్రత్యేకించి కాంగ్రెస్‌ను దాదాపు కూకటివేళ్లతో పెకలించి రాష్ట్రం నుంచి తరిమికొట్టిన టీడీపీని తిరిగి చిత్తుగా రెండుసార్లు ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకొచ్చిన ఖ్యాతి వైఎస్‌కే దక్కుతుంది. ఆ పార్టీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబులకు వైఎస్‌కు లేని రాజకీయ అనుకూలాంశం ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయపార్టీ కావడం, ఆ పార్టీలో గ్రూపులు ఉండటం, ప్రతిదీ అధిష్టానమే నిర్ణయించే ఆనవాయితీ ఉండటం వైఎస్‌కు అననుకూలమైన అంశం. వైఎస్ తరచుగా నవ్వుతూ ఓ మాట చెబుతుండేవారు.
అదేమంటే కాంగ్రెస్ పార్టీలో గల్లీస్థాయి నాయకుడు ఢిల్లీలో ‘జెయింట్ లీడర్’. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్లుగా ప్రజల్లో ఏ మాత్రం బలమైన పునాది లేని నాయకులు అక్కడ ఓ వెలుగు వెలిగేవారు. వారి చుట్టూ రాష్ట్ర ముఖ్యమంత్రులు క్రమశిక్షణ పేరుతో, అధిష్టానం పేరుతో వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ ఢిల్లీ పాదుషాల ముందు సామంతరాజులు పడిగాపులు పడినట్లు వేచి ఉండే ధోరణి ఒకటి బలంగాఉండేది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నాయకత్వాన్ని బలపడకుండా ఎల్లవేళలా అసమ్మతి కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ రాష్ట్ర నాయకులను ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితిని సృష్టిస్తూ ఉండేది. ఈ స్థితిని వైఎస్ ఎదుర్కొని పరిష్కరించిన తీరు అనన్య సామాన్య మైనది. అధిష్టానంతో తలపడ్డాడు... వ్యతిరేకించాడు... అనే అభిప్రాయం కలగకుండా దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ సాధించనన్ని పథకాలను, నిధులను కేంద్రం నుంచి సాధించడం వైఎస్ రాజకీయ పరిణతికి, విజ్ఞతకు నిదర్శనం. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయం ఢిల్లీ పొలిమేరలకుసైతం వెళ్లకుండా నిరోధించి, స్థానిక నాయకుల మధ్య సమన్వయం సాధించి, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే శక్తిమంతమైన మీడియాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు.
వైఎస్ స్వతహాగా దార్శనికుడు. సరళీకృత ఆర్థిక విధానాల కొనసాగింపు వల్ల రాష్ట్రంలో ఏర్పడ్డ ఆర్థిక, వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికిగాను, మన్మోహన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలకు వైఎస్ మానవీయ కోణాన్ని జోడించారు. దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు రైతుల ఆత్మహత్యలను, వలసలను, వ్యవసాయ సంక్షోభాన్ని గుర్తించానికి నిరాకరించి, వ్యవసాయం దండగ అంటూ బాహాటంగా ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించంలో నిర్లక్ష్యం వహించారు. నీటి వనరుల వినియోగానికి, విద్యుత్తు రంగంలో ఏర్పడ్డ సంక్షోభ పరిష్కారానికి తగిన చొరవ చూపలేదు. బాబు నిర్వాకం ప్రపంచ బ్యాంకు విధానాల నుంచి పుట్టుకొచ్చిందే.
వైఎస్ జరిపిన రాజకీయ పోరాటంలో అత్యంత ప్రాముఖ్యం కలది, ప్రజల పట్ల నిబద్ధతను చాటి చెప్పింది... గ్యాస్ నిక్షేపాల తరలింపును వ్యతిరేకిస్తూ రిలయన్స్‌తో ఆయన జరిపిన పోరాటం. రిలయన్స్‌పై ఆయన సాగించిన పోరు నేటికీ ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ చర్చను ప్రేరేపించిన సందర్భం మరొకటి ఉండదు. ఒక సందర్భంలో 1996లో వైఎస్, డీఎల్ రవీంద్రారెడ్డి ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ‘‘2001కి బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి ముగుస్తుంది. ఈలోపున మనం ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తే 2001లో ట్రిబ్యునల్ పునఃపంపిణీలో రాష్ట్రానికి ఎక్కువ వాటా కృష్ణా జలాలు సాధించే అవకాశముంది. మీరు నిధులు వెచ్చించి ప్రాజెక్టులు పూర్తి చేసి ‘హీరో’ అనిపించుకుంటారా? లేదా ‘జీరో’ అవుతారా?’’ అంటూ ఆయన ఆనాడు చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు జీరో కావడానికే సిద్ధపడ్డారు.
నేడు వైఎస్ జయంతి బరువైన హృదయంతో జరుపుకోవాల్సి రావడం విచారకరం. 2009లో కాంగ్రెస్ పార్టీని విజయపథాన పయనింపజేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన మానస పుత్రిక ‘సాక్షి’ పత్రికపై, ఆయన కుటుం బంపై, ప్రత్యేకించి జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్ర ప్రజలు సముచిత స్థానం చూపించే రోజు ఎంతో దూరం లేదు. వైఎస్ జగన్ సంప్రదాయ కాంగ్రెస్ నాయకుల్లాగ తలవంచి అధిష్టానానికి జీ హుజూర్ అంటూ సాష్టాంగ ప్రణామాలు చేయలేదు కాబట్టి... ఇన్ని వేధింపులు, సాధింపులు.
రాష్ట్ర ప్రజలకు లభించిన అసాధారణ జననేత వైఎస్ జగన్. వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చేదిశగా కాంగ్రెస్ పయనిస్తుందని ముందుగానే గ్రహించి ఆ పార్టీని వీడి ప్రజల్లోకి జగన్ వచ్చిన తీరు రాష్ట్ర ప్రజల మన్ననలకు పాత్రమైంది. వైఎస్ కుటుంబంపై గౌరవాన్ని పెంచే విధంగా నేడు జగన్, విజయమ్మ, షర్మిలలు వైఎస్సార్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ, వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరే విధంగా చూడగలమని మాట ఇచ్చి వారి విశ్వాసం చూరగొన్నారు. ఆ కుటుంబానికి ఆశీస్సులు అందిస్తూ, పోరాటాలకు, త్యాగాలకు సిద్ధమై వెన్నంటి ఉండటమే వైఎస్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయన స్మృతికి అందజేయగల నివాళి.
No comments:
Post a Comment