YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 4 July 2012

కోర్టులను సీబీఐ అపహాస్యం చేస్తోంది

- ‘నార్కో’ పరీక్ష చట్టవిరుద్ధమని ‘సుప్రీం’ స్పష్టం చేసింది 
- జగన్, విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు 
- సుప్రీంకోర్టు తేల్చిచెప్పినా సీబీఐ నార్కో పరీక్ష కోసం పిటిషన్ వేసింది 
- గతంలో ఇదే ప్రత్యేక కోర్టు సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది కూడా 
- తమ పిటిషన్ విచారణార్హం కాదని తెలిసి కూడా సీబీఐ మళ్లీ కోరింది 
- నార్కో పరీక్షలు నిందితుని రాజ్యాంగబద్ధమైన హక్కును హరించటమే
- సీబీఐ దర్యాప్తులో జగన్, సాయిరెడ్డిలు పూర్తిగా సహకరించారు 
- చట్టవిరుద్ధమైన సీబీఐ పిటిషిన్‌ను కొట్టివేయాలి: న్యాయవాది విజ్ఞప్తి 
- దర్యాప్తులో భాగంగానే ఈ పరీక్షలకు అనుమతి ఇవ్వండి: సీబీఐ వాదన 
- ఇరువర్గాల వాదనలు పూర్తి... తీర్పు ఈ నెల 16వ తేదీకి వాయిదా 

హైదరాబాద్, న్యూస్‌లైన్: నార్కో అనాలసిస్ పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా.. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని వారి తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. 

జగన్, సాయిరెడ్డిలకు నార్కోఅనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం విచారించారు. జగన్, సాయిరెడ్డిల తరఫున హైకోర్టు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 2న ఇదే కోర్టు తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్ విచారణార్హం కాదని తెలిసినా దేశంలోనే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయటం తీవ్ర అభ్యంతరకరమన్నారు. 

కేవలం జగన్, సాయిరెడ్డిల ప్రతిష్టకు భంగం కలిగించేందుకే సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేసిందని ఆరోపించారు. నార్కోఅనాలసిస్‌తో పాటు ఇతర పరీక్షలకు అనుమతివ్వటం రాజ్యాంగం నిందితునికి కల్పించిన ప్రాథమిక హక్కులను హరించటమే అవుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఇటువంటి పరీక్షలకు అనుమతించలేమని హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థ ఇటువంటి పరీక్షలు నిర్వహించటం చట్టవిరుద్ధమని సెల్వి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బైర్రాజు రామలింగరాజు వర్సెస్ సీబీఐ కేసులోనూ ఇటువంటి పరీక్షలు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. 

తన మనస్సాక్షికి వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలకు అనుకూలంగా చెప్పాలని నిందితులను ఎవరూ బలవంత పెట్టలేరని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3), ఆర్టికల్ 21కి విరుద్ధమని నివేదించారు. దర్యాప్తు అధికారులు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండే హక్కును కూడా రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. జగన్, సాయిరెడ్డిలు సీబీఐ కస్టడీలో విచారణ సందర్భంగా వారికి తెలిసిన విషయాలు చెప్పారని, ఇద్దరూ సీబీఐ దర్యాప్తుకు పూర్తిగా సహకరించారని న్యాయవాది తెలిపారు. చట్టవిరుద్ధంగా దాఖలు చేసిన సీబీఐ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. 

జగన్, సాయిరెడ్డిలు తమ విచారణకు సహకరించలేదని, దర్యాప్తులో భాగంగానే వీరిద్దరికీ నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. చార్జిషీట్లు దాఖలు చేయటానికి ముందే సాయిరెడ్డికి ఈ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరామని, అయితే అప్పుడు కోర్టు నిరాకరించిందని తెలిపారు. ఇప్పటికే మూడు చార్జిషీట్లు వేశామని.. ఈ నేపథ్యంలో జగన్, సాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకే కోర్టు అనుమతి కోరుతున్నామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 

‘నార్కో’పై గతంలో జడ్జి ఏమన్నారంటే...
‘‘సీఆర్‌పీసీ 161 (2) కింద తనకు వ్యతిరేకంగా సేకరించే సాక్ష్యాల గురించి చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ చట్టం కల్పించింది. తాము అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధనం చెప్పితీరాలన్నది చట్టంలో నిషేధం. సత్యశోధన పరీక్షలో ఉపయోగించే మత్తు పదార్థాలతో మనిషి సహజసిద్ధమైన సృ్పహను కోల్పోతారు.

తనను అడిగే ప్రశ్నలకు సృ్పహలో ఉండి సమాధానాలు చెప్పలేరు. సత్యశోధన, పాలిగ్రాఫ్, బీప్ టెస్ట్‌ల ద్వారా తప్పనిసరిగా తమకు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కోరటం రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఆర్టికల్ 21, 20(3)కి పూర్తిగా విరుద్ధం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించటం, మానసిక స్థితిలోకి బలవంతంగా ప్రవేశించటమే అవుతుంది’’ అని సాయిరెడ్డికి ఈ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి నిరాకరిస్తూ అప్పటి సీబీఐ కోర్టు జడ్జి నాగమారుతిశర్మ ఫిబ్రవరి 2న తీర్పు ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!