YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 5 July 2012

జాతీయ స్థాయికి రాష్ట్ర రైతాంగ సమస్యలు

* ప్రధాని, పవార్‌కు వివరించడం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేయగలిగాం: విజయమ్మ
* అన్నదాతల సమస్యలపై ప్రధాని, పవార్ సానుకూలంగా స్పందించారు
* సీబీఐ కక్ష సాధింపు దర్యాప్తు తీరునూ జాతీయ నేతలకు వివరించాం.. నేతంలతా సానుకూలంగా స్పందించారు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: తమ ఢిల్లీ పర్యటన ఉద్దేశం నెరవేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను ప్రధాని మన్మోహన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌లకు వివరించడం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయగలిగామన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ సాగిస్తున్న కక్షసాధింపు చర్యలను ప్రధాని, పవార్‌లతో పాటు ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ సీనియర్ నేత బర్ధన్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుల్తాన్ అహ్మద్‌ల దృష్టికి తీసుకె ళ్లామని చెప్పారు. ‘మా పర్యటన ఉద్దేశం నెరవేరింది. ప్రధాని సహా ఇతర పార్టీల జాతీయ నేతలందరినీ కలిశాం. వారంతా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వారందరికీ కృతజ్ఞతలు’ అని విజయమ్మ పేర్కొన్నారు. 

రైతుల సమస్యలపై ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారని, రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. వరికి కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వకపోవడంపై శరద్‌పవార్ ఆశ్యర్యం వ్యక్తం చేశారని, ఈ విషయమై అధికారులకు ఫోన్ చేసి.. ఆరా తీశారని చెప్పారు. మిగతా వ్యవసాయ సమస్యలనూ పరిష్కరిస్తామని పవార్ హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ కేసులో సీబీఐ తీరును వారి దృష్టికి తీసుకెళ్లామని, విచారణను జాతీయ నేతలు తప్పుపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీటన్నింటిపై ప్రధానితో మాట్లాడతామని వారు హామీ ఇచ్చారని తెలిపారు.

వైఎస్ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టనని జగన్ ఏనాడో చెప్పారు
‘పది నెలల నుంచి విచారణ జరుగుతోంది. సాక్షి మీద దాడులు చేశారు. సాక్షి ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఇదే సమయంలో జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఉందన్నప్పుడు సీబీఐ అనుబంధ చార్జిషీట్ వేసింది. ఇలా ఎన్ని చార్జిషీట్‌లు వేస్తారు? ఎన్ని రోజులు జగన్‌ను జైల్లో పెడతారు?’ వంటి విషయాలపై జాతీయ నేతలతో మాట్లాడినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని కాంగ్రెస్ పెద్దలు చెప్పేదే నిజమైతే.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. 

‘అధికారంలోకి వస్తే వైఎస్ పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తానని జగన్ ఇచ్చిన హామీని ప్రజలు నమ్మారు. అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీలు కట్టబెట్టారు’ అని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది, మీరేమైనా వలసలను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘మా పార్టీ ఎప్పుడూ వలసలను ప్రోత్సహించదు. నాన్నగారి కష్టార్జితంతో వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టనని జగన్ ఎప్పుడో చెప్పారు. రైతు సమస్యల కోసం ఎమ్మెల్యేలు బయటకు రావడం వల్లే ఉప ఎన్నికలు జరిగాయి.. అంతేతప్ప వలసల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తమకు తాముగా వస్తే.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నవారు వస్తే ఆహ్వానిస్తాం’ అని విజయమ్మ బదులిచ్చారు. 

ప్రచారంలో నేను కన్నీరు కార్చానని చూపగలరా?
ఉప ఎన్నికల్లో సానుభూతే ప్రధానంగా పని చేసిందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని కొన్ని మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో విజయమ్మ ఖండించారు. ‘నా ప్రచారంలో నేనెక్కడైనా కన్నీరు కార్చానని చూపగలరా?’ అని ప్రశ్నించారు. ప్రచారంలో ధైర్యంగా ముందుకు పోయామని, ఎక్కడా కన్నీరు కార్చలేదని చెప్పారు. ‘వైఎస్ మరణించి దాదాపు మూడేళ్లవుతోంది. సానుభూతి మూడేళ్లు ఉంటుందా?’ అని ప్రశ్నించారు. వైఎస్ మరణం తర్వాత అధికార, విపక్షాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సమయంలో జగన్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జగన్ జైలు బయట ఉంటే మొత్తం సీట్లు గెలిచుండేవారమన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!