YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 6 July 2012

జగన్ విచారణకు ఈడీకి అనుమతి

సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
నేటి నుంచి 21వ తేదీ లోపు విచారించవచ్చు
న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. శనివారం నుంచి ఈనెల 21లోపు జగన్‌ను జైలులో ఈడీ అధికారులు విచారించుకోవచ్చని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ పూర్వ చైర్మన్, డెరైక్టర్ హోదాలో ఆయన్ను ఈడీ విచారించనుంది. ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్‌సింగ్ నేతృత్వంలో అసిస్టెంట్ డెరైక్టర్లు కమల్‌సింగ్, సుశీల్‌కుమార్, ఎస్.యానాదిరెడ్డి, వై.నరసింహారావులతో కూడిన బృందం జగన్‌ను జైలులో విచారించి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
అంతకు ముందు.. జగతి పబ్లికేషన్స్ చైర్మన్, డెరైక్టర్‌గా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 1న రాజీనామా చేశారని, ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా ఉన్నారన్న కారణంగా జగన్‌ను విచారించే అధికారం ఈడీకి లేదని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. దర్యాప్తు సంస్థల విచారణకు ఎవరు హాజరు కావాలన్నది సదరు సంస్థ నిర్ణయించుకుంటుందని, నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) దీన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. సంస్థ ప్రతినిధిగా ఎవరినైనా పంపే విచక్షణ చట్టం కల్పించిందని చెప్పారు. 

ఈ నోటీసులకు జగతి పబ్లికేషన్స్ స్పందిస్తూ.. వారు కోరిన సమాచారాన్ని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అందజేశారని, తర్వాత మే 25, జూన్ 14, 15 తేదీల్లో కూడా ఈడీ అడిగిన సమాచారాన్ని అందించారని నివేదించారు. జగతి పబ్లికేషన్స్ తరఫున కోర్టు విచారణకు కంపెనీ సెక్రటరీ సీపీఎన్.కార్తీక్ హాజరయ్యేందుకు ఇదే కోర్టు అనుమతిస్తూ జూన్ 20న ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కావలిస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజ్ఞప్తి చేశారు. జగన్‌ను విచారించేందుకు ఈడీ ఎటువంటి కారణాలు చూపలేదని, ఆధారాలు లేకుండా జగన్‌ను విచారించేందుకు అనుమతి కోరడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ వివరాలేవీ జగన్‌కు తెలియవని, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లేవీ చూడకుండా జగన్ ఈడీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈడీ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. 

కేసు తీవ్రత దృష్ట్యానే... ఈడీ

మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేయడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఈ మేరకు తమకు దర్యాప్తు జరిపే అధికారం ఉందని ఈడీ తరఫున న్యాయవాది గోపాలకృష్ణ గోఖలే వాదనలు వినిపించారు. ఇప్పటికే జగన్ సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారంపై ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్శెషన్ రిపోర్ట్) నమోదు చేశామని, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 కింద దర్యాప్తు అధికారి ఎవరికైనా సమన్లు, నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్ జైల్లో ఉన్నందునే విచారించేందుకు న్యాయస్థానం అనుమతి కోరుతున్నామని పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా రాజీనామా చేసినా జగన్‌ను ప్రశ్నించే అధికారం తమకుందని, జైలులోనే జగన్‌ను విచారిస్తామని పేర్కొన్నారు. కేసు తీవ్రత దృష్ట్యానే పలుమార్లు విచారించాల్సి వస్తోందన్నారు. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవిస్తూ విచారణకు అనుమతించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!