YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 4 July 2012

సాగు.. మరింత దుర్భరం

- గత వారం 37 శాతం తక్కువ వర్షపాతం
- 10 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం
- 17 శాతం తక్కువగా పంటల సాగు
- వ్యవసాయ శాఖ తాజా నివేదిక 

హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్తెలు కరిగిపోతున్నాయి. నెలలు గడుస్తున్నాయి. అన్నదాతను మాత్రం వరుణుడు కరుణించడంలేదు. ఆరుద్ర కార్తె ముగిసే నాటికి భూమి అంతా పంటలతో పచ్చగా కళకళలాడాల్సిన పల్లెలు వానల్లేక బీడు భూములతో వెక్కిరిస్తున్నాయి. ఆలస్యంగానైనా వర్షాలు వస్తాయని ఆశపడుతున్న రైతన్నకు... గత ఏడాది కరువును తలుచుకుంటే మాత్రం గుండెలో గుబులు పుడుతోంది. జోరు వానలు కురవాల్సిన గత వారంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్రంలోని తాజా వర్షపాతం, పంటల సాగుపై రూపొందించిన తాజా నివేదికను వ్యవసాయ శాఖ బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. 

బుధవారంనాటికి రాష్ట్రంలో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 19.6 సెంటీ మీటర్ల వర్షమే కురిసింది. ఖరీఫ్ సీజన్ మొదలైన జూన్ ఒకటి నుంచి జూలై 4 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 127.4 మిల్లీ మీటర్లు. రెండో దశ రుతుపవనాల రాకపోవడం, తుపాను ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ ఏడాది ఇప్పటికి 97.1 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇది 24 శాతం తక్కువ ఉండడంతో పంటలు సాగు కావడంలేదు. తొలకరి వర్షాలకు వేసిన విత్తులూ భూమిలో ఎండలకు మాడిపోతున్నాయి. 

చినుకే బంగారం... 
రైతన్నను గత ఏడాది నష్టాలపాలు చేసిన కరువు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు తర్వాత రాష్ట్రంలో వర్షాలు రాలేదు. నైరుతి రుతుపవనాలతో జూన్ మొదటి వారంలో రెండు మూడు రోజులు వానలు కురిశాయి. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట చిన్నపాటి జల్లులు తప్పితే ఓ మోస్తరు వర్షాలు కరిసిన ఆనవాళ్లే కనిపించలేదు. ఖరీఫ్ మొదలైన జూన్ నుంచి కృష్ణా, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే మంచి వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాస్త అటుఇటుగా సాధారణ వర్షాలు కురిశాయి. నెల్లూరు, కర్నూలు, వైఎస్‌ఆర్, చిత్తూరు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో తక్కువ వర్షాలు వచ్చాయి. కరువు జిల్లాగా పేరొందిన అనంతపురంలో నమోదు చేసేంత వాన ఎక్కడా కురవలేదు. 

సాగు... అంతటా తక్కువే 
ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి వర్షాలు లేకపోవడంతో పంట సాగు దయనీయంగా ఉందని వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలు కాగా ఈ ఏడాది 2.20 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాభావంతో పంటల సాగు తక్కువగా ఉంది. జూలై 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా 45.80 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు.

5.42 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి 4.15 లక్షల ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. 7.27 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ 2.90 లక్షల ఎకరాల్లోనే సాగయింది. 3.35 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన కంది పంట 2.50 లక్షల ఎకరాల్లోనే వేశారు. వరి తర్వాత రాష్ట్రంలో ప్రధాన పంట అయిన పత్తి సాగు విస్తీర్ణం ఈ ఏడాది కూడా భారీగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతానికి పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 17.82 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే 22.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణ విస్తీర్ణంతో పోల్చితే 25 శాతం తక్కువగా పంటలు వేశారు. చిత్తూరు, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 26 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. నెల్లూరు జిల్లాలో మాత్రం సాధారణ విస్తీర్ణంలో 50 శాతం కంటే ఎక్కువగా పంటలు సాగయ్యాయి. 

కొనసాగుతున్న ద్రోణి
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా రెండురోజుల పాటు కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడతాయన్నారు. నైరుతి, ఉపరితల ఆవర్తనంలలో బుధవారం రాత్రి వరకు చెప్పుకోదగ్గ మార్పేమీ లేదన్నారు. బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలాసలో 3 సెం.మీ, టెక్కలిలో 2 సెం.మీ, కళింగపట్నంలో 1సెం.మీ వర్షం పడిందన్నారు. తెలంగాణలోని రామాయంపేట, మెట్‌పల్లిలలో 3 సెం.మీ, పరకాలలో 2 సెం.మీ వర్షం కురిసిందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణ, రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!