* జగన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
* జగన్‌కు బెయిలిస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది
* ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఆయన్ను అరెస్టు చేశారు
* ఆ సమయంలో అరెస్టు చేయటం తప్పుడు సంకేతమే
* చార్జిషీటు దాఖలుకు ముందే అరెస్టు చేసి ఉండాల్సింది... అవసరం లేదనుకుంటే మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచాలి
* అవేమీ చెయ్యకుండా చట్టాలను సీబీఐ గౌరవించలేదు
* సీఆర్‌పీసీలోని సెక్షన్ 170(1)ను సీబీఐ పాటించలేదు
* సమాజం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు బెయిలివ్వలేం
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిలు మంజూరు చేయటం సరికాదంటూ.. జస్టిస్ సముద్రాల గోవిందరాజులు బుధవారం ఈ బెయిలు పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ మేరకు వెలువరించిన ఉత్తర్వుల్లో ఆయన పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. సీబీఐ తీరును నిశితంగా తప్పుబట్టారు.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన సమయం కచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపిందని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యాక ఆయన్ను అరెస్టు చేయటంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసమే అరెస్టు చేశారని, ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లను, ఒక ఎంపీ సీటును గెలవటమే దీనికి నిదర్శనమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఒక క్రిమినల్ కేసుకు ఇది సంబంధం లేని అంశం. బెయిలు మంజూరు చేయటానికైనా, తిరస్కరించటానికైనా ఇది కారణం కాబోదు’’ అని ఆయన పేర్కొన్నారు.
అరెస్టుకు సంబంధించి సీబీఐ నిబంధనల్ని పాటించ లేదని కూడా న్యాయమూర్తి తప్పుపట్టారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 170(1)ను సీబీఐ పాటించలేదని చెప్పారు. దీని ప్రకారం చార్జిషీటు వేసే ముందు సాక్ష్యాలు సరిపోతాయని భావిస్తే నిందితుడిని తీసుకెళ్లి నేరుగా న్యాయమూర్తి ముందు హాజరుపరచాలని, అపుడు ఆ తుది నివేదికను విచారణకు స్వీకరిస్తూ.. నిందితుడికి బెయిలు మంజూరు చేసే అధికారం కోర్టుకు ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు వేసిందని గుర్తు చేస్తూ.. ‘‘పిటిషనర్‌ను సీబీఐ మే 27న అరెస్టు చేసింది. అంతకన్నా ముందే మూడు చార్జిషీట్లు వేసింది. చట్టపరంగా చూస్తే అంతకన్నా ముందే ఆయన్ను అరెస్టు చేసి ఉండాలి.
అలా చేయకపోవటాన్ని సీబీఐ ఏ రకంగానూ సమర్థించుకోజాలదు’’ అని జడ్జి స్పష్టంచేశారు. అయితే కేసులో చాలా అంశాలున్నాయన్న సీబీఐ వాదనను ఆయన ప్రస్తావించారు. ఇంకా వాన్‌పిక్, భారతి సిమెంట్స్‌లో ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులు, కోల్‌కతా కంపెనీల లావాదేవీలు, సండూర్ పవర్ లావాదేవీలు, సిమెంటు కంపెనీలకు నీటి కేటాయింపులు వంటి అంశాలపై దర్యాప్తు జరపాల్సి ఉందని సీబీఐ పేర్కొనటాన్ని ప్రస్తావించారు. అందుకని ఒకటో, రెండో, మూడో.. చార్జిషీట్లు వేసినం త మాత్రాన దర్యాప్తు పూర్తయిపోయిందని భావించలేమన్నారు.
అరెస్టు అక్రమమంటూ గతంలో జగన్‌మోహన్‌రెడ్డి తరఫున వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. సీబీఐ తనను అరెస్టు చేయొచ్చని భావిస్తూ పిటిషనర్ ముందస్తు బెయిలుకు కూడా దరఖాస్తు చేశారని, అయితే అరెస్టుపై ఆందోళనకు సరైన ఆధారాలు లేవన్న కారణంతో దిగువ కోర్టు దీన్ని కొట్టేసిందని గుర్తుచేశారు. ‘‘దీంతో కోర్టు ఉత్తర్వుల్ని సీబీఐ ధిక్కరించినట్లు పిటిషనర్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. కానీ ఆ అంశంపై సీబీఐ తన వాదనలు వినిపించలేదు. అది కోర్టు స్వతంత్రంగా వ్యక్తంచేసిన అభిప్రాయమే’’ అని జస్టిస్ గోవిందరాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పిటిషనర్‌పై ఆర్థికాంశాలకు సంబంధించి అనేక అభియోగాలున్నాయని చెప్తూ.. అయితే వీటిని హత్య వంటి తీవ్రమైన నేరాలతో పోల్చజాలమన్న పిటిషనర్ తరఫు న్యాయవాదితో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. అలాగని వీటిని ఒక మేజిస్ట్రేటు మాత్రమే విచారించగల నేరాలుగా చూడలేమన్నారు. ‘‘సుప్రీంకోర్టు పేర్కొన్న దాని ప్రకారం ఏ కేసులోనైనా బెయిలు అంశాన్ని పరిశీలించేటపుడు రెండింటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి నిందితుడు పరారయ్యే అవకాశం ఉందా? రెండు సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందా? అనేవి. ఈ కేసులో నిందితుడు పరారయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు.
ఎందుకంటే ఆయన పార్లమెంటు సభ్యుడు. పెపైచ్చు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కూడా. మరోవంక సాక్ష్యాల్ని తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థ కేవలం ఆరోపణలు చేయటం కూడా తగదు. దానికి తగ్గ ఆధారాలు చూపించాలి. దీనికోసం సూరీడు సాక్ష్యం అంశాన్ని సీబీఐ ప్రస్తావించింది. మొదట తమ వద్ద సాక్ష్యమిచ్చిన సూరీడు మేజిస్ట్రేటు ముందు కూడా వాంగ్మూలం ఇవ్వటానికి అంగీకరించారని, కానీ తరవాత నిరాకరించారని పేర్కొంది.
దీన్ని ఉదాహరణగా చూడలేం కానీ.. పిటిషనర్‌కు ఉన్న ధన బలం, రాజకీయ బలం దృష్ట్యా ఆయన సాక్ష్యాల్ని తారుమారు చేసే, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం తప్పకుండా ఉంది. అందుకని బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. వ్యక్తులకు బెయిలు పొందే హక్కున్నా.. సమాజం విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా ఒకోసారి దాన్ని తిరస్కరించక తప్పదన్నారు.
No comments:
Post a Comment