YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 7 July 2012

చంద్రబాబుకు టీడీపీ బీసీ నేతల ఝలక్

సీనియర్ల సమక్షంలోనే కడిగేసిన వైనం
బీసీలకు 100 సీట్లిస్తామంటే ఎవరూ విశ్వసించడం లేదు
గతంలోనే ఇవ్వనిది ఇప్పుడిస్తారా అని నిలదీస్తున్నారు
ఎన్నో పథకాలతో బీసీలకు వైఎస్ మేలు చేశారు
అందుకే వారు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మీరు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదు. ముఖ్యంగా బీసీలు విశ్వసించడం లేదు. గతంలో వారికిచ్చిన హామీలను మీరు విస్మరించటమే అందుకు కారణం’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖం మీదే ఆ పార్టీ బీసీ నేతలు కుండబద్దలు కొట్టారు. పార్టీలోని బీసీ నేతలతో ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నాలుగు గంటల పాటు బాబు నిర్వహించిన భేటీలో సీనియర్ నేతల సాక్షిగానే ఆయనకు వారు ఈ మేరకు ఝలకిచ్చారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. వాటివల్ల బీసీలు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఇప్పుడు అంతకంటే మంచి కార్యక్రమాలు ప్రకటించి, అమలు చేయగలిగితేనే వారిని మనవైపు తిప్పుకోవచ్చు’’ అంటూ నిష్కర్షగా మాట్లాడారు. నామా నాగేశ్వరరావు, టి.దేవేందర్‌గౌడ్, యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, గుంటుపల్లి నాగేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగుల్ మీరా, వ నమాడి వెంకటేశ్వరరావు, అంగర రామ్మోహనరావు తదితర బీసీ నేతలు భేటీలో పాల్గొన్నారు. 

బీసీలను టీడీపీకి ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారంటూ జిల్లాల నుంచి వచ్చిన ఆ వర్గపు నేతలు బాబు సమక్షంలో వాపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బీసీలను ఆదుకోకపోతే పార్టీ మనుగడే కష్టమని ఆయనకు స్పష్టం చేశారు. ‘‘మన పార్టీని, ముఖ్యంగా మీరు చెప్పే మాటలను ఎవరూ నమ్మడం లేదు. గతంలో చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటమే దీనికి కారణం. బీసీలకు 100 ఎమ్మెల్యే టికెట్లిస్తామని గత సాధారణ ఎన్నికలకు ముందు వరంగల్ బీసీ గర్జనలో ప్రకటించి, 60 సీట్లే ఇచ్చారు. దాంతో బీసీలు టీడీపీకి దూరమయ్యారు’’ అని వారు బాబుతో అన్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు, ‘నాతో పాటు పార్టీని కూడా బీసీలు విశ్వసించేలా నేతలే చర్యలు తీసుకోవాలి’ అంటూ తేల్చేశారు! ‘ తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తాం. బీసీలను ఆదుకునేందుకు చేపట్టే కార్యక్రమాలపై 9, 10 తేదీల్లో జరిగే విసృ్తత సమావేశంలో విధానం ప్రకటిస్తాం’’ అని బాబు చెప్పారు. 

కొత్త రక్తమంటూ పాత పోకడలా: అరవింద్

అధినేత తీరుపై పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్‌కుమార్ గౌడ్ మీడియా ముందే తీవ్ర అసంతృప్తి వెల్లగక్కారు. ‘‘30 ఏళ్లుగా వేదికపై ఉంటూ వస్తున్న వారికే ఈ రోజు కూడా ప్రాధాన్యమిచ్చారు. ఇక పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామనే అధినేత మాటలను నమ్మేదెవరు? టీడీపీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయిన దేవేందర్‌గౌడ్‌ను బీసీ సమస్యలపై అధ్యయనానికి వేసిన సాధికారత కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారు? ఈ సమావేశానికి మాకు ఆహ్వానం పంపలేదు’’ అంటూ అరవింద్ దుమ్మెత్తిపోశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశానికి ైగె ర్హాజరయ్యారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!