YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 5 July 2012

ఖరీఫ్ ఆరంభంలోనే తీవ్ర సంక్షోభం

* చినుకు లేదు... కరెంటూ రాదు... విత్తు మొలకెత్తదు 
* వ్యవసాయానికి అందని విద్యుత్ సరఫరా 
* 75 శాతం ఫీడర్లకు 7 గంటల విద్యుత్ హుళక్కే 
* పొలంలో బిందెలతో నీరు పోస్తున్న రైతులు 
* డిమాండ్‌కు సరిపోని విద్యుత్ సరఫరా 
* జల విద్యుత్ ఉత్పత్తినీ దెబ్బతీసిన వర్షాభావం 
* గ్రామాల్లో రాత్రి సమయాల్లోనూ ‘కోతలు’ 
* పట్టణాలు, నగరాల్లోనూ తీరని కరెంటు వెతలు
* చిన్నతరహా పరిశ్రమలకు రెండు రోజుల కోత 
* కోత ఉండదన్న సీఎం హామీకీ దిక్కు లేదు 
* పరిశ్రమలకు పది నెలలుగా అమలవుతున్న వారంలో మూడు రోజుల విద్యుత్ బంద్
* లక్షలాది మంది కార్మికుల బతుకు దుర్భరం 
* విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం 
* కొంటే ఖజానాకు భారమవుతుందన్న భయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: పొలం దున్ని నాటిన విత్తులు మొలకెత్తటం లేదు.. వర్షాలు ముఖం చాటేయటంతో చినుకు రాలటం లేదు.. బోరు నీళ్లు పెడదామన్నా మోటార్ పనిచేయదు.. ఎందుకంటే దానికి కరెంటు సరఫరా కాదు.. కానీ ఏదో మూల ఆశ.. ఎప్పుడోకప్పుడు కరెంటు వస్తుందేమోనని.. కాసిని నీళ్లయినా పారించొచ్చని.. నాటిన విత్తులను బతికించుకోవచ్చని.. అందుకే పొద్దంతా పొలంలో ఎదురుచూపులు.. అసలు వస్తుందో లేదో తెలియని కరెంటు కోసం ఎదురుతెన్నులు.. చూసిచూసి విసిగిపోయి ఏ రాత్రికో ఇంటికి వస్తే.. ఇల్లంతా చీకటి గుయ్యారం.. గుడ్డి లైటు కూడా వెలగదు.. ఆ చీకట్లోనే వండుకుని.. చీకట్లోనే తిని పడుకుని.. రాత్రంతా దాడిచేస్తూ రక్తం పీల్చే దోమలను తోలుకుంటూ జాగారం.. నడిరాత్రికే మళ్లీ మొదలు.. నిద్రలేని కళ్లతో మళ్లీ పొలం వెళ్లటం.. విత్తనాలను కాపాడుకోవటం కోసం నానాపాట్లు పడటం! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పల్లెసీమల్లో తాండవిస్తున్న అంధకారం. 

విద్యుత్ కోతలతో అస్తవ్యస్తమవుతున్న గ్రామీణ ముఖచిత్రం. గ్రామాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా విపరీతంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఖరీఫ్ ఆరంభంలోనే వ్యవసాయానికి కనీసం 7 గంటల విద్యుత్ అన్నది కూడా వట్టి ఫార్సుగా మారిపోయింది. వేసిన విత్తులను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో బిందెలతో నీళ్లు పోసుకుంటున్నారు. మరోవైపు.. ఊర్లో కరెంటు లేక జిరాక్సు మిషన్లు కూడా పనిచేయకపోవటంతో.. స్కూల్లో అడ్మిషన్లకు అవసరమైన సర్టిఫికెట్లను జిరాక్సు తీసుకునేందుకు మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రాల్లోనూ రోజుకు ఆరు గంటలు, జిల్లా కేంద్రాల్లో రోజుకు నాలుగు గంటలు, రాజధాని నగరం హైదరాబాద్‌లో రోజుకు 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇక పరిశ్రమలకైతే.. గత పది నెలలుగా విద్యుత్ కోతలు కోస్తూనే ఉన్నారు. 

‘జల విద్యుత్’ను దెబ్బతీసిన వరుణుడు... 
రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉంటే.. అందుకు తగ్గట్లు సరఫరా ఉండటం లేదు. ఈ నెల 4వ తేదీ (బుధవారం) 253 మిలియన్ యూనిట్ల (ఎంయూల) డిమాండ్ నమోదుకాగా 217 ఎంయూలు మాత్రమే సరఫరా చేయగలిగారు. మిగిలిన 36 ఎంయూల డిమాండ్‌కు కోతలు అమలుచేస్తున్నారు. నిండు వేసవిలో నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితులు వర్షాకాలంలో సమసిపోవాల్సివుండగా.. ఇప్పుడు మరింత పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలు కనిపించటం లేదు. 

వాస్తవానికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పూర్తిస్థాయిలో నడుస్తుండటం వల్ల 100 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. థర్మల్ యూనిట్ల వల్లే కనీసం ఈ మాత్రమైనా విద్యుత్ సరఫరా ఉంది. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. సీజన్‌లో కురవాల్సిన వర్షాలు లేకపోవటంతో రాష్ట్రంలోని రిజర్వాయర్లు బోసిపోతున్నాయి. వాస్తవానికి వర్షాలు కురిస్తే ఈ పాటికి జల విద్యుత్ ఉత్పత్తి 30 ఎంయూల నుంచి 40 ఎంయూల వరకూ ఉండేది. అలా జరిగితే డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయటానికి వీలుండేది. కానీ.. వర్షాలు లేకపోవటంతో జల విద్యుత్ ఉత్పత్తి కనీసం 7 ఎంయూలకు మించటం లేదు. 

రిజర్వాయర్లలో ఇప్పుడున్న నీటి నిల్వలను వినియోగిస్తే ఈ నెలాఖరు వరకు మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. బయటి నుంచి అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో వచ్చే ఏడాది జూన్ వరకు అంటే సంవత్సరం పాటు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కోతలు తప్పే అవకాశం కనిపించటం లేదు. ఒకవేళ వచ్చే ఏడాది కూడా వరుణుడు కరుణించకపోతే రాష్ట్రంలో పరిస్థితి మారే అవకాశమే లేదు. 

అదనులో ఏదీ వ్యవ‘సాయం’?
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న దివంగత సీఎంవై.ఎస్.రాజశేఖరరెడ్డి హామీని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన 7 గంటల విద్యుత్‌ను కూడా సరిగ్గా అమలు చేయటం లేదు. పీక్ సీజన్‌లో సైతం నాలుగైదు గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,362 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లలో కేవలం 2,254 ఫీడర్లకే నిరంతరాయంగా ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు విద్యుత్ సంస్థలు పేర్కొంటున్నాయి. అది కూడా రాత్రి సమయాల్లోనే ఇస్తున్నట్లు చెప్తున్నాయి. కానీ.. ఆ ఫీడర్లకు కూడా ఏకధాటిగా విద్యుత్ సరఫరా కావటం లేదని రైతులు స్పష్టంచేస్తున్నారు. మిగిలిన 7,000 పైచిలుకు ఫీడర్లకు మాత్రం రెండు, మూడు, నాలుగు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 

అయితే.. ఇలా విడతల వారీగా విద్యుత్ సరఫరా చేయటంలో నిర్దిష్ట సమయ పాలన లేదు. దీంతో ఏడు గంటల సరఫరా అన్నది వాస్తవంలో నాలుగైదు గంటలకు మించటం లేదు. అలాగే.. 1,500 ఫీడర్లకు ఏడు గంటల కంటే తక్కువగానే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని అధికారికంగానే విద్యుత్ సంస్థలు పేర్కొంటున్నాయి. అంటే మొత్తంమీద 75 శాతం వ్యవసాయ ఫీడర్లకు ఏడు గంటల విద్యుత్ అనేది మిథ్యగానే మిగులుతోందన్నమాట. దీంతో ఇటు వర్షపు చినుకు లేక.. అటు కరెంటు రాక.. పొలంలో వేసిన విత్తులు మెలకెత్తకుండానే భూమిలోనే చనిపోతున్నాయి. ఈ విత్తులను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

పల్లెల్లో రాత్రిళ్లూ కోతలు... 
గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి విద్యుత్ కోతలు విధించకూడదనేది విద్యుత్ సంస్థలు చాలా కాలంగా పాటిస్తున్న నిబంధన. అయితే.. ఈసారి దీనికి కూడా నీళ్లొదిలాయి. కొన్ని గ్రామాల్లో రాత్రి సమయాల్లో 10 గంటలకు పోయిన విద్యుత్ తెల్లవారుజామున నాలుగైదు గంటలకు వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో రాత్రి 7 గంటలకు పోయిన విద్యుత్ తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు వస్తోంది. దీంతో కూలికి పోయి వచ్చిన గ్రామీణులు.. చీకట్లోనే వంట చేసుకుని తిని పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వీటితో పాటు చిన్నవర్షపు జల్లులు వస్తే వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న విద్యుత్ కోతల వల్ల చిన్న చిన్న జిరాక్సు షాపులతో పాటు ఏ చిన్నపాటి పరిశ్రమ కూడా నడవని పరిస్థితి నెలకొంది. 

మిగులుతోంది పరి‘శ్రమే’... 
చిన్నతరహా పరిశ్రమలకు కోతలు ఉండవని స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీకీ దిక్కులేదు. ప్రస్తుతం చిన్నతరహా పరిశ్రమలకు వారంలో ఒక రోజుతో పాటు ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోతలు అమలవుతున్నాయి. అంటే రోజుకు నాలుగు గంటల చొప్పున వారానికి ఇది కూడా ఒక రోజు అవుతుంది. అంటే వారానికి రెండు రోజులన్నమాట. భారీ పరిశ్రమలకు గత ఏడాది సెప్టెంబర్ నుంచి కోతలు అమలవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారీ పరిశ్రమలకు వారంలో మూడు రోజుల పాటు విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి. వీటిని ఇప్పట్లో ఎత్తివేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. దీంతో వేలాది పరిశ్రమలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోజువారీ వేతన కార్మికులు జీవితం దుర్భరంగా మారింది. వారికి వేతనాలు లేక పూట గడవని దుస్థితి నెలకొంది.

కోతల నుంచి విముక్తికి మార్గాలివీ... 
* కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో రిలయన్స్ సంస్థ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించటం వల్ల రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా తగ్గింది. ఫలితంగా 2,500 మెగావాట్లకు గాను కేవలం 1,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ) గ్యాస్‌ను సరఫరా చేసుకోవచ్చు. తద్వారా 500 (12.5 మిలియన్ యూనిట్లు) మెగావాట్ల వరకు అదనపు విద్యుత్‌కు అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ కనబరచటం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. 

* రాష్ట్రానికి రావాల్సిన 100 మెగావాట్లను అటు కర్ణాటక, మరో 150 మెగావాట్లను కేరళ తన్నుకుపోయాయి. కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవడం ద్వారా 250 మెగావాట్లను పొందేందుకు అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం లేఖలతో సరిపుచ్చుతోందే తప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

* మార్కెట్లో అధిక ధర ఉన్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. అయితే, తీవ్రమైన విద్యుత్ కోతల నేపథ్యంలో ఆర్థికపరమైన భారం భయాన్ని పక్కకుపెట్టి పంటలను రక్షించాల్సిన బాధ్యత తనదేనన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘విద్యుత్ కొనుగోలుకు అవసరమైన మొత్తం ఆర్థిక భారాన్ని విద్యుత్ సంస్థలపై మోపకుండా.. ప్రభుత్వమే భరించాలి. తద్వారా 100 మెగావాట్ల నుంచి 200 మెగావాట్ల వరకు అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు’ అని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!