
పాము, కుక్కకాటు మందులకూ దిక్కు లేదు
బాధితులకు నాటువైద్యమే శరణ్యం
పీహెచ్‌సీలను వేధిస్తున్న వసతుల లేమి
సెలైన్లు, బ్యాండేజీలు కూడా లేని దైన్యం
నిధుల విడుదలలో సర్కారు అలసత్వం
అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నా మొద్దునిద్రే
తీవ్రంగా వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
ఉన్న డాక్టర్లూ చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్న వైనం
వైద్యుల అవతారమెత్తుతున్న అటెండర్లు, స్వీపర్లు
‘న్యూస్‌లైన్’ పరిశీలనలో వెల్లడైన చేదు నిజాలు
న్యూస్‌లైన్ యంత్రాంగం: ఖరీఫ్ సీజన్. రైతులు, రైతు కూలీలు తొలకరి పనుల్లో తలమునకలయ్యే సమయం. పాములు, తేళ్ల బెడద బాగా ఉండే సీజన్ కూడా ఇదే. కానీ ఈ సీజన్‌లో గనుక వారు పొరపాటున వాటి కాటుకు గానీ గురయ్యారా.. ఇక అంతే సంగతులు. ఏ నాటు వైద్యాన్నో, మంత్ర తంత్రాలనో నమ్ముకోవాల్సిందే! రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందు (ఏఎస్‌వీ)కు కూడా దిక్కు లేదు మరి!! నల్లగొండ జిల్లాలో ఏకంగా రాజాపేట మండల కేంద్రంలోనే గురువారం ఓ యువకుని విషాదాంతం ఈ దైన్యానికి అక్షరాలా అద్దం పట్టింది. వైరాగ్యం శివుడు అనే అభాగ్యుడు పశువుల కోసం గడ్డి కోస్తుండగా తాచుపాము కాటేసింది. తక్షణం స్థానిక పీహెచ్‌సీకి తరలించినా ఏఎస్‌వీ లేమి వెక్కిరించింది. వెంటనే భువనగిరికి తరలించినా అప్పటికే ఆలస్యమై అతను నిస్సహాయంగా ప్రాణాలొదిలాడు. ఒక్క పాముకాటనే కాదు.. ఈ సీజన్‌లో పరిపాటైన కుక్క కాటు బారిన పడ్డవారిని కూడా ఆ దేవుడే ఆదుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఎందుకంటే యాంటీ రేబిస్ మందు (ఏఆర్‌వీ)కూ కనీవినీ ఎరగని కరువొచ్చి పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 80 శాతం పీహెచ్‌సీల్లో ఏఎస్‌వీ, ఏఆర్‌వీ నిల్వలనేవే లేవు. 2011 ఏప్రిల్‌లో కాకినాడలో రేబిస్ వ్యాధి సోకిన 10 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసినా మృత్యువాత పడ్డారు. వ్యాక్సిన్ పని చేయకపోవడమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. అయినా అదే మందు ఇప్పటికీ సరఫరా అవుతూనే ఉంది! అంతేకాదు.. వర్షాకాలం రాగానే విజృంభించే అంటువ్యాధులను, విష జ్వరాలను ఎదుర్కొనే ఏర్పాట్లు కూడా సున్నా. కనీసం బాధితులకు ఎక్కించేందుకు సెలైన్ బాటిళ్లు కూడా ఎక్కడా అందుబాటులో లేని దుస్థితి!

మన పీహెచ్‌సీల దైన్యానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిత్యం అవసరమయ్యే అతి మామూలు మందులకు కూడా వాటిలో దిక్కులేదు. దీనికి తోడు తీవ్రంగా వేధిస్తున్న డాక్టర్ల కొరత. ఉన్న వైద్యులు ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు! పీహెచ్‌సీలకు మందులే కాదు, నిధుల విడుదలలోనూ, సిబ్బంది నియామకంలోనూ సర్కారు అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. వెరసి.. నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన పీహెచ్‌సీలకే తీవ్రంగా సుస్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ చేపట్టిన తాజా పరిశీలనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి. పలుచోట్ల స్వీపర్లు, అటెండర్లే డాక్టర్ల అవతారమెత్తి, తోచిన మందులిచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకుంటున్న నాథుడే లేడు! అరకొర మందులతో, వైద్యులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న దైన్యమే అన్ని పీహెచ్‌సీల్లోనూ దర్శనమిచ్చింది. పలుచోట్ల పీహెచ్‌సీలు చెట్ల కిందే నడుస్తున్న తీరు అవి ఎదుర్కొంటున్న వసతుల లేమికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సడలిపోతోంది. విధి లేక గ్రామీణులు పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. పలువురు అభాగ్యులు ఆలోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

నిధులకూ దిక్కు లేదు
రాష్ట్రవ్యాప్తంగా 1,624 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే కనీసం ఒక్కచోట కూడా ఐవీ ఫ్లూయిడ్స్ (ద్రవాహార మందులు) లేవు! పాముకాటు మందు (ఏఎస్‌వీ), కుక్కకాటు మందు (ఏఆర్‌వీ) ప్రతి పీహెచ్‌సీలలో విధిగా ఉండాలి. కానీ 80 శాతం కేంద్రాల్లో వాటి జాడే లేదు. సుమారు 30 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా పీహెచ్‌సీల్లో ఎక్కడా అందుబాటు లేవు. గాయాలకు కట్టు కట్టేందుకు బ్యాండేజీలకు కూడా నెల రోజులుగా ఏ పీహెచ్‌సీలోనూ గతి లేని దుస్థితి! ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలవుతున్నా పీహెచ్‌సీల్లో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులే విడుదల చేయడం లేదు. దాంతో డయేరియా, మలేరియా, వైరల్ వంటి జ్వరాలొచ్చి నీరసపడితే కనీసం సెలైన్ బాటిళ్లకు కూడా దిక్కు లేదు. డైక్లోఫెనాక్, బీ కాంప్లెక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్‌లు, టీటీ మందుల వంటివేవీ అందుబాటులోనే లేవు. ప్లూయిడ్లు, ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. వచ్చే మూడు నెలలు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు పడి, నీళ్లు నిలిస్తే మలేరియా, డయేరియా, డెంగీ వంటివి స్వైర విహారం చేసే ఆస్కారమున్నా ఏ పీహెచ్‌సీలోనూ వాటిని నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాల్లేవు. నల్లగొండ జిల్లాలో ఒక్క పీహెచ్‌సీలోనూ అవసరమైన మందుల్లేవు.

డాక్టర్ల రాక.. దైవాధీనం!

పరకాల మండలం రాయపర్తిలో స్వీపరే రోగులకు తోచిన మందులిస్తోంది! ములుగు ఏజెన్సీ రాయినిగూడెం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఎప్పుడో గానీ ముఖం చూపించడం లేదు. మెదక్ జిల్లాలోనూ ఒక్క పీహెచ్‌సీలో కూడా ైవె ద్యులు, సిబ్బంది వేళకు రావడం లేదు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అసలే సిబ్బంది కొరత తీవ్రంగా ఉండగా, ఉన్న వైద్యులు కూడా సమీప పట్టణాల నుంచి చుట్టపు చూపుగా విధులకు వచ్చిపోతున్నారు. బొల్లేపల్లి పీహెచ్‌సీ డాక్టర్ కేవలం సోమవారం మాత్రం వచ్చి మిగతా ఆరు రోజులకు ఏఎన్‌ఎంలకు డ్యూటీ వేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోనూ పీహెచ్‌సీల వైద్యులంతా ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరాల్లో నివాసముంటున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశారు. ఇవి 24 గంటలు తెరిచి ఉండాలి. కానీ రాత్రి ఏడు దాటితే వాచ్‌మెనే దిక్కవుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ వైద్యాధికారులెవరూ స్థానికంగా ఉండటం లేదు. నెల్లూరు జిల్లాలో మారుమూల పీహెచ్‌సీలకు వైద్యులు మొక్కుబడిగానే వెళ్లి వస్తున్నారు. పైగా కొందరు వైద్యులు చేతులు తడపందే సరిగా వైద్యం చేయడం లేదు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రిలో తన కూతురు ప్రసూతి ఆపరేషన్‌కు డాక్టరే రూ.5 వేలు డిమాండ్ చేశాడంటూ బాలమణి అనే మహిళ వాపోయింది.
వేధిస్తున్న కొరత
వైద్యులు, సిబ్బంది కొరత మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల ఖాళీలున్నాయి. అనంతపురం జిల్లాలోని 100 పీహెచ్‌సీల్లో 183 మంది వైద్యులకు గాను 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోనైతే 77 పీహెచ్‌సీల్లో ఏకంగా 803 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి!
సార్లుండనే ఉండరు

- భట్టు విజయభారతి, భట్టుతండా, వరంగల్
అన్ని రోగాలకూ ఒకటే మందు

- వెంకటేశ్వర్లు, పగిడ్యాల, కర్నూలు
ఇదీ పీహెచ్‌సీల దుస్థితి..
2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,892 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండాలి. కానీ 1,624 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం మరో 800 కావాలి.
ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ ఉండాల్సి ఉండగా 50 వేల మందికి కూడా ఒకటి లేదు
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 20 వేల మందికి ఒక పీహెచ్‌సీ ఉండాలి. కానీ 30 వేలమందికి కూడా ఒకటి లేదు
310 పీహెచ్‌సీలలో కనీస మౌలిక వసతుల్లేవని ప్రభుత్వమే తేల్చింది. 214 పీహెచ్‌సీలకు సొంత భవనాల్లేవు
800 పీహెచ్‌సీల్లో ఇద్దరు అదనపు నర్సులతో నిరంతరం సేవలందించాలన్న మార్గదర్శకాలు అమలవలేదు
కనీసం ఒక్క పీహెచ్‌సీ పరిధిలో కూడా వైద్యులు స్థానికంగా ఉండటం లేదని ఉన్నతాధికారులు తేల్చారు
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పీహెచ్‌సీల కొరత బాగా ఉంది
No comments:
Post a Comment