వాన్ పిక్ ప్రాజెక్టును రద్దుచేయాలా? లేక ఏమి చేయాలని ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతుంటే ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రమోటర్ అయిన రస్ అల్ ఖైమా దేశ ప్రభుత్వం వాన్ పిక్ ప్రాజెక్టుపై ఇప్పటికే 850 కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని అంశాలను అమలు చేయాలని కోరుతోంది. ఈ మేరకు రస్ అల్ ఖైమా పెట్టుబడిదారి సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ రాసింది. అందులో వాన్ పిక్ పూర్వాపరాలను వివరించారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ వచ్చినప్పుడు ఎపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారని , దానికి అనుగుణంగా వాన్ పిక్ ప్రాజెక్టును ప్రతిపాదించామని , దీనికి సంబంధించిన వివిధ రిపోర్టులు జాతీయ , అంతర్జాతీయ సంస్థలు రూపొందించాయని ఆ సంస్థ తెలిపింది.తమ ఇండియా భాగస్వామి మాట్రిక్స్ ప్రసాద్ ప్రమోట్ చేసిన సంస్థను చేర్చుకున్నామని పేర్కొంది. ఇందులో నవయుగ సంస్థకు కూడా భాగస్వామ్యం కల్పించాలని తొలుత అనుకుని , చర్యలు తీసుకున్నామని, కాని ఆ తర్వాత నవయుగ తప్పుకుందని, వారి పెట్టుబడి వెనక్కి ఇచ్చి వేస్తున్నామని కూడా పేర్కొంది. తమ వైపు నుంచి వాన్ పిక్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన రాయితీల ఒప్పందంలోని అంశాలను అమలు చేయడంలో గత రెండేళ్లుగా జాప్యం చేస్తున్నదని , అందువల్ల తాము ఇంతవరకు పెట్టిన 845 కోట్ల పెట్టుబడికి ప్రతిఫలం రావడం లేదని ఆ సంస్థ తెలిపింది.అందువల్ల నిర్మాణ పనులు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ సిఇఓ డాక్టర్ ఖతర్ మసాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా పోవడం వల్ల అన్ని విధాల నష్టం జరుగుతోందన్న అబిప్రాయం ఉంది. రాజకీయ వివాదంగా వాన్ పిక్ ను మార్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టమే చేసేలా ఉంది. ప్రాజెక్టును సకలాంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకునే పరిస్థితిలో ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన వైపు నుంచే ఒప్పందం అమలులో వైఫల్యం చెందుతోంది. పోని ఒప్పందాన్ని రద్దు చేయదలచినా , దాని సాధ్యాసాధ్యాలను చూడాల్సి ఉంటుంది. అలా చేస్తే రస్ అల్ ఖైమాకు పరిహారం చెల్లించవలసిన పరిస్థితి రావచ్చు.పరిశ్రమలు, ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడకుండా ఉండవలసిన అవసరం ఉంది.
source: kommineni
No comments:
Post a Comment