YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 3 July 2012

జేడీపై చర్య తీసుకోండి

- లక్ష్మీనారాయణ సీబీఐ మాన్యువల్‌ను బేఖాతరు చేశారు
- చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోండి
- విజయమ్మ ఫిర్యాదును అందజేసిన పార్టీ ఎమ్మెల్యేలు
- చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్న అనురాగ్ శర్మ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా, కుట్ర పూరితంగా అప్రతిష్టపాలు చేస్తూ మాన్యువల్‌కు విరుద్ధంగా పనిచేస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె రాసిన ఫిర్యాదును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, అమరనాథరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌లతో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను కలిసి అందజేశారు.

జగన్‌పై నమోదైన కేసుల్ని దర్యాప్తు జరుపుతున్న లక్ష్మీనారాయణ సీబీఐ మాన్యువల్‌ను విరుద్ధంగా ఓ వర్గం మీడియాకు ఫోన్ చేయడం, వారి నుంచి వచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డెక్కన్ క్రానికల్ ప్రతినిధి నుంచి 96, ఈనాడు రిపోర్టర్ నుంచి 396, టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరి నుంచి 123, ఆంధ్రజ్యోతి ప్రతినిధి నుంచి 250 కాల్స్ లేదా మెసేజ్‌లు జేడీకి రావడం/ఆయన చేయడం జరిగిందని వివరించారు. జేడీ అధికారిక మొబైల్ ఫోన్‌నుంచి ఓ మహిళ ఫోన్‌కు సంప్రదింపులు జరిగాయని పేర్కొన్నారు. 

అధికారపక్షంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేతిలో జేడీ కీలుబొమ్మగా పనిచేస్తూ, తన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని విజయమ్మ తన ఫిర్యాదులో కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్తలపై జేడీ స్పందించకపోవడంతో పాటు ఖండనలు కూడా ఇవ్వకపోవడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోందని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధినేతగా ఉండి జెడ్ క్యాటగిరీ భద్రతలో ఉన్న తన కుమారుడు జగన్‌ను ఓ సందర్భంలో సరైన భద్రత లేకుండా సాధారణ పోలీసు వాహనంలో జైలు నుంచి కోర్టుకు తరలించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. 

జగన్ సీబీఐ కస్టడీలో ఉండగా ఓ వర్గం మీడియా విచారణ జరుగనున్న ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ప్రచారం చేసిన చర్య ఆయన భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చర్యలన్నీ చట్ట ప్రకారం కేసు నమోదుకు అవకాశం కలిగి ఉన్నాయని, దీన్ని పరిగణనలోకి తీసుకుని ఐపీసీలోని 120(బి), 166, 499లతో పాటు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌లోని సెక్షన్-5 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజయమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై న్యాయనిపుణుల సలహా తీసుకుని చట్ట ప్రకారం వ్యవహరిస్తామని కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. 

జేడీ వ్యవహార శైలిలో కుట్ర దాగుంది: ఎమ్మెల్యేలు
ఎలాంటి ఆధారాలు లేకపోయినా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పనిగట్టుకొని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కమిషనర్‌ను కలిసిన అనంతరం కరుణాకరరెడ్డి, అమరనాథరెడ్డి, కృష్ణదాస్ విలేకరులతో మాట్లాడారు. కీలక కేసుల్ని దర్యాప్తు చేస్తున్న అధికారి ఒక వర్గం మీడియాతో, కొందరు వ్యక్తులతో ప్రత్యేకంగా మాట్లాడిన వైనం జగన్‌పై జరుగుతున్న కుట్రకు నిదర్శనమన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేడీ వ్యవహార శైలిలో ఖచ్చితంగా కుట్ర దాగుందని వారు పునరుద్ఘాటించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!