జగన్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 13 నెలలు దాటింది. ఒకటి కాదు రెండు కాదు పదమూడు నెలలు. ఈ 13 నెలల్లో ఏమి సాధించారు? పోనీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నవాళ్లు ఏమైనా సామాన్యులా? పెద్ద పెద్ద అధికారులు. గొప్ప గొప్ప తెలివితేటలు గలవాళ్లు. బాగా చదువుకుని న్యాయం చేయగలిగినా, చేయలేకపోయినా వ్యక్తులను తప్పుడు కేసుల్లో ఎలా ఇరికించాలో, చట్టంలో ఉన్న లొసుగులను, వెసులుబాట్లను ఎలా వాడుకోవాలో, వాటితో ప్రత్యర్థులను ఎంత ఎక్కువ ఇబ్బంది పెట్టాలో, సాక్షులకు మాటలు చెప్పి అవసరం అయితే బెదిరించి వారి చేత అబద్ధపు సాక్ష్యం ఎలా రాయించుకోవాలో... వీటన్నింటిలో ఆరితేరిన మేధావులు. ఇన్ని కళలు వీరికి ఉన్నా ఎంతకీ అయిపోదు ఇన్వెస్టిగేషన్. ఎందుకు? ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి జీతాలు తీసుకుంటున్న వీళ్లంతా ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఎన్ని ఫైల్స్... ఎంత హడావిడి... ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో టీమ్స్... అయినా అయిపోని ఇన్వెస్టిగేషన్. ఇదంతా ఏ కసబ్‌ని పట్టుకోవడానికో ఏ గోకుల్‌చాట్ బాంబింగ్‌ను ఛేదించడానికో ఎంతో ప్రాణహానికి కారణమైన ఏ ట్రైన్‌లో మంటలు పెట్టేవారిని ఇన్వెస్టిగేట్ చేయడానికో కాదు. నిజానికి ఆ కేసుల్లో కూడా ఇంత ఆర్భాటం చేసి ఉండరు. మరెందుకు ఇంత చేసినట్టు? ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమబాటలో నడిపించిన ఒక మహానేతను, చివరి నిమిషం వరకూ ప్రజాశ్రేయస్సు కోసం తపించి ప్రాణాన్ని పణంగా పెట్టిన నాయకుణ్ణి దోషిగా నిరూపించడానికి... నిత్యం ప్రజల మధ్య ఉన్న జగన్‌ను జైలు గోడల మధ్య బందీ చేయడానికి. ఇందుకే. పోనీ ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఇంతా చేసి కొత్తగా ఏం కనుక్కున్నారు? ఈనాడు రూ.100 షేర్లను రూ.5,00,000లకు అమ్మిన నేపథ్యంలో సాక్షి ఈనాడులో సగం విలువ కట్టి రూ.10 షేర్లను రూ.350కి అమ్మిందని కనుక్కున్నారా? దానికి ఇంత హంగు, ఆర్భాటం దేనికి? సాక్షి సంస్థే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందే.
సాక్షిలో లెక్కలేనన్ని సార్లు వివరణ ఇచ్చిందే. ఈనాడులో రిలయన్స్ పెట్టుబడుల సంగతి దాచినట్టుగా సాక్షి తన పెట్టుబడుల సంగతి దాచలేదే. అలా మాకు దాచిపెట్టవలసిన అవసరం లేదు కూడా. అయినా ఇన్నిరోజులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కొత్త విషయం ఏమైనా కనుక్కున్నారా? సింగపూర్‌లో మాకు హోటల్ ఉందనో, బినామీ పేర్లతో మద్యం సిండికేట్లు ఉన్నాయనో, విదేశీ అకౌంట్లు ఉన్నాయనో చెప్పగలరా? కొండను తవ్వి తవ్వి ఎలుక కూడా దొరకలేదనే అసహనంతోనేనా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది?
అసలు ఎందుకు అయిపోవడం లేదు ఇన్వెస్టిగేషన్? ఇంకా ఎన్ని చార్జ్‌షీట్స్ వేస్తే మీకు తృప్తి కలుగుతుంది? దానిని ముగించకుండా జగన్‌కు కావలసిన మనుషులను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఈ నాటకాలు చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేసే పెద్దలు అబద్ధపు లీకులు ఇవ్వడంలో, సాక్షులను బెదిరించడంలో, చట్టంలోని లొసుగులను వెతకడంలో చూపించే చిత్తశుద్ధి ఇన్వెస్టిగేషన్ మీద చూపించి ఉంటే ఎప్పుడో అది అయిపోయేది. వాళ్లకు మంచి పేరు వచ్చేది. చట్టాన్ని అమలు చేయవలసిన ఇలాంటి వాళ్లు అన్యాయంగా చట్టాలతో ఆడుకుంటూ ఉంటే చరిత్రహీనులు అవుతారు తప్ప, ఒకరికి మార్గదర్శకం ఎన్నటికీ కాలేరు.
ఇంతా చేసి సాధించింది ఏమిటంటే- మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను సక్సస్‌ఫుల్‌గా పక్క రాష్ట్రాలకు పంపించడం. ఏ పని చేస్తే ఏమవుతుందో అనే అభద్రతలోకి అధికారులను నెట్టేయడం, వారి చేతులు కట్టేయడం. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇబ్బందులు పెట్టారు. తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి తిరుగుముఖం పట్టేలా చేశారు. వైఎస్‌ఆర్‌గారు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్తే రాజకీయ స్వార్థంతో రాజకీయ నాయకులతో కలిసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ప్రజలకు ఇదంతా కళ్లకు కట్టినట్టు కనపడుతోంది. అందుకే వాళ్లు ఈ బూటకపు ఇన్వెస్టిగేషన్‌ను అప్రజాస్వామిక లీకులను నమ్మడం లేదు.
ప్రేమ, పారదర్శకత, మంచితనం, న్యాయం, మానవత్వం ద్వారానే మనుషుల ప్రేమ, గౌరవం, నమ్మకం మనం పొందగలమని మా మామగారు మాకు నేర్పించారు. ఒకరిని ఇబ్బంది పెట్టి, భయపెట్టాలని ప్రయత్నించి, మనసులో కుట్ర, కుళ్లు, అన్యాయం ఉంచుకుంటే అవి అలా వాటిని పెట్టుకున్నవారిని ఎంత వికృతంగా మారుస్తాయో ఇప్పుడు పెద్దలుగా చలామణి అవుతున్న కొందరిని చూస్తే అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తయితే- బెయిల్‌కు అడ్డుపడటం ఇంకో ఎత్తు. అధికార దుర్వినియోగం వల్ల అన్యాయంగా అరెస్ట్ కావడమే ఒక బాధ అయితే, తొంభై రోజుల తర్వాత బెయిల్ పొందే రాజ్యాంగపరమైన హక్కును కూడా వీళ్లు అప్రజాస్వామికంగా అపుతూ ఉంటే ఇక ఆ కుటుంబం పడే బాధ, వేదన తప్పకుండా దేవుడికి అందుతుంది. న్యాయం అక్కడి నుంచే మాకు వస్తుంది. మన న్యాయవ్యవస్థ తప్పకుండా మా పక్షాన న్యాయం చేస్తుందనే నమ్మకం నాకు ఉంది.
పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=49366&Categoryid=11&subcatid=23
No comments:
Post a Comment