YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 17 September 2012

చీమకుట్టినట్టు కూడా లేదు!

*పరిశ్రమల జేఏసీ దీక్షకు మద్దతు
*వైఎస్ హయాంలో కోతల్లేవు... చార్జీలను తగ్గించారు
*ఈ ప్రభుత్వం చార్జీలను పెంచి, కోతలు విధిస్తోంది.. రాష్ట్రానికి రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు
*మా పార్టీ అధికారంలోకి వచ్చేవరకూ ఓపిక పట్టండి
*వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ జగన్ అందిస్తాడు

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలతో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని వైస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. వేలాది పరిశ్రమలు మూతపడుతున్నాయని, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల జేఏసీ దీక్షలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులతో కలిసి విజయమ్మ దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) సంఘాల జేఏసీ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు సోమవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. జీడిమెట్ల నుంచి పి. కృష్ణ, రామకృష్ణ, గంగారెడ్డి, కొండల్‌రావు, సాయికిషోర్, బొల్లారం నుంచి ఆదినారాయణ, రాంబాబు, ప్రసాద్ తదితరులు దీక్ష చేపట్టారు. 

కోతలు ఎత్తివేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని జేఏసీ కన్వీనరు ఎంఎం రెడ్డి, అధికార ప్రతినిధి ఏపీకే రెడ్డి, జాయింట్ కన్వీనర్ హన్మంతరావులు ప్రకటించారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని విజయమ్మ హామీనిచ్చారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేయాలని, రుణాలను రీ-షెడ్యూల్ చేయాలని, వడ్డీలను మాఫీ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాసినట్టు చెప్పారు. ఈ సమస్యలపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎంను కోరినప్పటికీ స్పందనలేదని విమర్శించారు. ‘‘రాష్ట్రంలోని పరిశ్రమల పరిస్థితి చూస్తే బాధేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు సంవత్సరాలుగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల నాడి బాగా తెలిసిన మనిషి. చాలా ముందు దృష్టి కలిగిన నేత. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాగా ఆయన భావించారు. ఎంఎస్‌ఎంఈలకు చేయూతనందించారు. వైఎస్ హయాంలో విద్యుత్ కోతలు లేవు. పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసల చొప్పున విద్యుత్ చార్జీలు తగ్గించారు. ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి, కోతలు విధిస్తోంది. నెలకు 15 నుంచి 18 రోజుల వరకూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే 11 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇద్దరు చిన్నతరహా పారిశ్రామికవేత్తలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజులుగా పారిశ్రామిక జేఏసీ ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడపోవడం దారుణం’’ అని ఆమె విమర్శించారు. 

ఉన్న ఉద్యోగాలు కాపాడండి చాలు

కొత్తగా 15 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని సీఎం అంటున్నారని.. ఉన్న ఉద్యోగాలను కాపాడితే చాలని విజయమ్మ ఎద్దేవా చేశారు. 108, 104లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వలేమంటున్నారని విమర్శించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతుండగా రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలోని నేతలెవ్వరూ రాని విషయాన్ని గుర్తుచేశారు. జగన్ బయట ఉంటే ఆయనే ఈ దీక్షకు వచ్చేవారన్నారు. వైస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకూ ఓపిక పట్టాలని, వైఎస్ స్వర్ణయుగాన్ని జగన్ మళ్లీ తీసుకువస్తారని హామీనిచ్చారు.

వైఎస్ ఏనాడూ చార్జీలు పెంచలేదు

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. విద్యుత్ కోతలు లేకుండా చూశారు. చార్జీలు కూడా పెంచలేదు. పైగా చార్జీలు పెంచేందుకు ట్రాన్స్‌కో అధికారులు ప్రతిపాదనలు పెడితే తిరస్కరించారు. కానీ, ఈ ప్రభుత్వం 40 శాతం మేరకు రెగ్యులర్ చార్జీలు పెంచింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) పేరుతో మరో 40 శాతం చార్జీల భారాన్ని మోపింది. మరోవైపు వారానికి 3 రోజులు విద్యుత్ కోతలను అమలు చేస్తోంది.
-ఎంఎం రెడ్డి, కన్వీనరు, పారిశ్రామిక సంఘాల జేఏసీ

వైఎస్‌ఆర్ మహనీయుడు 

దివంగత నేత వైఎస్ హయాంలో పరిశ్రమలకు స్వర్ణయుగంగా ఉండేది. ఆ మహానీయుడు పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా చూశారు. పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. పరిశ్రమలకు చార్జీలు పెంచలేదు. పైగా తగ్గించారు. కానీ ఈ ప్రభుత్వం చార్జీలు పెంచింది. పైగా కోతలు కూడా అమలు చేస్తోంది.
-మీసాల చంద్రయ్య, నాచారం పారిశ్రామికవాడ మాజీ ఉపాధ్యక్షుడు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!