YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 17 September 2012

గ్యాస్, డీజిల్‌పై విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నిరసన

ఎడ్లబండి తోలిన వైఎస్ విజయమ్మ
రోడ్డుపై కట్టెల పొయ్యితో వంటా వార్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్‌పై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభపక్ష నేత వై.ఎస్.విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎడ్లబండి, సైకిల్ రిక్షాలను తోలుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మార్గం మధ్యలో రోడ్డుపైన కట్టెలపొయ్యి ఏర్పాటు చేసి వంటా వార్పు నిర్వహించారు. 

స్వయంగా విజయమ్మే ఎడ్లబండిని తోలుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పెంచిన డీజిల్ ధరలను, వంటగ్యాస్‌పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గతంలో గ్యాస్ ధరలను కేంద్రం పెంచినప్పుడు ఆ భారం ఆడపడుచులపై పడకూడదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రభుత్వమే భరించేలా చూశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేయాలని తమ పార్టీ డిమాండ్ అని, అందుకే ఈ నిరసనకు దిగామని వివరించారు. గ్యాస్ అంశంతో పాటు విద్యుత్ విషయాన్ని కూడా సభలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునాఅడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ కంచెలు వేసి అడ్డుకున్నారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకులు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టి.బాలరాజు, సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, గొల్లబాబురావు, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, డా.దేశాయ్ తిప్పారెడ్డి ఉన్నారు. వీరితో పాటు పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేత, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, హైదరాబాద్ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్‌లతో పాటు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!