నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు వాడిగా జరిగాయి. సీబీఐ తరఫున న్యాయవాది పీ కేశవరావు వాదనలు వినిపిస్తూ వాన్‌పిక్ సంబంధించి మొదట రాష్ట్ర ప్రభుత్వం, రస్‌అల్‌ఖైమా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ తరువాత ఇందులోకి నిమ్మగడ్డ ప్రసాద్ భారతీయ భాగస్వామిగా వచ్చి చేరారంటూ అవగాహనా ఒప్పందానికి సంబంధించిన విషయాలను వివరించటం ప్రారంభించారు. ఆ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఆ వివరాలన్నీ ఇప్పుడు అవసరం లేదని, ప్రసాద్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో మాత్రమే చెప్పాలని సూచించారు. దీనిపై కేశవరావు బదులిస్తూ ''మీకు నేనెప్పుడైనా అనవసర విషయాలు చెప్పానా? ఈ వివరాలన్నీ కోర్టు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అన్నారు. దాంతో న్యాయమూర్తి వాదనలు కొనసాగించాలని సూచించారు. వాన్‌పిక్‌లో రస్‌అల్‌ఖైమాకు 51% వాటా ఉందని, అందులో నవయుగ కంపెనీకి వాటా ఇవ్వటంతో అది 26.5 శాతానికి పడిపోయిందని వివరించారు. ఆ సమయంలో న్యాయమూర్తి సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌ను పరిశీలించి, దాంట్లో ఎక్కడా రస్‌అల్‌ఖైమా గురించి పూర్తిస్థాయిలో ప్రస్తావన లేకపోవటంపై కేశవరావును ప్రశ్నించారు. చార్జిషీట్‌లో ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్ గురించిన ప్రస్తావన మాత్రమే ఉంది.. రస్‌అల్‌ఖైమా ప్రభుత్వ ప్రతినిధుల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? వారి పరిస్థితి ఏమిటి? వారికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదు? అంటూ ప్రశ్నలు కురిపించారు. దాంతో కేశవరావు తడబడి, ఆ విషయాలను తరువాత వివరిస్తానన్నారు. దీనికి అంగీకరించని న్యాయమూర్తి ముందుగా కోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, ఆ తరువాత మిగతా విషయాలకు వెళ్లాలని సూచించారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కేశవరావు దాటవేస్తున్నారని గ్రహించిన న్యాయమూర్తి రెండుసార్లు సమాధానం చెప్పాలంటూ ఆదేశించారు. ఆ సమయంలో కోర్టు హాల్లోనే ఉన్న సీబీఐ డీఐజీ వెంక ఒక కాగితంపై ఏదో రాసి కేశవరావుకు పంపారు. అందులోని విషయాన్ని చదివిన అనంతరం కేశవరావు సమాధానమిస్తూ రస్‌అల్‌ఖైమా ప్రతినిధులకు నోటీసులు పంపించినట్టు చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ''దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యింది. మీ (సీబీఐ) వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అవగాహన ఒప్పందం కూడా ఉంది. అన్నీ మీ వద్ద పెట్టుకుని వారికి నోటీసులు ఎందుకివ్వాల్సి వచ్చింది?'' అని ప్రశ్నించారు. మీరు సాగిస్తున్న దర్యాప్తును చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కరిపైనే జరిగినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై కేశవరావు సమాధానమిస్తూ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. విచారణ కీలకదశలో ఉందన్నారు. ఈ జవాబుపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎవరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ప్రతిసారీ దర్యాప్తు కీలక దశలో ఉందని, పూర్తి కాలేదని చెబుతున్నారు. ఏ అంశానికి సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదో స్పష్టంగా చెప్పండి'' అన్నారు. ఆ తరువాత కేశవరావు తన వాదనలు కొనసాగిస్తూ వాన్‌పిక్ కోసం కేటాయించిన భూముల వివరాలను చెప్పటం ప్రారంభించగా న్యాయమూర్తి అప్పుడు కూడా రెండు ప్రశ్నలను సంధించారు. అంతకు ముందు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపిస్తూ సీబీఐ తీరును తప్పుపట్టారు. తప్పుడు ఉద్దేశాలను మనసులో పెట్టుకుని సీబీఐ విచారణ జరుపుతోందని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్ విజయవంతమైన వ్యాపారవేత్త అని పేర్కొంటూ మూతబడ్డ ఎన్నో వ్యాపార సంస్థలను ఆయన కొనుగోలు చేసి, నిలబెట్టారన్నారు. 3కోట్ల రూపాయలకు మ్యాట్రిక్స్ ల్యాబ్‌ను కొన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఆరేళ్లలోనే దానిని ఆరువేల కోట్ల రూపాయలకు చేర్చారని తెలియచేశారు. ఒక పెట్టుబడిదారుడు ఏ విధంగా ఆలోచించి పెట్టుబడులు పెడతారో.. అదే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్ కూడా జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా ఆయన లాభాలు కూడా సంపాదించారని వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ నిజానికి వైఎస్ చనిపోయిన తరువాత జగతిలో పెట్టుబడులు పెట్టారన్నారు. బీవోటీ పద్ధతిలో చేపట్టిన వాన్‌పిక్ వల్ల ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం భవిష్యత్తులో రెండు పోర్టులకు యజమాని అవుతుందన్నారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణలోకి తీసుకోవటం లేదని చెప్పారు. వాన్‌పిక్‌కు ప్రభుత్వం భూములను ఉచితంగాగానీ, రాయితీపైగానీ కేటాయించలేదన్నారు. భూముల కేటాయింపు పూర్తి పారదర్శకతతో జరిగిందని చెప్పారు. బెయిల్ రాకుండా చేయటానికే సీబీఐ అధికారులు అర్థం లేని ఆరోపణలు చేస్తూ, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటున్న సీబీఐ అధికారులు దానికి ఎలాంటి ఆధారాలను చూపించటం లేదన్నారు. వాదనలు ముగిసేసరికి కోర్టు సమయం ముగియటంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు.
http://m.newshunt.com/Namasthetelangaana/Telangaana/16650442/996
http://m.newshunt.com/Namasthetelangaana/Telangaana/16650442/996
No comments:
Post a Comment