19 Sep 2012 02:16,
(19 Sep) నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం సముద్రాలు దాటి వస్తుందని అంటారు. జగన్ విషయంలో ప్రచారం అవుతున్న అబద్ధాలను చూస్తుంటే ఈ మాటే అనాలనిపిస్తోంది. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని అంటున్నారు. అందుకని గత 113 రోజులుగా జైలులో పెట్టారు. కాని అసలు సాక్షులను ప్రభావితం చేస్తున్నది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తున్నవారిని నిజంగా జైలులో పెట్టవలసి వస్తే లోపల ఉండ వలసింది ఎవరు? అబద్ధాలు రాయించేవారూ... వాళ్లకు తెలిసిన విషయాలను వక్రీకరించి ఏవేవో ఊహించి రాయించేవారూ... లేదా అలాంటి రాతలను రాయించిన తరువాత వాటిమీద స్టేట్‌మెంట్స్ ఇచ్చేవారూ... పోయిన సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ టైము నుంచి అంటే ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి పది నెలల పాటు జగన్ బయటనే ఉన్నాడు. ఆ పది నెలలలో ఆయన ఫలాన మనిషిని పిలిచి మాట్లాడాడనిగాని, ఫలానా మనిషికి ఫోన్ చేశాడనిగాని వీళ్ల దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? రెండు వేల ఫోన్లను టాప్ చేసిన మీకు తెలియకుండా ఆ పని సాధ్యమా? అయినా పొద్దున తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు ప్రజల మధ్యలో ఉండే మనిషికి సాక్షులను ప్రభావితం చేయగల సమయం, వీలు, మైండ్‌సెట్ ఉంటాయా? ఆలోచించండి. ఒక మనిషి రోజంతా పద్నాలుగు పదిహేను గంటలు అందరితో ఓపికతో ప్రేమగా మాట్లాడి మిగిలిన టైమ్‌లో ఇతరులను బెదిరిస్తూ అదిలిస్తూ దౌర్జన్యం చేస్తూ ఉండగలడా? ఇంత విరుద్ధంగా ప్రవర్తించగలరా ఎవరైనా? అసాధ్యం. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తాడు అంటున్నవాళ్లు అబద్ధాలకోర్లు అనే కదా అర్థం? ఇంకా చెప్పాలంటే పక్షపాతంతో కక్షపూరితంగా జగన్‌ను ఎలా ఇరికించాలా అన్న ఆలోచనలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే కదా అర్థం.
రెండు పత్రికలు, మూడు చానెళ్లు ఎలాగూ చేయూతనిస్తున్నాయని, ఎల్లో మీడియా వెంట ఉందని బరితెగించి జనం గమనిస్తున్నారన్న సంకోచం లేకుండా, సమాధానం చెప్పవలసిన దేవుడికి వెరవకుండా వ్యక్తుల హక్కులను కాలరాస్తున్న వీళ్లు ప్రజా రక్షకులు కాదు ప్రజాభక్షకులు. నేను అడుగుతున్నాను- అసలు సాక్షులను ప్రభావితం చేస్తున్న వాళ్లెవరన్నది బయటపడాలి ముందు. ఆ నిజం బయటపడి తీరాల్సిందే. మూడు తరాలుగా మా కుటుంబంలో వ్యక్తిగా ఉన్న సాయిరెడ్డిని సైతం జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని, లేదంటే అరెస్టు చేస్తామని కేసులు పెడతామని బెదరించింది ఎవరు? మా దగ్గర పెట్టుబడి పెట్టినవారిని కేసుల పేరుతో వేధించింది ఎవరు? సాక్షులను ప్రభావితం చేస్తారని జైలులో పెట్టవలసి వస్తే జైలులో ఉండవలసింది ఎవరు? వ్యాపారరంగంలో మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ చిత్రపటంపై పెట్టిన మాట్రిక్స్ ప్రసాద్‌గారిని కేవలం జగన్‌ను అరెస్ట్ చేయడానికని అరెస్ట్ చేశామన్న మాట వాస్తవం కాదా? నాకు బాగా గుర్తున్నాయి ప్రసాద్ గారి భార్య ఆషా నాతో చెప్పిన మాటలు - ''ప్రసాద్‌ను అరెస్టు చేయకముందు వాళ్లు ప్రసాద్‌తో జగన్‌కు వ్యతిరేకంగా చెపితే మిమ్మల్ని అరెస్టు చేయము అన్నారు''. ఈ మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వీళ్లు నిర్దోషులను దోషులుగా మారుస్తారు, దోషులను సాక్షులుగా మార్చేస్తారు అనేగా? ఇదీ ప్రభావితం అంటే. సాక్షులను భయపెట్టి బెదిరించి 161, 164ల కింద స్టేట్‌మెంట్లకు వత్తిడి తీసుకొని రావడమే ప్రభావితం అంటే. ఇక్కడ చిత్రం ఏమిటంటే ప్రభావితం చేయదగ్గ పదవి, అధికారం ఉన్నవారూ... ప్రభావితం చేస్తున్నవారు బయట ఉన్నారు. వారి వేధింపులు భరిస్తూ కష్టాలు నష్టాలు పడుతూ అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా ఎండనకా వాననకా క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమైన వ్యక్తి, మాటకోసం నిలబడ్డ ఆ వ్యక్తి లోపల ఉన్నాడు.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఏ అధికారికీ, ఏ మంత్రికీ ఫోన్ చేయడం గాని కలవడంగాని చేయని జగన్, ఏ రోజూ సెక్రటరియేట్‌లో కాలు కూడా పెట్టని జగన్, బెంగుళూరులో కుటుంబం, పిల్లలతో నివాసం ఉన్న జగన్ పది నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్తగా సాక్షులను ప్రభావితం చేస్తాడట. అందుకే ఎలక్షన్స్‌కు 15 రోజుల ముందు, న్యాయస్థానంలో హాజరుకావాల్సిన ఒకరోజు ముందు హటాత్తుగా జ్ఞానోదయమై అరెస్టు చేశారట. పిల్లలు కూడా విని నవ్విపోయే ఇలాంటి కథలను ఇంకా ఎంతకాలం చెప్తారు? దేవుడు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారు తెలివిలేనివారు కాదు. వారు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారినే మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ మొత్తం నాటకానికి కర్తలు ఎవరో, ఎవరు ఎవరిని ఆడిస్తున్నారో, ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తున్నారో, ఎవరు జైలులో ఉండాలో ఎవరు బయట ఉండాలో అంతా ప్రతిదీ ప్రజలకు తెలుసు. అందుకే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారీ బుద్ధి చెప్తున్నారు. తమ ఓటు హక్కుతో జగన్‌కు బాసటగా నిలుస్తున్నారు. ఇది కూడా ఆ కర్తలకు తెలుసు. కాని వాళ్లు కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లులు. చెవులుండీ వినలేనివారు, కళ్లుండీ చూడలేనివారు. - వైఎస్ భారతి w/o వైఎస్ జగన్ పాఠకులకు ఆహ్వానం: జగన్ పక్షాన, జనం పక్షాన నిలబడి వాదన వినిపించాలనుకుంటున్న పాఠకులకు ఆహ్వానం. జగన్ అక్రమ అరెస్టును, వైఎస్ కుటుంబంపై సాగుతున్న వేధింపులను, ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎండగట్టే మీ మీ వాదనలను మాకు రాయండి. మీ అభిప్రాయాలు చేరవలసిన చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34
source:
http://m.sakshi.com/Sakshi/Features-Wednesday/16607321/993
No comments:
Post a Comment