YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 17 September 2012

కాంగ్రెస్, టిడిపి కలిసి ఆడుతున్న నాటకం తొలి రోజు సక్సెస్


శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం తొలి రోజు విజయవంతమైంది. సమావేశాలు నిర్వహించాలనుకున్నదే 5 రోజులు. అందులో ఒక రోజు చర్చలు ఏమీ జరుగకుండానే వృధా అయిపోయింది. మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవా? రాష్ట్ర ప్రజల సమస్యలపై చర్చకు అత్యున్నత వేదిక శాసనసభ అని వారికి తెలియదా? ఈ సమావేశాల ప్రాధాన్యత తెలియదా? ఎందుకు తెలియదు, వారికి అన్నీ తెలుసు. సమావేశాల నిర్వహణకు ప్రజాధనం వృధా చేయడం వారికి అలవాటైపోయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఇదే తంతుతో ముగిశాయి. పార్లమెంటు సమావేశాలు జరిగిన 19 రోజులలో 13 రోజులు అసలు ఏ కార్యకలాపాలు జరుగలేదు. 'బొగ్గు' రభసతోనే ముగిశాయి. కేవలం ఆరు రోజులే సమావేశాలు సజావుగా జరిగాయి. ఇప్పుడు ఇక్కడ మన శాసనసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంటు సమావేశాలు చర్చలు ఏమీ లేకుండా నిరుపయోగంగా జరిగినందుకు దాదాపు 117 కోట్ల రూపాయలు వృధా అయినట్లు మీడియా గగ్గోలు పెట్టింది. అయినా మన ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదు. దానికి తోడు ఇక్కడ అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయి. 

శాసనసభ సమావేశాలకు, అందులో చర్చించే అంశాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగానీ, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ ప్రాధాన్యత ఇవ్వడంలేదని నిన్ననే తేలిపోయింది. సమావేశాల ఎజండాని ఖరారు చేసేందుకు నిన్న ఏర్పాటు చేసిన శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశానికి వీరు ఇద్దరూ హాజరుకాలేదు. వచ్చిన టిడిపి నేతలు కూడా సమావేశం ప్రారంభంలోనే అంశాలు ఏమీ చర్చించకుండానే వాకౌట్ చేశారు. వారి వ్యూహం నిన్ననే అందరికీ తెలిసిపోయింది. ఈ రోజు శాసనసభలో వారు ప్రవర్తించిన తీరుతో పూర్తిగా స్పష్టమైంది. ప్రధానంగా చర్చించవలసిన ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నందున శాసనసభ సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కోరారు. అనివార్యంగా నిర్వహించవలసిన సమావేశాలను తూతూమంత్రంగా ముగించాలన్న ఉద్దేశంతోనే అయిదు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 

శాసనసభ సమావేశాలు తొలిరోజునే వాయిదాల పర్వంతో మొదలైంది. విపక్ష సభ్యుల నినాదాలు, వాయిదా తీర్మానం కోసం పట్టుపట్టడంతో గందరగోళం మధ్య సమావేశాలు ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఆ తరువాత సభ్యులు సహకరించకపోవడంతో శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు. తొలి రోజు ఒక్క అంశంపై కూడా చర్చ జరుగలేదు. సభలో తమ గళం విప్పేందుకు అవకాశం లేకపోవడంతో అన్నిపార్టీలనేతలు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. 

పేద విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, విద్యుత్‌ సమస్యపై టీడీపీ, తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని టీఆర్‌ఎస్, తెలంగాణ విమోచన దినం అధికారికంగా పాటించాలని బీజేపీ , తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పింఛన్ ఇవ్వాలని సీపీఐ, పేద విద్యార్థులందరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ఎంఐఎం వాయిదా తీర్మానాలిచ్చాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్‌ సమస్యపై స్వల్పకాలిక చర్చకు అనుమతించినా ప్రయోజనం లేకుండాపోయింది.

విద్యుత్ కోతపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని నెల రోజుల నుంచీ ప్రగల్భాలు పలికిన టిడిపి నేతలు తొలిరోజే అభాసు పాలయ్యారు. ఈ సమస్యని పరిష్కరించే లెవల్లో లాంతర్ ఒకటి పట్టుకొని శాసనసభకు నడిచి వచ్చారు. సమస్యను తెలియజెప్పేందుకు, సమగ్రంగా చర్చించేందుకు ప్రయత్నించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి సభ వాయిదాపడేందుకు సహకరించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టివేసిన ఒక ప్రధానమైన సమస్యపై సావదానంగా సభలో ఎలా చర్చించాలో వారికి తెలియదనుకోవాలా? విద్యుత్ సమస్య చర్చకు రాకుండా వారు వ్యవహరించారని మిగిలిన పక్షాల వారికి తెలిసిపోయింది. విపక్షాల విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఆ తరువాత కూడా టిడిపి నేతలు అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సభ వాయిదా వేసినందుకు నిరసన తెలుపుతూ సభాపతి ఇంటి ముందు ధర్నా చేశారు. తొలి రోజు తమ నాటకాన్ని బాగా రక్తికట్టించామని వారు భ్రమపడ్డారు. కానీ విపక్షాలకు, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్, టిడిపిలు ఆడుతున్న నాటకం అర్ధమైపోయింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!