వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు ఏకపక్షంగా సాగుతుందా అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం సిబిఐని ఘాటుగా ప్రశ్నించింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది... లాభాల కోసమే నిమ్మగడ్డ జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టారని, పెట్టుబడులు అన్నీ సక్రమమే అని వాదించారు. నిమ్మగడ్డ న్యాయవాది వాదనలను సిబిఐ ఖండించింది. ప్రభుత్వం నిమ్మగడ్డ కంపెనీలకు కేవలం నాలుగు వేల ఎకరాలు కేటాయిస్తే నిమ్మగడ్డ మాత్రం 17వేల ఎకరాలు సేకరించారని కోర్టుకు తెలిపారు. ఇందుకు నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సహకరించిందని, ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.
వాదనల సందర్భంగా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దర్యాఫ్తు ఏకపక్షంగా సాగుతుందా అని సిబిఐని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి రస్ ఆల్ ఖైమాను ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఆ కంపెనీ పాత్ర గురించి ఎందుకు చెప్పలేదని, నిమ్మగడ్డ బెయిల్ పైన అభ్యంతరాలు చెప్పకుండా కేసు లోతుపాతులు ఎందుకని ప్రశ్నించింది. బెయిల్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సూచించింది.
విచారణ ఇంకా ఎంత మిగిలి ఉందని ప్రశ్నించింది. అయితే కోర్టు ప్రశ్నకు సిబిఐ సమాధానమిచ్చింది. రస్ ఆల్ ఖైమాకు కూడా తాము నోటీసులు పంపామని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కోర్టు నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ పైన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఎమ్మార్ కేసులో విజయ రాఘవ నిందితుడని సిబిఐ ప్రత్యేక కోర్టులో తెలిపింది. విజయ రాఘవ బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.
http://telugu.oneindia.in/news/2012/09/20/andhrapradesh-high-court-questions-cbi-on-nimmagadda-bail-plea-105902.html
No comments:
Post a Comment