నేను చిన్నప్పటినుంచి పక్కా కాంగ్రెస్ అభిమానిని. 70వ దశకంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధి అంటే పిచ్చి అభిమానం. దానికి కారణం బహుశా అప్పటి మా టీచర్స్ అయుండవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఒకసారి ఇందిరాగాంధి గుంటూరుకు వచ్చారు. అప్పుడు సెక్యూరిటీ ఇప్పటిలాగా ఉండేది కాదు. మా స్కూల్ టీచర్స్ చాలామంది స్టేజి మీద ఇందిరాగాంధికి పాదాభివందనం చేయడం ఇప్పటికీ బాగా గుర్తు. మేం అభిమానించే, భయపడే టీచర్స్ అలా పాదాభివందనం చేసేసరికి మాకు కూడా ఇందిరాగాంధి అంటే ఒకవిధమైన ప్రేమ, అభిమానం కలిగి వుండవచ్చు. అప్పటి నుంచి నేను, మా ఫ్రెండ్స్ కాంగ్రెస్‌ను అభిమానించేవాళ్లం. అది మన వైయస్సార్‌గారి వరకు కొనసాగింది.
ముఖ్యంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైయస్సార్‌గారు పడిన శ్రమ, అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాభిమానం తరిగిపోకుండా కాపాడిన విధానం - కాంగ్రెస్‌మార్క్ గ్రూప్ రాజకీయాలు లేకుండా మేనేజ్ చేసిన విధానం... ముఖ్యంగా 2009లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికి చేసిన కృషి... నన్ను వైయస్సార్ అభిమానిగా మార్చేశాయి. జగన్ కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఇది కొనసాగింది. నిజం చెప్పాలంటే జగన్ కాంగ్రెస్‌ను వీడినా ఎక్కడో పాత అభిమానం ఉండేది. కానీ దాని తర్వాత కాంగ్రెస్ వాళ్ల బిహేవియర్ చూస్తే అదంతా పోయింది. జగన్ అంటే ప్రేమ, అభిమానం అంతకంతకూ పెరిగింది. అలాగే టిడిపి అన్నా, దానికి కొమ్ముకాసే మీడియా అన్నా అసహనం అంతకన్నా పెరిగింది. వీరందరూ కలిసి జగన్‌ని అణచాలని ఎంత ప్రయత్నించారో... ఎన్ని కుయుక్తులు పన్నారో చూస్తుంటే సినిమాల్లో కూడా ఇంతటి రాజకీయాలు ఉండవనిపిస్తోంది.
సిబిఐని వాడుకుంటున్న తీరు, తమకు నచ్చనివాళ్ల మీద దాని ప్రయోగం... దారుణమైన స్టేట్‌మెంట్స్ ఇవ్వటం, అవి కూడా కొన్ని పత్రికల్లో రావడం చూస్తుంటే.. వీళ్లు ఎంతకైనా తెగించగలరు అనిపిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం... ఇప్పుడు ఏ పల్లెకెళ్లినా, ఎవర్ని అడిగినా చెప్తారు వీళ్లు ఆడే నాటకం. ఇంతెందుకు? నిన్నమొన్నటిదాకా రోజూ ఒకవర్గం మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిన కథనాలు సిబిఐ జెడి కాల్‌లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఠక్కున ఎందుకు ఆగిపోయాయి? సిబిఐ జెడి పేరు ఇప్పుడు మీడియా కథనాల్లో ఎందుకు రావడం లేదు. ఆఖరికి వీళ్లు న్యాయస్థానాన్ని భయపెట్టేస్థాయికి ఎందుకు ఎదిగారు? ఇవన్నీ నా ప్రశ్నలు కావు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 90 శాతం మంది ప్రజలవి. జగన్ నిజంగా తప్పు చేసి ఉంటే ప్రజలే శిక్షిస్తారు. అంతేకానీ లేనిపోని కేసులు పెట్టి, అసలు దొంగల్ని తప్పించి, జగన్‌ని ఏదో చేసేద్దామని అనుకుంటే ఆ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఆ కాలం ఇంకెంతోదూరం లేదు.
- శైలజ .కె
రామ్‌నగర్, హైద్రాబాద్అన్నా! ఎప్పుడొస్తావ్...!ఓ గుప్పెడు దుఃఖం అయితే
గుండె పిడికిట్లో పట్టి
లేని ధైర్యాన్ని ధైర్యంగా నటించెయ్యొచ్చు
చిరునవ్వుని ముఖానికి అతికించుకొని
అసలేం జరగనట్టు అందర్నీ నమ్మించెయ్యొచ్చు!
కానీ గగనమంత దుఃఖం
శరీరాన్ని పట్టి కుదిపేస్తున్న దుఃఖం
జగనన్న జైల్లో ఉన్నాడని గుర్తొచ్చినప్పుడల్లా
క్షణ క్షణం కనపడని వేదన విచ్చుకత్తులతో
వెన్నాడుతున్నంత దుఃఖం
మాటతప్పని నేరానికే
మహాకుట్ర చేశారని తెలిసినా
తలవంచని నేరానికి
నిర్బంధంలోకి నెట్టారని తెలిసినా
అగ్నివిస్ఫోటనంలా...
జైలు గోడలు బద్దలు కొట్టుకుని
జగనన్న నవ్వుతూ
నిర్దోషిగా బయటకొస్తాడని తెలిసినా
‘అన్న ఎప్పుడొస్తాడన్నా’ అని
ఆత్మీయులు అడిగే ప్రతి ప్రశ్న
సూటిగా గుండెల్లో దిగుతున్నప్పుడల్లా
సుడితిరుగుతున్న దుఃఖం
విగ్రహమైన రాజన్నని చూసినా
వేదన మోస్తున్న విజయమ్మను చూసినా
బాధని దిగమింగుతున్న భారతమ్మను చూసినా
కట్టలు దాటి కమ్ముకునేంత దుఃఖం
చంచల్‌గుడా పైనుంచి వెళుతున్నప్పుడల్లా
నా చేతగానితనాన్ని
చర్నాకోలతో చెళ్ళున చరిచినంత దుఃఖం
ఈ దుఃఖం నాదికాదు
అన్న కోసం ఆశగా చూస్తున్న
ప్రతి చెల్లిది... తల్లిది... అన్నది... అక్కది...
తమ్ముడిది... తాతది... అవ్వది
అన్నని కళ్ళారా చూడాలని ఆశగా ఆర్తిగా
ఎదురుచూస్తున్న
కోట్లమంది తడి నిండిన కళ్ళది
రాజన్నని జగనన్నని ప్రేమించే ఈ రాష్ట్రానిది...!
అన్నా! ఎప్పుడొస్తావ్?!
- డి.బీ.చారి
హైద్రాబాద్మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
No comments:
Post a Comment