YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 16 September 2012

కపట నాటకాన్ని అడ్డుకుంటాం

*ప్రజా సమస్యలపై చర్చకు 5 రోజులు సరిపోవు: ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి
*ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నాటకాలు 
*విద్యుత్ కొరత నివారణలో పూర్తిగా విఫలం
*ఎరువుల్లేవు.. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు 
*శిశు మరణాలు సంభవిస్తున్నాయి..వీటన్నింటిపై అసెంబ్లీలో చర్చిస్తాం 
*డీజిల్, గ్యాస్ సిలిండర్ల నియంత్రణపైనా చర్చిస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: శాసన సభ జరగకుండా అధికార, ప్రతిపక్షాలు ఆడే కపట నాటకాన్ని అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలపై చర్చించేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారపక్షం, వాటిని ఎత్తి చూపడంలో ప్రతిపక్షం ఘోరంగా విఫలమయ్యాయని అభిప్రాయపడింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఆదివారం ఇక్కడ సమావేశమైంది. 

సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అనంతరం శాసన సభాపక్షం ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి టి.బాలరాజు, జి.బాబూరావులతో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశం నిర్ణయాలను వెల్లడించారు. శాసన సభ సమావేశాలు మొక్కుబడి తంతుగా అయిదు రోజులు మాత్రమే నిర్వహించాలనుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు. స్పీకర్ సమక్షంలో జరిగిన బీఏసీ సమావేశంలో కూడా తమ నాయకురాలు విజయమ్మ కనీసం పదిహేను రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేశారని చెప్పారు. 

‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ప్రారంభించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. విద్యుత్ కొరతను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంటలకు వేయడానికి ఎరువులు దొరకడంలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ప్రభుత్వ ఆస్పపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక రాష్ట్రవ్యాప్తంగా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటిపైనా మా పార్టీ గళం విప్పుతుంది. శాసన సభను ప్రజోపయోగ వేదికగా వినియోగించుకుంటాం. డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల నియంత్రణపై కూడా శాసన సభలో చర్చిస్తాం. ఇన్ని సమస్యలపై చర్చించాలంటే నాలుగైదు రోజులు సరిపోవు. అందుకే ఎక్కువ రోజులు అసెంబ్లీని సమావేశపర్చాలని కోరుతున్నాం’’ అని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం గ్యాస్ ధరను పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడకుండా వెసులుబాటు కల్పించారని, ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అవిశ్వాసం పెట్టండి చూద్దాం!

కాంగ్రెస్ పార్టీని పెళ్లాడి కాపురం చేస్తున్నది టీడీపీయేనని ఎమ్మెల్యే బాబూరావు ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కు కాలేదంటే వారి నాయకుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాలు విసిరారు. ఎవరు ఎవరిని పెళ్లాడారో అప్పుడు అర్థమవుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పడం అధికారపక్షం చిత్తశుద్ధి లేమికి నిదర్శనమన్నారు. శాసన సభాపక్షం సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప నాయకులు మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, పార్టీ ముఖ్య నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, డి.ఎ.సోమయాజులు, ఎస్.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!