YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 17 September 2012

సీబీఐ దుర్బుద్ధి బయటపడింది

2000లో ప్రారంభమైన ఒప్పందాల తీరును ఎందుకు ప్రశ్నించలేదు? 
బాబుకు రక్షణ కవచంలా కాంగ్రెస్, సీబీఐ
వైఎస్ కుటుంబం టార్గెట్‌గా దర్యాప్తు
సునీల్‌రెడ్డినే దోషిగా చూపింది... కాంగ్రెస్ పెద్దలను వదలివేసింది

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన కుటుంబీకులను అప్రతిష్టపాలు చేసే దురుద్దేశంతోనే సీబీఐ ఎమ్మార్ కుంభకోణంలో దర్యాప్తును పూర్తి చేసిందని... ఒప్పందాలు జరిగినపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఏ మాత్రం విచారించకుండా వదలివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎమ్మార్ సంస్థను భారతదేశానికి తెచ్చిన చంద్రబాబును కనీసం ప్రశ్నించలేదని, దీనిని బట్టి సీబీఐ దుర్బుద్ధి ఏమిటో బయటపడిందని చెప్పారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబం మీద, వారి మనుషుల మీద కక్ష గట్టినట్లుగా సీబీఐ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘ఎమ్మార్ సంస్థను రాష్ట్రానికి తెచ్చింది చంద్రబాబునాయుడు... టౌన్‌షిప్, హోటల్, గోల్ఫ్ కోర్సు నిర్మాణానికి 535 ఎకరాల భూమిని కేటాయించిందీ ఆయనే. వాస్తవానికి ఈ వ్యవహారమంతా 2000 సంవత్సరం నుంచే మొదలైంది. రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసి బిడ్డింగ్‌లో పాల్గొన్న ఐదు సంస్థల్లో మిగతా నాలుగింటిని తప్పుకునేలా చేశారు. 

అలా తప్పుకున్న వారికి ప్రతిఫలంగా ఇతర ప్రాజెక్టులను అప్పగించారు. ఒక్క సంస్థే బిడ్డింగ్‌లో మిగిలితే రద్దు చేయాలన్న నిబంధన ఉన్నా... దానిని తుంగలో తొక్కి తనకు బాగా సన్నిహితుడు, తన బినామీ అయిన కోనేరు ప్రసాద్‌కు మేలు చేయడానికి ఎమ్మార్‌కే భూమిని కేటాయించారు. తొలుత 230 ఎకరాలే అనుకున్న భూమిని రాత్రికి రాత్రి బాబు ఒక నోట్‌ఫైల్ ద్వారా 535 ఎకరాలకు పెంచారు. ఎకరా రూ. 29 లక్షలకు కారు చౌక ధరకు కేటాయించారు. వాస్తవానికి అదే పరిసరాల్లో బాబుకు ఉండిన మూడెకరాల సొంత భూమిని ఎకరా రూ.కోటికి అమ్మారు. ఆ తరువాత మూడో పార్టీ ఒప్పందంలో ప్రవేశించడానికి వీలుగా చంద్రబాబు హయాంలోనే కొలాబరేషన్ ఒప్పందానికి ఆస్కారం కల్పించారు. 

అసలు మొత్తం కుంభకోణానికి ఈ కొలాబరేషన్ ఒప్పందమే కారణమని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ వ్యవహారంపై ఆదేశించిన విజిలెన్స్ విచారణ నివేదికలో తేల్చారు. కానీ సీబీఐకి మాత్రం ఇవేమీ కనిపించలేదు. సుప్రీంకోర్టు ఆదేశించినా బాబును మాటమాత్రంగానైనా ప్రశ్నించలేదు. దర్యాప్తు ముగిశాక వేసిన చార్జిషీటు చూస్తే వైఎస్ కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉన్న ఒక లింకును కలపడానికి ప్రయత్నం చేసినట్లుగా ఉంది. బాబును, ఇదే వ్యవహారంతో ఉన్న కొందరు కాంగ్రెస్ పెద్దలను వదలి వేసి సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని ఇరికించి ఆయన చుట్టూ ఉచ్చును బిగించేందుకు సీబీఐ కృషి చేసింది’’ అని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఇరికించడానికి కాంగ్రెస్‌కు చంద్రబాబు సహకరిస్తున్నారు కనుక ఆయనను రక్షించేందుకు కాంగ్రెస్, సీబీఐ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నిజాయతీపరుడని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చెప్పించగలరా? అని పద్మ సవాల్ చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!