YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 2 October 2012

జగన్ కోసం - 16 (పాఠకుల స్పందన) sakshi


‘‘జగన్‌ను అరెస్టు చేసిన తీరు, విజయమ్మగారి సూట్‌కేసులను చెక్‌చేసిన తీరుపై ఆంధ్రరాష్ట్రంలో కన్నీరు పెట్టనివారు లేరు. వైఎస్ అభిమానుల చేతుల్లో ఏమీ లేదు గనుక చూస్తూ బాధపడ్డారు. అవకాశం వచ్చిన 18 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పారు.’’

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకు ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడి ఆయన దృష్టిలో పడాలని తహతహలాడారు చాలామంది. పండుగలు, పబ్బాలు అంటూ ఏదో ఒక కారణం కల్పించుకుని ఆయన ముందు ప్రత్యక్షమై దండాలు పెట్టిన ఆ నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాలాంటి వారికి విస్మయం కలుగుతోంది.

2004 నుంచి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫ్లెక్సీలు కట్టి ఎప్పుడెప్పుడు వైఎస్ కళ్లల్లో పడదామా అని తాపత్రయపడ్డవాళ్లు, రాఖీ పండుగనాడు మా అన్నయ్య అని చుట్టుముట్టి టన్నులకొద్దీ ప్రేమానురాగాలను అందించిన చెల్లెమ్మలు... ఎందరో... రాజకీయ కళాకారులు నేడు వైఎస్ మరణించాక తమ నిజస్వరూపం ఏమిటో చాటుకుంటున్నారు.

కోట్లాది పేదప్రజలకు మేలు చేకూర్చి నేనున్నానని భరోసా ఇచ్చి రైతుల గుండెల్లో స్థానం సంపాదించిన రాజశేఖరుడి పేరుపై బురద చల్లడానికి నేటి ప్రభుత్వం కుటిలయత్నాలు చేస్తోంది. ఎందుకిలా చేస్తున్నారు? వైఎస్ జీవించి ఉండగా తానెన్నడైనా కాంగ్రెస్‌ను దూషించారా? కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడారా? అధిష్ఠానం మాట జవదాటని ముఖ్యమంత్రిగా వైఎస్, అధినేత్రి సోనియాకు విధేయుడుగా ఉండలేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు సారథ్య బాధ్యతలను భుజాన వేసుకుని ఒంటిచేత్తో రెండుసార్లు గెలిపించారే! అందుకేనా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు దూషిస్తున్నది. పేద ప్రజలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఒక్క మేలు జరిగే పని ఏదైనా చేశామా..? అని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ప్రతినెలా సామాన్యులపై ఏదోఒకరకంగా పన్నుల భారం మోపుతూ, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ కోలుకోకుండా చేస్తోంది.

ఇక వై.ఎస్. తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయానికి వస్తే ఆయనను అకారణంగా జైలులో పెట్టి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంది. ఏనాడూ ప్రత్యక్షంగా గానీ పరిపాలనలోగానీ జోక్యం చేసుకోని జగన్మోహన్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించి అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపి భుజాలు ఎగరేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ‘కోటికి ఎన్ని లక్షలుంటాయి.. లక్షకు ఎన్ని వేలుంటాయి...’ అనే లెక్కలు తెలియనివారు కూడా లక్షకోట్ల అవినీతి జరిగిందంటూ గగ్గోలుపెడుతున్నారు... పెట్టిస్తున్నారు.

దున్నపోతు ఈనిందంటే పెయ్యదూడను పెట్టిందంటూ బాకా ఊదే మీడియా ఉన్నంతకాలం ఇటువంటి వార్తలకు కొదవ లేకుండా పోతుంది. జగన్మోహన్‌రెడ్డిపై సీబీఐ కేసులు ఎందుకు పెట్టిందో... దానిలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయో లేదో అనే విషయం ఈపాటికి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ జగన్‌పై పెట్టిన కేసుల ద్వారానే ఆయన నిజస్వరూపం బయటపడడంతో సీబీఐ అసలు ఉద్దేశ్యం ఏంటో బట్టబయలైంది.

లక్ష్మీనారాయణ చేసిన కాల్‌లిస్ట్‌లు బయటపడిన తరువాత ఆయన పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’లా కొట్టుకుంటూ కొత్త కేసులకు తెరతీసే ప్రయత్నం చేస్తున్నారు. జెడీ ఫోన్ ఎందుకు చేశాడో చెప్పుకోలేక కాల్‌లిస్ట్ బయటపెట్టిన వారిపై కేసులు పెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేసిన తీరు, విజయమ్మగారి సూట్‌కేసులను చెక్‌చేసిన తీరుపై ఆంధ్రరాష్ట్రంలో కన్నీరు పెట్టనివారు లేరు. వైఎస్ అభిమానుల చేతుల్లో ఏమీ లేదు గనుక చూస్తూ బాధపడ్డారు. అవకాశం వచ్చిన 18 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పారు.

మా సోదరి కొండా సురేఖ, సోదరుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ విశ్వాసానికి ప్రతీకగా నిలవడం మాలాంటి మధనపడుతున్న వారికి పన్నీరు చిలకరించినట్లయింది. చిన్నపదవికి కూడా కక్కుర్తిపడే ఈరోజుల్లో మంత్రిపదవులనే వైఎస్ కుటుంబంకోసం వదులుకున్న వీరి త్యాగం సదా స్మరణీయం.

సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ 2004 నుంచి 2009 వరకు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతోనే 2009 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మరోదఫా అధికారం అప్పగించారు. మరో దఫా అధికారంలోకి వచ్చేందుకు కృషిచేసిన సాక్షి పత్రిక, ఛానెల్‌పైనే నేటి కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడడం వారి విశ్వాసఘాతుకానికి నిదర్శనంగా నిలుస్తోంది.

రాజశేఖరరెడ్డి గారి రెక్కల కష్టంతో వచ్చిన అధికారం వెలగబెడుతూ సామాన్య ప్రజలకు ఏమాత్రం మేలుచేయకపోగా ప్రతిదినం సమస్యలతో సామాన్యుడు బాధపడేలా చేయడాన్ని ఎవరూ కూడా సహించే పరిస్థితిలో లేరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..? వీరికి సరైన గుణపాఠం ఎప్పుడు నేర్పుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ కుట్రలన్నీ ఛేదించుకుని జగన్ విజయుడై తిరిగి వస్తాడు. ఆ దేవుడిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన రాకకై వేయికళ్లతో ఎదురుచూస్తూ...

- కోనేరు కోనప్ప, మాజీ శాసనసభ్యులు, సిర్పూర్ (టి)

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!