YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 5 October 2012

దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ అన్ని హక్కులూ ఉంటాయి

హైదరాబాద్, న్యూస్‌లైన్: కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలను నేరస్తులుగా భావించడం తగదని, దోషిగా నిర్ధారణ అయ్యేవరకూ రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని హక్కులూ వారికి వర్తిస్తాయని సాక్షి టీవీ నిర్వహించిన ‘లా పాయింట్’ చర్చావేదికలో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. పలుకుబడి కలిగిన వ్యక్తి అయినందున సాక్షులను ప్రభావితం చేస్తారనే భావనతో బెయిల్ ఇవ్వకపోవడం సరికాదని, సాక్షులను ప్రభావితం చేసినప్పుడు మాత్రమే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎ.చంద్రశేఖర్, జీఎల్ నరసింహారావు ఈ చర్చావేదికలో పాల్గొన్నారు. న్యాయవాదుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

చట్టప్రకారం బెయిల్ అనివార్యం: రవిచందర్

‘‘చట్టప్రకారం 99 శాతం కేసుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షులను ప్రభావితం చేస్తారని, దేశం వదిలిపారిపోతారనే కారణాలతో మాత్రమే బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే కోర్టు సహేతుకమైన కారణాలను చూపాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులైనందున సాక్షులను ప్రభావితం చేస్తారని భావించడం సరికాదని నా అభిప్రాయం. ఒక వేళ సాక్షులను ప్రభావితం చేస్తే దర్యాప్తు సంస్థ వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తులను ఎవరూ ప్రభావితం చేయలేరని భావించినప్పుడు ప్రజాస్వామ్యంలో వేరే సంస్థలను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నెల వర కూ దర్యాప్తు జరుగుతున్నందున అప్పటివరకూ బెయిల్‌కు దరఖాస్తు చేయవద్దని సుప్రీంకోర్టు అనడం మాత్రం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు చాలా నిశితంగా పరిశీలించి తన అధికారాన్ని వాడుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. క్రిమినల్, సివిల్ కేసుల్లో ఏళ్ల తరబడి కేసులు కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే ఉంచాలనుకోవడం సమీక్షించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను. దోషిగా నిర్ధారణ అయ్యే వరకూ నిందితులందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు వర్తిస్తాయి. ‘ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. లేదా ప్రతిపక్షంలో ఉన్నాం.. ఇదే పరిస్థితి రేపు మనకూ రావచ్చు..’ అనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకీ ఉండకపోవడం బాధాకరం. 

బెయిల్ ఇవ్వకుండానే అనుబంధ చార్జిషీట్లు: నరసింహారావు

‘‘ పెట్టుబడుల వ్యవహారంలో ఒక చార్జిషీటు తరువాత మరో చార్జిషీటు వేయడం ద్వారా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని సీబీఐ చూస్తోంది. చట్టప్రకారం 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలుచేయాలి. ఒక వేళ చార్జిషీటు దాఖలు చేయకుంటే బెయిల్ పొందే అవకాశం ఉంది. చార్జిషీటు వేయడం పూర్తయిందంటే దర్యాప్తు కూడా పూర్తయినట్లే కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చు. కానీ, ఒకటి తరువాత మరొక అనుబంధ చార్జిషీట్టు వేస్తున్నారు. ఇలా అనుబంధ ఛార్జిషీట్లు వేయడం తప్పేనని నా అభిప్రాయం’’. 

మానవ హక్కులకు భంగం: చంద్రశేఖర్

‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే గతంలో టెలిగ్రాఫిక్ ఆదేశాలిచ్చేవారు. ఇప్పుడు మిగతా కేసుల్లోలాగానే మూడు నాలుగు రోజులు వాద ప్రతివాదనలు వింటున్నారు. దీంతో నిందితులను తాపీగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇది సాధారణంగా మారుతోంది. సహేతుక కార ణం చూపకుండా ఏ వ్యక్తినీ జైల్లో ఉంచరాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.’’

కోర్టు అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది: వీరారెడ్డి

చార్జిషీటు వేయడానికి ముందు, చార్జిషీటు వేసిన తరువాతా.. బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కొన్ని కేసుల్లో మాత్రం దర్యాప్తు పూర్తయ్యేవరకూ బెయిల్ ఇవ్వకపోవచ్చు. అయితే సాక్షులను ప్రభావితం చేస్తారని కానీ, తీవ్రమైన నేరం అయినప్పుడుకానీ మాత్రమే కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది.’’

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!