ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని నీతులు చెప్పే నేతలు....తమ వరకూ వచ్చేసరికి మాత్రం వాటిని గాల్లోకి వదిలేయటం పరిపాటిగా మారిపోయింది. రాయితీలు ఇవ్వడానికి డబ్బులు చెట్లకు కాయవు కదా అని ప్రశ్నించే నేతలు... ప్రజల సొమ్ముతో నిసిగ్గుగా విదేశీ పర్యటనలు పేరుతో కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం పరిపాటిగా మారిపోయింది. నాటి ప్రజాసేవకులు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేటి పాలకులు ఆ చరిత్రను తిరిగరాస్తున్నారు. ప్రజల సొమ్ముతో సోకులు ఎలా చేసుకోవచ్చో నిరూపిస్తున్నారు. రాష్ట్రపతులు మొదలు ప్రజాప్రతినిధులు, అధికారులు అవకాశం దొరికినప్పుడల్లా విదేశీ పర్యటనలలో తరిస్తుంటారు. అయితే వారి పర్యటనలకు అయ్యే ఖర్చు మాత్రం ప్రజల నెత్తినే రుద్దుతుంటారు. అయితే వీరు విదేశీ పర్యటనకు వెళ్లి సామాన్యులకు ఊడపొడిచేది ఏమీలేదు. పేరుకు అధికారిక పర్యటనలు అయినా... అవి విహార యాత్రలుగానే మిగిలిపోతున్నాయి. విదేశీ పర్యటనల కోసం కోట్లాది రూపాయిల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మహాసభలకు ఆయా ప్రభుత్వ శాఖల తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతినిధి బృందాలు జరిపే పర్యటనలకు వ్యయం తడిసి మోపెడు అవుతోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు జరిపే ఖర్చుల వివరాలు పరిశీలిస్తే ప్రజా ధనాన్ని పాలకులు నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న వాస్తవం వెల్లడి అవుతుంది. మన కేంద్రమంత్రులు 2011-12 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనల నిమిత్తం ఖర్చు చేసిన మొత్తమెంతో తెలుసా? ఏకంగా 687 కోట్ల రూపాయలు. నోళ్లు వెళ్లబెట్టకండి... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన సమాచారమిది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ దగ్గర ప్రస్తావిస్తే ఆయన గట్టిగా సమర్థించుకొచ్చారు. ఇవన్నీ అధికారిక పర్యటనలనీ, ఇష్టమున్నా... లేకపోయినా అవసరం మేరకు వెళ్లారని అన్నారు. విదేశీ పర్యటనల మూలంగా నిద్రాహారాల్లో తేడా వస్తుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని, కుటుంబంతో గడపలేమని... ఇలా అన్నీ దెబ్బతింటాయని చెప్పుకోచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం అంత తేలిక కాదన్నారు. కుటుంబాన్ని వదిలి తరచూ పర్యటనలకు వెళ్లడం ఎవరికీ ఇష్టముండదని, అధికారిక విధుల దృష్యా వెళ్లాల్సి ఉంటుందని, వారేమీ విహార యాత్రలకు వెళ్లడం లేదని ఎదురు దాడికి దిగటం గమనార్హం. అంతకుముందు సంవత్సరంలో (2010-11లో) మంత్రుల విదేశీ పర్యటనల ఖర్చు కేవలం 56 కోట్లే ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా దేవీ పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం వింటే కళ్లు తిరుగుతాయి. ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా పనిచేసిన అయిదేళ్లలో ఆమె విదేశీ పర్యటనల ఖర్చు 205 కోట్లుపైనే అయింది. ప్రతిభాపాటిల్ మొత్తం 12 సార్లు 22 దేశాల్లో పర్యటనలు జరిపారు. ఆమె పర్యటనల కోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు 169 కోట్ల రూపాయిలు. రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. వాటికయిన ఖర్చును ప్రత్యేకంగా చూపారు. అలాగే, రాష్ట్రపతి వెంట బంధు మిత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీ పర్యటనల కోసం 1880 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. విదేశాల్లో సోనియా పర్యటిస్తున్న సందర్భంలో విలాసవంతమైన హోటళ్ల ఖర్చులకోసం 1880 కోట్లు వెచ్చించారని, గుజరాత్ లోని మూడు ముఖ్యమైన కార్పొరేషన్ల బడ్జెట్ తో సమానమని ఆయన అన్నారు. హర్యానాలోని హిస్సార్ కు చెందిన ఓ యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా ఈసమాచారాన్ని సేకరించారరని, స్థానిక పత్రికలో ప్రచురితమైందని.... తన ఆరోపణలకు మూలాధారం ఇదేనని మోడీ తెలిపారు. కేవలం ఒక ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ప్రధాని, రాష్ట్రపతుల కోసం వినియోగించే ప్రత్యేక విమానంలో విహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఏంటని ప్రశ్నించారు కూడా. అయితే మోడీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చటం విశేషం. కాగా ప్రభుత్వ శాఖల్లో దుబారాని తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నీ ఆరంభశూరత్వాలే అయ్యాయి. ముఖ్యంగా మంత్రుల పర్యటనలు, ఐదు నక్షత్రాల హోటళ్ళలో సభలూ, సమావేశాల పేరిట ప్రభుత్వ శాఖల్లో ఎంతో దుబారా అవుతోంది. కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలకు అయ్యే వ్యయం ఒక్క ఏడాదిలోనే పది రెట్లు పెరిగింది. 2010-11లో అది 56 కోట్ల 12 లక్షలు ఉండగా, 2011-12లో అది 678కోట్ల 52 లక్షలకు పెరిగింది. ఎయిరిండియాకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం 499 కోట్ల 89 లక్షలకు చేరుకుంది. విదేశీ పర్యటనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా పాలకులు మాత్రం వాటిని లైట్ గా తీసుకోవటం సిగ్గుచేటు. అందుకే అంటారేమో సొమ్మొకడిది.....సోకొకడిది అని. source: sakshi |
Tuesday, 2 October 2012
ప్రజల సొమ్ముతో సోకులా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment