YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 4 October 2012

రూ.21 కోట్ల లబ్ధికి..29 కోట్లు పెట్టుబడట? ఈడీ.. కామెడీ

ఇది అటాచ్‌మెంట్‌కు ఈడీ చెప్పిన కథ
ఇదే అంశంపై ఈ ఏడాది మార్చి 31న సీబీఐ చార్జిషీటు
దాన్లో హెటెరో, అరబిందోలకు కలిగిన లబ్ధి రూ. 16 కోట్లుగా వెల్లడి
ప్రతిగా వారు రూ. 29.5 కోట్లుపెట్టుబడి పెట్టారని ఆరోపణ
ఈ లబ్ధి మొత్తాన్ని రూ. 21.5 కోట్లకు పెంచిన ఈడీ; వివరాలు మాత్రం సున్నా
నోటికొచ్చిన పొంతనలేని లెక్కలతోదర్యాప్తు సంస్థల దారుణాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకరా రూ. 7 లక్షలకివ్వటమూ నేరమేనట
అదికూడా అభివృద్ధి చేయని, కంచె వేయనిఖాళీ భూమి.. శంకర్రావు, టీడీపీ నేతల పిటిషన్ల నుంచీ అవే ఆరోపణలు
ఎఫ్‌ఐఆర్‌లో, చార్జిషీట్లో, ఆఖరికి అటాచ్‌మెంట్ ఉత్తర్వుల్లోనూ పునరావృతం

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి):ఈ కేసును అర్థం చేసుకోవటానికి న్యాయశాస్త్రం చదవక్కర్లేదు. పెద్ద పెద్ద డిగ్రీలుండాల్సిన అవసరమూ లేదు. అపరిమితమైన విజ్ఞానమూ అక్కర్లేదు. కావాల్సిందల్లా కాస్త కామన్‌సెన్స్. నిష్పాక్షికంగా ఆలోచించగలిగే మనసు. అంతే!! 

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ గురువారంనాడు ఇచ్చిన చిన్న నోట్‌లో ఏముందంటే... వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అరబిందో ఫార్మా లిమిటెడ్, హెటెరో డ్రగ్స్ సంస్థలకు తలా రూ.8.6 కోట్ల లబ్ధి కలిగిందని. ఇదికాక అరబిందోకు మరో 4.3 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని. అంటే మొత్తమ్మీద ఈ రెండూ రూ.21.5 కోట్ల మేర లబ్ధి పొందాయని. అందుకు ప్రతిఫలంగా ఆ రెండు సంస్థలూ కలిసి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో రూ.29.5 కోట్లు పెట్టుబడి రూపంలో పెట్టాయని. 

అసలు 21.5 కోట్లు లబ్ధి కలిగినందుకు అంతకన్నా ఎక్కువగా రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టేవారెవరైనా ఉంటారా? అలాంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా? మరి ఉండనప్పుడు సిసలైన ఇన్వెస్టర్లలా ఆలోచించి... తమ పెట్టుబడులకు భవిష్యత్తులో మంచి లాభాలొస్తాయనో, ఒక మీడియా సంస్థలో పెట్టుబడులుంటే మంచిదనో ఇన్వెస్ట్ చేశారనుకోనక్కర్లేదా? సీబీఐ కానీ, దాని చార్జిషీట్‌ను యథాతథంగా కాపీ కొట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కానీ ఈ కోణంలో ఆలోచించవెందుకు? అసలు హెటెరో డ్రగ్స్, అరబిందో విషయంలో ఏం జరిగింది....?

ఇదీ జరిగిన కథ...

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని భావించిన ఏపీఐఐసీ... 950 ఎకరాలు సేకరించింది. దీన్లో 250 ఎకరాల్ని ప్రత్యేక ఆర్థిక మండలికి కేటాయిస్తే బాగుంటుందని 2006లో అప్పటి ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య ప్రతిపాదించారు. 2006 అక్టోబర్ 27న దీనికి కేంద్ర వాణిజ్య శాఖ అనుమతినిచ్చింది. తర్వాత ఏపీఐఐసీలోని ధరల నిర్ణాయక కమిటీ దీనికి ఎకరాకు రూ.15 లక్షలుగా ధర నిర్ణయించింది. 2006 డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించి... ఆ లోగా దరఖాస్తులొస్తే ఎకరా రూ.15 లక్షలకు కేటాయించాలని, లేకుంటే 50 ఎకరాల్ని సెజ్‌కు ఇవ్వాలని... వీటిలో ఏది ముందైతే అది చేయాలని సూచించింది. డిసెంబర్ 7న మళ్లీ సమావేశమై ఎకరా ధరను రూ.20.23 లక్షలకు సవరించింది. 

అయితే 2006 నవంబర్ 17నే అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి, హెటెరో డ్రగ్స్ డెరైక్టరు శ్రీనివాసరెడ్డి తమకు తలా 75 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరా రూ.7 లక్షల చొప్పున కేటాయించాలంటూ... దాన్లో 10 శాతం మొత్తాన్ని ఈఎండీ కింద చెక్కు కూడా ఇచ్చారు. కిందిస్థాయి అధికారులు ఆమోదించి దాన్ని ఏపీఐఐసీ ఎండీకి పంపగా... ఆయన దాన్నిచూసి ఆఫర్ లెటర్లు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. ‘‘ధరల కమిటీ రూ.15 లక్షలుగా నిర్ణయించినా రూ.7 లక్షలకు కేటాయించటం వల్ల ఎకరాకు రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వానికి నష్టం వచ్చింది. అంటే 150 ఎకరాలపై రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని కాగ్ కూడా గతంలో చెప్పింది’’ అని ఈ ఏడాది మార్చి 31న దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో సీబీఐ తెలియజేసింది. 

మరో అంశమేమిటంటే మెదక్ జిల్లా పాశమైలారంలోని ఈపీఐపీలో అరబిందో ఫార్మా సంస్థకు ప్రభుత్వం 33.33 ఎకరాలు కేటాయించింది. తరవాత అరబిందో దీన్ని తన అనుబంధ సంస్థ ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ‘‘ఏపీఐఐసీ నేరుగా ట్రైడెంట్‌కు భూమి కేటాయించి ఉంటే దానికి చదరపు మీటరుకు రూ.500 ధర దక్కేది. కానీ అరబిందో కేటాయించటం వల్ల ఏపీఐఐసీకి చదరపు మీటరుకు రూ.150 మాత్రమే దక్కింది. దీంతో ప్రభుత్వానికి రూ.4.30 కోట్ల నష్టం వాటిల్లింది’’ అని తొలి చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. 

తక్కువ ధరకు కేటాయించినట్టా?

ఏ ప్రభుత్వమైనా భూమి ధరను ఎక్కువగా పేర్కొని... తక్కువకు కేటాయించటం మామూలే. దానివల్ల పారిశ్రామికవేత్తలకు తాము విలువైన భూమిని పరిశ్రమల నిమిత్తం తక్కువకే కేటాయిస్తున్నామని చెప్పుకోవటానికి వీలవుతుంది. వాళ్లను పరిశ్రమలకోసం ముందుకు వచ్చేట్లుగా ప్రోత్సహించినట్లవుతుంది. ఇక జడ్చర్ల భూమినే తీసుకుంటే... ఏపీఐఐసీ ఏ సెజ్‌లో భూమి కేటాయించినా దానికి చుట్టూ కంచె, మధ్యలో రోడ్లు ఉంటాయి. జడ్చర్లలో ఆ పనులన్నీ ఈ కంపెనీలే తమ సొంత నిధులతో చేపట్టాయి. పెపైచ్చు సదరు భూ సేకరణ వల్ల నిర్వాసితులైన వారికి సహాయ పునరావాసాలు కల్పించే బాధ్యతను కూడా ఇవే తీసుకున్నాయి. యాంకర్ యూనిట్లుగా ఇవి వస్తే మిగిలిన భూమిలో పరిశ్రమలు చేపట్టడానికి ఎవరైనా ముందుకొస్తారని భావించి ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసింది. వీటన్నిటినీ విస్మరించిన సీబీఐ, ఈడీ... పొంతనలేని లెక్కలతో అరెస్టులకు, చార్జిషీట్లకు, ఆఖరికి ఆస్తుల అటాచ్‌మెంట్లకు కూడా దిగుతుండటమే అత్యంత దురదృష్టకరమైన అంశం.

పొంతన లేని లెక్కలు...

సీబీఐ తన చార్జిషీట్లో చెప్పిన దాని ప్రకారం ఈ భూ కేటాయింపు వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం రూ.16.30 కోట్లు. (12 కోట్లు + 4.30 కోట్లు). అందుకు ప్రతిఫలంగా అరబిందో సంస్థ రూ.19.5 కోట్లను, హెటెరో డ్రగ్స్ సంస్థ రూ.10 కోట్లను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడిగా పెట్టాయనేది సీబీఐ ఆరోపణ. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా సంస్థల్లో అరబిందో, హెటెరో సంస్థలు రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టడం వాస్తవమే. అదేమీ రహస్యం కాదు. 

మిగతా ఇన్వెస్టర్ల మాదిరిగానే వారూ వాటాలు కొని పెట్టుబడి పెట్టారు. కానీ వారు రూ.16.30 కోట్లు లబ్ధి పొందినందుకే ఆ 29.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారనేది సీబీఐ వాదన. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విషయానికొస్తే... అది గురువారం విడుదల చేసిన నోట్‌లో అరబిందో, హెటెరోలకు భూమిని కేటాయించటం వల్ల అవి తలా రూ.8.60 కోట్ల మేర లబ్ధి పొందాయని పేర్కొంది. ఇది కాక ట్రైడెంట్‌కు అరబిందో భూమిని బదలాయించటం వల్ల ప్రభుత్వానికి రూ.4.3 కోట్ల మేర నష్టం జరిగినట్లు పేర్కొంది. ఈ లెక్కన మొత్తం రూ.21.5 కోట్లన్నమాట. అంటే రూ.21.5 కోట్లు లబ్ధి పొందినందుకు రూ.29.5 కోట్లు పెట్టుబడి పెట్టారన్న మాట. అసలు సీబీఐ వాదనగానీ, ఈడీ వాదనగానీ ఏ కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా? ఈడీ చార్జిషీట్లోని అంశాలు అంతకుముందు సీబీఐ వేసిన తొలి చార్జిషీట్లోను... దాన్లోని అంశాలు ఎఫ్‌ఐఆర్‌లోను... దాన్లోని విషయాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం నేతలు కలిసి వేసిన పిటిషన్లోను యథాతథంగా ఉన్నాయంటే ఏమనుకోవాలి? ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారనుకోవాలి? దర్యాప్తు సంస్థలు ఎవరు చెప్పినట్లు ఆడుతున్నాయో తెలియటం లేదా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!