YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 6 October 2012

‘అల్లుడి’ ఆస్తులపై విచారణ చేపట్టాల్సిందే! :సురవరం

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వధేరాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఒక స్వతంత్య్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. అతి స్వల్ప కాలంలో వధేరా వందల కోట్ల విలువ చేసే అస్తులను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సాయంతో సంపాదించుకున్నారని వచ్చిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోవలసిన అవసరం ఉందని విలేఖరులకు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయటానికి వామపక్షాలు దేశ వ్యాప్తంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 18న జరిగే వామపక్షాల సమావేశంలో కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపం ఇవ్వటం జరుగుతుందని సురవరం చెప్పారు. సారూప్య భావాలున్న ఇతర పార్టీలను కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలోకి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల విదేశీ సంస్థలు విపరీతంగా లాభ పడతాయని ఆయన చెప్పారు. ఈ సంస్థలు పట్టణ ప్రాంతాలపైనే దృష్టిని కేంద్రీకరించి చేతికి వచ్చినంత దండుకుపోతాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం గణనీయమైన సేవలు అందిస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న జీవిత బీమా సంస్థను దెబ్బతీయటానికే ప్రభుత్వం విదేశీ సంస్థలను ఆహ్వానిస్తోందని ఆయన విమర్శించారు.
ప్రధానికి ఎర్రంనాయుడు లేఖ
రాబర్ట్ వధేరాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రం నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సోనియా విస్మరించటం విడ్డూరంగా ఉందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో తెలియచేశారు. తన అల్లుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు స్పష్టమైన జవాబు ఇవ్వకుండా మంత్రులను, అధికార ప్రతినిధులను రంగంలోకి దించి ఆరోపణలను తిప్పికొట్టేందుకు సోనియా ప్రయత్నించటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతున్న యుపిఏ ప్రభుత్వంపై ప్రజలకు కొంతలో కొంత నమ్మకం కలిగేందుకు ప్రధాని వెంటనే నిస్పక్షపాతమైన విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాధారాలతో బయటపెట్టిన వధేరా అవినీతిపై ప్రధాని తగిన రీతిలో స్పందించగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అరవింద్ ఆరోపణలను సమర్థించిన హజారే
రాలేగావ్ సిద్ధి: రాబర్ట్ వధేరాపై అరవింద్ కేజ్రివాల్ చేసిన ఆరోపణలను సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే గట్టిగా సమర్థిస్తూ, ఈ ఆరోపణలు గనుక తప్పని కాంగ్రెస్ భావిస్తే న్యాయ విచారణకు ఆ పార్టీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇవి నిరాధారమైనవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిరాధారమైనవయితే న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించకూడదు. ఒకవేళ ఇవి తప్పుడు ఆరోపణలయితే కేజ్రివాల్‌పై పరువు నష్టం దావా వేయవచ్చు. అలాచేస్తే నిజమేంటో బయటికి వస్తుంది’ అని అన్నా హజారే అన్నారు. తాము ఇంతకుముందు 15 మంది ‘అవినీతి’ మంత్రులపై ఆరోపణలు లేవనెత్తినప్పుడు వాటిలో పస లేదని ప్రభుత్వం చెప్పింది. అయితే వారిలో ఇద్దరు మంత్రులు బైటికి వచ్చారు. ఇప్పుడు బొగ్గు కుంభకోణం బైటపడింది. మొత్తం దేశం దాన్ని చూసిందని కూడా కేజ్రివాల్ అన్నారు.

http://andhrabhoomi.net/content/demands-enquiry

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!