పైసా పెట్టుబడి లేకుండా 300 కోట్ల రూపాయలు సంపాదించగలమా? లేదు అనేది మీ సమాధానమైతె మీరు సత్తెకాలపు సత్తయ్య కిందే లెక్క. ‘పవర్’ ఉండాలేగానీ చెట్లకు డబ్బు కాయించడం కష్టమేమీ కాదడనానికి నిలువుటద్దంగా నిలుస్తున్న కాలమిది. తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారు పెద్దోళ్లు. మనోడు ఒక్కడు అధికారంలో ఉంటే చాలు అందినకాడికి దోచుకో అంటున్నారు ఆధునిక నేతాశ్రీలు, వారి పరివారం. చిన్న బుద్ధులతో తరతరాలకు సరిపడా సంపాదించినా సంతృప్తి అనేది వారి డిక్షనరీల్లో ఉండదు. భజనపరులతో భుజకీర్తులు తొడిగించుకున్న తామేంచేసినా చెల్లుతుందనే అహంకారంతో అంతుపొంతు లేకుండా ఆర్జన దిగడం ఆధునిక పాలి’ట్రిక్స్’తో అబ్బిన విద్య.
క్విక్ ప్రో కో కాలంలో పైసా పెట్టుబడి పెట్టకుండా కోట్లకు పడగలెత్తడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ అధిష్టానమ్మ అల్లుడిని చూస్తే అర్థమవుతుంది. సారూ.. కానీ పెట్టకుండా వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆర్జించేశారు. ఇదంతా అక్రమ సంపాదనంటూ అరవింద్ కేజ్రీవాల్ లాంటి కిట్టనివాళ్లు ఆడిపోసుకుంటున్నారు. మెచ్చుకోలు తెలియని ప్రశాంత్ భూషణ్ కూడా పాపం ‘అల్లుడుగారిని’ అనుమానిస్తున్నారు. పైసా పెట్టకుండా వందల కోట్ల ఆస్తులు జమ చేసిన అల్లుడిని ఆకాశానికెత్తడం పోయి ఆరోపణలు చేయడం ఎంత దారుణం. కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా సొంతంగా చేసుకున్న ‘సన్-ఇన్-లా’పై సందేహాలు కడు శోచనీయం.
వడ్డీ లేని రుణం తెచ్చిన అల్లుడుగారిని మెచ్చుకుని ఆర్థిక మంత్రి పదవి ఇవ్వకుండా బదనాం చేయడం భావ్యమేనా? పూచీకత్తు లేకుండా రుణం తీసుకున్న ఆయనగారి తెలివితేటల గురించి ముందే తెలుసుకునేంటే దేశ జనాభా తలపై రుణం సగానికి సగం తగ్గేది. ఆలస్యంగానైనా ‘వాద్రా’ వారి ‘వాల్యూ’ను గుర్తించి బహిర్గతం చేసినందుకు కేజ్రీవాల్‌ను అభినందించాల్సిందే. కాకపోతే అల్లుడిగారిపై ఆయన ఒంటికాలిపై లేవడమే బాలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాకుండా దర్యాప్తు చేయమనం ఇంకా దారుణం. అల్లుడు తన సొంత తెలివితేటలతో నాలుగురాళ్లు వెనకేసుకుంటే చూడ లేకపోతే మానేయ్యాలి గానీ, ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తాడా? దేవత లాంటి అత్తమ్మ ప్రతిష్ఠకు ఆటంకం కలిగేలా ఎలుగెత్తుతాడా? ఎంత ధైర్యం? ప్రతిభను మెచ్చుకోకపోయినా కనీసం గౌరవించడం అయినా నే ర్చుకోవాలి. అంతేగాని మీడియాకెక్కి గొంతు చించుకుంటారా? పెపైచ్చు ప్రజలు గళం విప్పాలని ఉసిగొల్పడం ఎంత విడ్డూరం.
అధిష్టానమ్మకు అల్లుడైనంత మాత్రాన ‘బిగినెస్సు’ చేసుకోకూడదా? ఆస్తులు వెనకేసుకోకుడదా? ఇదెక్కడి గొడవండీ. నిర్మాణ రంగంలో తన ‘సత్తా’ చూపి స్వల్పకాలంలోనే కాసుల పంట పండించుకుంటే ఏడుపు ఎందుకంట. డీ ఎల్‌ఎఫ్‌తో ‘క్విక్’గా ఎదిగితే కుళ్లుకుంటున్నారు. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. పోసుకుంటే పాయేగానీ పబ్లిగ్గా పొగ పెడుతున్నారు. ప్రశ్నించే ధైర్యం లేదా అంటూ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు. నిలదీయడంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారు. హవ్వ! అంత అప్రదిష్ట. అల్లుడిని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి బజారు కీడుస్తారా? ఎంత తప్పు. బరి‘తెగింపు’. పండిన చెట్లకే దెబ్బలన్నట్టుగా ‘క్విక్’గా సంపాదించిన అల్లుడికే కష్టాలెందుకో? ఇలాంటి క్లిష్ట సమయంలో అల్లుడిగారికి కాంగీయులేకాకుండా అన్ని పార్టీల వారు అండ అందించి 'రాజనీతి' రుజువు చేసుకోవాలి.
No comments:
Post a Comment