వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్రంలో జనాదరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపిస్తున విశేష ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పలు కుయుక్తులను పన్నుతుండడం కొంత కాలంగా ఈ వేధింపుల్లో సాగుతున్న భాగమే. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిశారు. ఈడీ వెంటనే చర్యలు తీసుకోవాలని చిదంబరంపై టీడీపీ ఎంపీలు ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం. చిదంబరంతో సమావేశం జరిగిన రెండుగంటల తర్వాత క్విడ్ ప్రో కో కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ గురువారం ఈడీ నోటీసు ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసును, ఎమ్మార్ కేసును సీబీఐ ఒకే సమయంలో విచారిస్తోంది. కానీ, చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం, ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడం వంటి పరిణామాలు సీబీఐపై ఉన్న అనుమానాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఐఎంజీ కేసులో చంద్రబాబును ఇప్పటివరకూ ప్రశ్నించడానికి కూడా ప్రయత్నించలేక పోవడం కూడా ఇందుకు తోడవుతోంది. అంతేకాక అశేష ప్రజాభిమానంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ముప్పుగా మారిన జగన్ ను రాజకీయంగా అణిచివేయడానికే సీబీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సాధారణ ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమౌతోంది. సుప్రీం కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనుకున్న సమయంలో న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికి 'నోటీసుల' రూపంలో ఈడీ ప్రయత్నం చేస్తోందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు క్విడ్ ప్రో కో కేసులో రూ.51 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ప్రకటన చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఈడీ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, ఇది కుట్రలో భాగమే అని అన్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ సోదరి షర్మిళ, జగన్ భార్య భారతి, ఇతర కుటుంబీకులతో కలిసి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్ క్షేమంకోసం, విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులంతా ప్రార్థనలు చేస్తున్నారని విజయమ్మ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ ఈడీ ప్రకటన ఇవ్వడం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు కావడమేనన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చిదంబరంను కలిసి ఆస్తులను అటాచ్ చేయమని అడిగిన వెంటనే ఈడీ ప్రకటన రావడం వెనుక కుట్ర దాగుందన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో తెలెత్తుతున్నాయన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ అనుబంద చార్జిషీట్ లు వేస్తోందని, గత 14 నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోయిందన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీబీఐ న్యాయవాదిని తామే మార్చామనే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించిన విచారణ ఏమైందో ఇప్పటికి తెలియలేదన్నారు. సీబీఐ, ఈడీ బెదిరింపులకు తాము భయపడడటం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చామని విజయమ్మ అన్నారు. క్విడ్ ప్రో కో కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఇచ్చిన నోటీసు అర్థంలేనిదని వైఎస్ జగన్ సోదరి షర్మిళ కొట్టిపారేశారు.. ఈడీ నోటీసులో హెటిరో, అరబిందో కంపెనీలు అక్రమంగా రూ.22 కోట్లు లబ్ధిపొందాయని పేర్కొన్నారని, అందుకు ప్రతిఫలంగానే వైఎస్ జగన్ కంపెనీల్లో రూ.29 కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్పారని...22 కోట్ల రూపాయలు లబ్ది పొందితే... 29 కోట్లు పెట్టుబడి ఎలా పెడతారని.. సాధారణ వ్యక్తికైనా ఇది అర్థమవుతుందని.. ఆస్తుల అటాచ్ మెంట్ ఎంత అర్థం లేనిదో దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని షర్మిల అన్నారు. ఈ కేసులో సీబీఐ తనకు తానుగా లాయర్లను మార్చుకుంటే... దానిపై కూడా రాద్ధాంతం చేశారని.. గత విచారణ సమయంలో న్యాయవాదులు సన్నద్ధంగా లేరని సీబీఐ వాయిదా కోరిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. జగన్ విడుదల కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారని.. శుక్రవారం కేసు విచారణకు వస్తున్న సమయంలో ఈడీ నోటీసులు అనేక సందేహాలను లేవనెత్తాయని అభిప్రాయపడ్డారు. జననేత జగన్ కు ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని గత ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ కు న్యాయవ్యవస్థ లొంగదనే భావిస్తున్నామని.. దేవుడిపై తమకు నమ్మకం ఉందని చెబుతూ ప్రజలు తమ పక్షంగా ఉన్నంత సేపు ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రయోజనం శూన్యమని షర్మిల అన్నారు. | |
source: sakshi
|
No comments:
Post a Comment