YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 1 October 2012

సినిమా డైరెక్షన్ అవసరమా..!

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి స్పందించే గుణముండాలి
ఏం గుర్తు చేయాలని పాదయాత్ర చేస్తున్నారు?
మీ పాలనను చెప్పి భయపెట్టదల్చుకున్నారా?
మీ యాత్రతో కరువొస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మనసున్న నాయకునికి సహజంగా స్పందించే గుణం ఉంటుందని, ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్న తపన ఉన్న నాయకుడెవరూ సినిమా దర్శకులతో పాఠాలు చెప్పించుకోరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సోమవారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్న నాయకునికి సినిమా వారి డెరైక్షన్ అవసరమా? సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి ప్రజలను ఏవిధంగా కలుసుకోవాలి? వారి భుజాల మీద ఎలా చేతులు వేయాలి? వారిని ఎలా దగ్గరకు తీసుకోవాలి? రెండు వేళ్లు చూపి బెదిరిస్తున్నట్లుగా మాట్లాడకూడదు... వంటి అంశాలపై సినిమా డెరైక్టర్ల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా?’’ అని విస్మయం వ్యక్తం చేశారు. ‘వస్తున్నా... మీకోసం..’ అనే పేరుసైతం ప్రజలను బెదిరిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు పాదయాత్రపై ప్రజలకు అనేక సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయని, వాటన్నింటినీ ఆయన నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. 

టీడీపీ ఔట్‌డేటెడ్: తెలుగుదేశం పార్టీ ఒక కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేటెడ్) ఔషధం లాంటిదని, అందుకే ప్రజలు పలుమార్లు తిరస్కరించారని వారు అభివర్ణించారు. అదే రిజెక్ట్ చేసిన ప్రాడక్ట్ (టీడీపీ)ని అదే పాత సేల్స్‌మెన్ (బాబు) మార్కెటింగ్ చేసుకోవడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు వర్షానికి పేటెంట్‌గా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, కరువుకు పేటెంట్‌గా చంద్రబాబును చెప్పుకుంటారనీ... ఇపుడు బాబు పాదయాత్ర చేస్తే కరువు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కేటాయించినపుడు... ఫ్యాన్‌కు కాలం చెల్లిందనీ, ఇపుడందరూ ఏసీలు వాడుతున్నారని బాబు వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. 

ప్రతి ఇంటిలోనూ ఫ్యాన్, ప్రతి గుండెలో వైఎస్సార్ కొలువు తీరి ఉన్నారన్న విషయం పాదయాత్రలో బాబుకు తెలిసొస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్ని అక్రమంగా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని జైలుకు పంపిన చంద్రబాబు ప్రతిదానికీ ఆయననే విమర్శిస్తూ కాలం గడుపుతున్నారని చెప్పారు. బాబుకు దమ్ముంటే తనపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన బలంతో కాపాడుతూ, అదే పార్టీని విమర్శిస్తూ బాబు ప్రజల్లోకి ఎలా వెళతారని నిలదీశారు. మహాలయ పక్షంలో ప్రారంభిస్తున్న పాదయాత్ర బాబుకు ఏ మాత్రం కలిసి రాదని అమరనాథరెడ్డి చెప్పారు. మంగళవారం, మహాలయ పక్షంలో పాదయాత్ర చేస్తే దేవతలు ఆశీర్వదించరని, క్షుద్ర దేవతలు ఆశీర్వదిస్తారని విమర్శించారు. ప్రశాంతంగా తెలంగాణ మార్చ్ చేసుకుంటున్న వారిని ఇబ్బందులు పెట్టడం సరైన చర్య కాదని, ఇది అక్షరాలా ప్రభుత్వ వైఫల్యమేనని శోభ చెప్పారు. 

చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ప్రశ్నాస్త్రాలు...

తన తొమ్మిదేళ్ల పాలనను గుర్తు చేయడానికి ప్రజల వద్దకు వెళుతున్నానని చెబుతున్న బాబు పాదయాత్రలో ఏం చెప్పబోతున్నారని శోభానాగిరెడ్డి, అమరనాథరెడ్డి ప్రశ్నించారు. బాబుపై వారు సంధించిన ప్రశ్నాస్త్రాలివీ...

ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించినపుడు... అది సాధ్యంకాదని, కరెంటు తీగలపై బట్టలారేసుకోవడానికి తప్ప దేనికీ పనికి రావని ఎగతాళి చేసిన విషయం ప్రజలకు గుర్తు చేస్తారా? 

ఒక హెచ్‌పీ మోటారుకు రూ.50 వసూలు చేయాలని ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి రైతులను వేధించిన విషయం గుర్తు చేస్తారా? 

మీ పాలనలో ఏటా కరెంటు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తారా? బిల్లులు కట్టలేని రైతులను అరెస్టు చేసి బేడీలు వేసిందీ గుర్తు చేస్తారా? 

చార్జీలు పెరిగినందుకు నిరసనగా బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న విషయాన్ని చెబుతారా?

ఈ ఉద్యమంలో గాయపడిన పోలీసులను పరామర్శించి... క్షతగాత్రులు, మృతిచెందిన వారి కుటుంబాలను పట్టించుకోని విషయాన్ని వివరిస్తారా.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వని విషయాన్నీ గుర్తు చేస్తారా? 

ప్రతిపక్షంలో కూర్చోడానికైనా సిద్ధం... కానీ ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ సంఘాన్ని నియమించే ప్రసక్తే లేదని మళ్లీ వారికి గుర్తు చేయడానికే పాదయాత్రకు వెళుతున్నారా? 

ప్రపంచబ్యాంకు విధానాల అమలుకు కంకణం కట్టుకున్న వ్యక్తిగా చెప్పుకుంటారా? 


ఎన్టీఆర్ తన తొలి సంతకంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం ధరను 2 నుంచి 5 రూపాయలకు పెంచానని పేదలకు గుర్తు చేస్తారా? 

ప్రపంచంలో ఏ ఇజమూ లేదు, టూరిజం తప్ప అని కమ్యూనిస్టులను తూర్పారబట్టి అధికారం పోయాక మళ్లీ వారితో కలిసేందుకు తహతహలాడుతున్నానని చెబుతారా?

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!