క్విడ్ ప్రో కో కేసులో రూ.51కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ప్రకటన చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఈడీ ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో ఆయన క్షేమంకోసం ప్రపంచంలో వైఎస్ఆర్ అభిమానులంతా ప్రార్థనలు చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ ఈడీ ప్రకటన ఇచ్చిందన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చిదంబరంను కలిసి ఆస్తులను అటాచ్ చేయమని అడిగిన వెంటనే ఈడీ ప్రకటన రావడం వెనుక కుట్ర దాగుందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రేపు జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సమయంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయని తెలిపారు. చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు చిదంబరంకు అందజేసిన వెంటనే ఈడీ ప్రకటన వచ్చిందని అన్నారు. కోర్టును ప్రభావితం చేసేలా ఈడీ ప్రకటన ఉందన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ అనుబంద చార్జిషీట్ లు వేస్తోందని గుర్తు చేశారు. 14 నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోయిందన్నారు. జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయవాదిని తామే మార్చామనే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వివాదస్పద 26 జీవోలకు సంబంధించిన విచారణ ఏమైందో తెలియలేదన్నారు. తాము భయపడడం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చామని విజయమ్మ చెప్పారు.
No comments:
Post a Comment