YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 25 June 2012

వైఎస్‌ఆర్ సిపి మద్దతు కోరిన సంగ్మా

రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థి పి.ఏ.సంగ్మా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని తనకు మద్దతు నివ్వాలని కోరారు. విజయమ్మతో కొద్ది సేపు ఆయన సమావేశమయ్యారు. పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డితో సహా పలువురు నేతలు ఈ సమావేశంలో ఉన్నారు. తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయాన్ని తెలియ జేస్తామని విజయమ్మ ఆయనకు చెప్పినట్లు సమాచారం.

అనంతరం సంగ్మా విలేకరులతో మాట్లాడారు. విజయమ్మ, ఇతర పార్టీ నాయకులతో తాను జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని చెప్పారు. వారు తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. వారు చూపిన ఆదరణకు తాను కృతజ్ఞుడనని తెలిపారు. ఇటీవల పలు శాసనసభ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వమైన విజయం సాధించినందుకు విజయమ్మకు అభినందనలు తెలిపానని సంగ్మా చెప్పారు. 21 ఏళ్లుగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని, ఆయన తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.

జైలులో ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడానికి వారం రోజుల కిందటే తాను అధికారులను అడిగి అపాయింట్‌మెంట్ తీసుకున్నానని తెలిపారు. వారు తనను ఉదయం 9, 9.30 గంటల మధ్య రావాలని కోరారని ఆయన వివరించారు. తాను 10.15 గంటలకు అక్కడకు వెళ్లగా ఒక జూనియర్ జైలు అధికారి బయటకు వచ్చి జైలర్ ఇంకా రాలేదని సమాధానం ఇచ్చారని తెలిపారు. 11 నుంచి 12 గంటల మధ్య వస్తే బాగుంటుందని చెప్పారన్నారు. సరేనని తాను మళ్లీ వారు చెప్పిన సమయానికి వెళ్లగా, అపాయింట్‌మెంట్ రద్దు అయిందని చెప్పారన్నారు. తమది రాజకీయ కలయిక కనుక జగన్‌ను కలవడానికి అనుమతించబోమని కూడా ఆయన చెప్పారని సంగ్మా తెలిపారు. కొద్ది రోజుల క్రితం మజ్లిస్ ఎం.పి అసదుద్దీన్ ఒవైసీ ఇదే జైలులో జగన్‌ను కలుసుకుని ప్రణబ్ ముఖర్జీకి మద్దతు నివ్వాల్సిందిగా కోరారు. ఆయన జగన్ వద్దకు వెళ్లినపుడు తనను ఎందుకు వెళ్లనీయరని సంగ్మా ప్రశ్నించారు. ఒవైసీ మాత్రమే భారతీయ పౌరుడా? తాను కాదా? అని ఆయన ప్రశ్నించారు. తాను 31 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారు తనను కలవనీయవద్దని జైలర్‌కు ఆదేశాలిచ్చి ఉండొచ్చని సంగ్మా అన్నారు. తాను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడును కలిసేందుకు వచ్చాననీ వారిద్దరూ నగరంలో లేనందువల్ల సాధ్యం కాలేదనీ ఆయన అన్నారు. కేసీఆర్ కుమార్తెను తాను కలుసుకున్నానని వివరించారు. 

అధికారదుర్వినియోగానికి పరాకాష్ట : మైసూరా

జగన్‌ను జైలులో సంగ్మాను కలవడానికి అనుమతించక పోవడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సంగ్మాతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అనీ ఆయనను కలవడానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. జగన్ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కాదు, ఆయనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే! అంత మాత్రాన దోషి అయినట్లూ ఖైదీ మాదిరిగా జైలు మ్యాన్యువల్‌ను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం తప్పు అని ఆయన అన్నారు. రిమోట్ కంట్రోల్‌లో వ్యవహారాలు ఎలా నడుపుతున్నారో ఇదొక నిదర్శనం అని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఈ కేసుల దర్యాప్తులో రిమోట్ కంట్రోల్ ద్వారా జోక్యం చేసుకుంటున్నారనడానికి ఇది మరో నిదర్శనం అన్నారు. ప్రభుత్వాలు పూర్తి వివక్షతతో ఉన్నాయనీ ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సంగ్మా విజ్ఞప్తి చేశారని, తమ పార్టీలో చర్చించి త్వరగా నిర్ణయం వెల్లడిస్తామని చెప్పామని మైసూరా వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!