YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 2 July 2012

సోదాల నుంచి అరెస్టు దాకా సీబీఐది విపరీత ధోరణే



* కంపెనీలు, ఇన్వెస్టర్లు, వ్యక్తుల ప్రయోజనాలు ఏమాత్రం పట్టని తీరు
* ఎఫ్‌ఐఆర్‌లోని అంశాల్నే ముక్కలు చేస్తూ వరుస చార్జిషీట్లు
* గుజరాత్ పెట్రోల్ బంకుల కేసులోనూ పలు చార్జిషీట్లు వేశామంటూ జేడీ పొంతన లేని సమాధానం
* ఎన్నికల సమయంలో... కోర్టులో హాజరు కాబోయే ముందు జగన్ అరెస్టు
* సమర్థించుకోవటానికీ అవకాశం లేని రీతిలో సాగుతున్న దర్యాప్తు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
నిజం చెప్పాలంటే దేశంలో ఇప్పటిదాకా ఏ కేసులోనూ సీబీఐ ఇంత దారుణంగా వ్యవహరించలేదు. ఇంతటి అసాధారణ చర్యలకు దిగలేదు. బోఫోర్స్ నుంచి 2జీ, కామన్వెల్త్, సత్యం కంప్యూటర్స్, దాణా స్కాం... ఇలా ఏ వ్యవహారంలోనైనా దర్యాప్తు సంస్థ కొన్ని నిబంధనలకు లోబడి, కొన్ని పద్ధతుల ప్రకారం దర్యాప్తు సాగించింది. కానీ, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి మాత్రం ఆదినుంచీ దర్యాప్తు సంస్థ తీరు అసాధారణంగానే కనిపిస్తోంది. దీన్లో రాజకీయ దురుద్దేశాలు ఇమిడి ఉన్నాయని ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పునిచ్చిన సమయంలో హైకోర్టే స్పష్టం చేసింది. అయినా సరే విసృ్తత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దర్యాప్తునకు ఆదే శిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

మరి రాజకీయ దురుద్దేశాలు, ప్రత్యర్థుల రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న కేసులో సీబీఐ కనీస జాగ్రత్తలు పాటిం చాలి కదా? వ్యాపార సంస్థలు, వాటి ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి కదా? అవేమీ లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రయోజనాలు మరింత దెబ్బతీసేలా అసాధారణ రీతిలో ఎందుకు వ్యవహరిస్తోంది? ఆదినుంచీ ఎవరో తనను ఎగదోస్తున్నట్లుగా నిబంధనలన్నిటినీ గాలికొదిలేసి ఎందుకిలా అసాధారణ రీతిలో వ్యవహరించింది? ఇప్పటికీ అదే తీరును ఎందుకు కొనసాగిస్తోంది?

దేశవ్యాప్త సోదాలతో దాడి మొదలు..
శంకర్రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత 24 గంటలు కూడా తిరక్కముందే సీబీఐ పూర్తిస్థాయిలో సోదాలకు దిగింది. రాష్ట్రంలో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటంతోపాటు రాష్ట్రం వెలుపల ఇతర ప్రాంతాల్లో దాడుల కోసం 30 ప్రత్యేక బృందాల్ని వినియోగించింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇల్లు, కంపెనీలు, జగతిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల ఇళ్లు, సంస్థలపై ఏకకాలంలో సోదాలు జరిపింది. ఏదో జరిగిపోతోందన్న రీతిలో ఒకరకమైన భయోత్పాతాన్ని సృష్టించింది. సీబీఐ సోదాలు జరిపిన వాటిలో కొన్ని లిస్టెడ్ కంపెనీలూ ఉన్నాయి. వాటి షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి.

ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయినా సీబీఐకి పట్టలేదు. ప్రముఖులు ఇమిడి ఉన్న 2జీ స్కామ్‌లోగానీ, లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం చూపే సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలోగానీ, రాజకీయుల ప్రమేయం ఉన్న బోఫోర్స్‌లోగానీ ఎన్నడూ సీబీఐ ఇలా వ్యవహరించలేదు. కనీసం ఈ సోదాల స్థాయిలో పదోవంతు కూడా చేయలేదు. పైగా, ఈ సోదాలతో ఊరుకోకుండా ఆయా కంపెనీల ప్రతినిధుల్ని రోజువారీ ప్రాతిపదికన పిలిచి గంటలకు గంటలు విచారించటం గమనార్హం.

లీకులతో భయంకర దుష్ర్పచారం..
ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు మాత్రమే చేస్తుంది. దర్యాప్తు నివేదికను నేరుగా కోర్టుకు సమర్పిస్తుంది. సీబీఐ చేయాల్సింది కూడా అదే. కాకపోతే ఈ కేసులో మాత్రం దర్యాప్తులో ఏమీ తేలదనే భయం పట్టుకుందో ఏమో...! ఆది నుంచీ మీడియా లో ప్రచారానికే సీబీఐ అధిక ప్రాధాన్యమిచ్చింది. సీబీఐ ఏం చేస్తోందో, చేయబోతోందో, ఎవరిని విచారించబోతోందో... ఎవరు విచారణలో ఏం చెప్పారో అవన్నీ కోర్టుకన్నా ముందు ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి చెందిన మీడియాకు మాత్రమే తెలిశాయి. ఆ మీడియాకు అసలు ‘సాక్షి’ ఆవిర్భావమే గిట్టదాయె!! అంతే..! ‘సాక్షి’ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్న ఆ మీడియాకు సీబీఐ ఒక ఆయుధంలా చేతికి అందింది. సీబీఐ చేతిలో ఆ మీడియా కూడా ఆయుధంలా మారింది.

రెండు ఆయుధాలూ కలిసి ‘సాక్షి’పై విరుచుకుపడ్డాయి. సీబీఐ సౌజన్యంతో విషప్రచారం పతాక స్థాయికి చేరింది. ఆఖరికి జడ్జిల ఎదుట సాక్షులిచ్చిన వాంగ్మూలాలు.., దర్యాప్తు అధికారి ఎదురుగా సాక్షులు ముఖాముఖి ఇచ్చిన సాక్ష్యాలు సైతం ఆ వర్గానికి చెందిన మీడియా ప్రతినిధులు అక్కడే ఉన్నట్లుగా పూసగుచ్చినట్లు ప్రచురితమయ్యాయి. దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని సీబీఐ చెప్పటం.., దర్యాప్తులో అన్నీ తేలిపోయాయి ఇక శిక్ష వేయటమే తరువాయి అన్నట్లుగా ఆ మీడియా తప్పుడు రాతలతో చెలరేగిపోవటం.. అంతా ఒక డ్రామాలా సాగిపోతోంది. సీబీఐ వర్గాల్ని ఉటంకిస్తూ ఆ మీడియా ఎంత విషం కక్కుతున్నా, దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ దాన్ని ఖండించలేదు సరికదా... వాళ్లకు తనంతట తాను ఫోన్లు చేసి మరీ ఉప్పందించారు. దేశంలో ఎక్కడా లేని ఈ అసాధారణ తీరుకు కారణమేంటి?

చార్జి‘ఛీట్ల’తో సాగుతున్న దర్యాప్తు..
ఏ కేసులోనైనా నిందితుడిని అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీటు వేయాలి. కొన్ని కేసుల్లో ఇంకా తొందరగానే వేయాలని కూడా చట్టం చెబుతోంది. చార్జిషీటు దాఖలు చేసిన పక్షంలో నిందితుడికి బెయిలు లభించే ఆస్కారం ఎక్కువ. ఈ కేసులో సీబీఐ మార్చి 30న చార్జిషీటు వేసింది. కానీ... అంతటితో దర్యాప్తు అయిపోలేదంది. ఇంకా చార్జిషీట్లు వేస్తూనే ఉంటామంటూ... తర్వాత మరో రెండు చార్జిషీట్లు వేసింది. ఇంకా వేస్తూనే ఉంటామంటోంది. పైన పేర్కొన్న ఏ స్కాంలోనూ సీబీఐ ఇలా చేయలేదు. మరి ఈ కేసులో ఎందుకిలా? శంకర్రావు లేఖలోని అంశాల్నే ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సీబీఐ... దాన్లోని అంశాల్నే ముక్కలు ముక్కలు చేస్తూ వరస చార్జిషీట్లు వేస్తూ పోతోంది.

హైకోర్టు తన తీర్పులో.. ‘‘2004లో జగన్‌మోహన్‌రెడ్డి ఆదాయం రూ.11 లక్షలు. కానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించేనాటికి అది రూ.43 వేల కోట్లకు చేరింది’’ అంటూ శంకర్రావు ఆరోపణల్ని ప్రస్తావించింది. తర్వాత అదే అంశం మీడియా కథనాల్లో వెల్లువెత్తింది. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు రూ.43వేల కోట్లని మీడియా కథనాలు వెల్లువెత్తాయి. వారం రోజుల కిందట వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీబీఐ తరఫున వాదించిన న్యాయవాది... జగన్‌మోహన్‌రెడ్డి వల్ల ఖజానాకు రూ.43 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

‘‘43 వేల కోట్లు’’ అన్న సంఖ్య ఎన్ని రకాలుగా మారిందో చూశారా! దర్యాప్తు కూడా ఇలాగే ఉంది. అసలు అసాధారణమైన రీతిలో ఎందుకిన్ని చార్జిషీట్లు వేస్తున్నారని సీబీఐ జేడీని విలేకరులు అడిగితే... గతంలో గుజరాత్‌లో ఓ కేసులో ఇలాగే వేశారని ఆయన ఉదహరించారు. అక్కడ పెట్రోలు బంకుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, ఒక్కో పెట్రోలు బంకునూ ఒక్కో కేసుగా పరిగణించి చార్జిషీట్లు వేస్తే... దాన్ని ఈ కేసుతో పోల్చటం సరైనదేనా?

అరెస్టులోనూ ‘అతి’క్రమణ..
ఆగస్టులో దర్యాప్తు మొదలైంది. జనవరిలో ఈ కేసులో రెండో నిందితుడైన ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్టు చేశారు. మార్చిలో చార్జిషీటు వేశారు. ఏప్రిల్, మే నెలల్లో మరో రెండు చార్జిషీట్లు వేశారు. కాకుంటే ఈ మూడు చార్జిషీట్లు వేసేదాకా ఈ కేసులో తొలి నిందితుడైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కనీసం ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. అయితే ఈ ఏడాది జూన్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ప్రచారంలో బిజీగా ఉన్న జగన్‌ను మే 28న తన ఎదుట హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఆయన సరేనన్నారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగింది. తాము ప్రశ్నించాలి రమ్మంటూ నోటీసులిచ్చింది.

మే 25న... అంటే కోర్టుకు హాజరయ్యే మూడు రోజుల ముందు తమ ఎదుటకు రమ్మంది. ప్రచారంలో ఉన్నానని, ఎన్నికలదాకా సడలింపు ఇవ్వాలని కోరినా నిరాకరించింది. జగన్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. 25, 26, 27 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ... మరో కొద్ది గంటల్లో సీబీఐ కోర్టుకు హాజరవుతారనగా 27వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.

మూడురోజుల పాటు ఓపిగ్గా సమాధానాలిచ్చినా... ఆయన విచారణకు సహకరించలేదని, అందుకే అరెస్టు చేశామనే కారణం చెప్పింది. 9 నెలలుగా ఆయన బయట ఉన్నా పట్టించుకోని సీబీఐ... బయట ఉంటే సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తారు కాబట్టే అరెస్టు చేశామని చెప్పింది. ఆయన ఎంపీ కాబట్టి, ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆ హోదాలతో సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడయింది, ఎంపీగా ఎన్నికయింది అరెస్టు చేయటానికి కొద్దిరోజుల ముందో, కొన్ని గంటల ముందో కాదు కదా! మరి సీబీఐ ఎందుకు ఈ అసాధారణ చర్యకు దిగింది?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!