YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 2 July 2012

మీడియాతో జేడీ మాట్లాడాల్సిన అవసరమేంటి? సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం

 ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో జేడీ ఫోన్‌లో మాట్లాడారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదన
* ఇది సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని, అధికార దుర్వినియోగమని వెల్లడి
* జేడీ కాల్ లిస్ట్ సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంను ఆదేశించాలని వినతి... విచారణ 9కి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణకు మీడియా ప్రతినిధులతో మాట్లాడాల్సిన అవసరమేముందని.., దర్యాప్తు సంస్థ ప్రతినిధిగా ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని హైకోర్టు ప్రశ్నించింది. భవిష్యత్తులో మీడియా ప్రతినిధులతో మాట్లాడొద్దని జేడీకి సలహా ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కేశవరావును ధర్మాసనం ఆదేశించింది. తనుగానీ, తన సహచరులుగానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడలేదంటూ తప్పుడు ప్రకటన చేసి కోర్టును మోసం చేసిన లక్ష్మీనారాయణపై చర్య తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన భూషణ్ బి.భవనం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్రఘోష్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. 

సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వివరాలను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్‌ను ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు, ఇతర కేసుల్లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో జేడీ ఫోన్‌లో మాట్లాడారని, ఇది సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని తెలిపారు. మీడియాతో మాట్లాడలేదని సీబీఐ న్యాయవాదులు ఎప్పటికప్పుడు కోర్టుకు చెబుతున్నారని, మీడియాలో వచ్చే కథనాలకూ జేడీకీ ఎటువంటి సంబంధం లేదంటూ కోర్టులను తప్పుదోవ పట్టించారని వివరించారు. 

లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్లు ఆయన కాల్ లిస్టే స్పష్టంగా చెబుతోందని, ఇలా దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడటం సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని అన్నారు. మీడియాతో ఎప్పటికప్పుడు మాట్లాడటం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందన్నారు. సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జేడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 2011 జనవరి 1 నుంచి ఇప్పటివరకు జేడీ ఫోన్ నుంచి వెళ్లిన, ఆయన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వివరాలను సమర్పించేలా బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంను ఆదేశించాలని కోరారు. గతంలో ఇదే తరహా పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిందని, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని సీబీఐ తరపు న్యాయవాది కేశవరావు చెప్పారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. అసలు మీడియాతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారికి మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. దీనిపై సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని సీబీఐ తరపు న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేశారు. ఈ పిల్‌లో రామోజీరావు (ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్), రాధాకృష్ణ (ఆమోద పబ్లికేషన్స్), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎంలతోపాటు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!