YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

ఫ్యాన్‌ గాలి తుఫానైంది. కోస్తాలో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి కాగా, తెదేపా గల్లంతైంది (andhraprabha)

ఫ్యాన్‌ గాలి తుఫానైంది. కోస్తాలో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి కాగా, తెదేపా గల్లంతైంది. తుఫాను ప్రళయగాలి తెలంగాణనూ తాకింది. పరకాలలో తెరాస 'కొండా'ను ఢీకొట్టి ప్రమాదానికి గురైనా, బతికి బయటపడింది. 'సింహపురి సింహం' టీఎస్సార్‌ కూడా 'మేక'పాటి ధాటికి తట్టుకోలేక చిత్తగించడం విశేషం. జగన్‌ అరెస్ట్‌, విజయమ్మ కన్నీళ్లు తమ కొంప ముంచాయని కాంగ్రెస్‌ వాపోయింది. జగన్‌తో కుమ్మక్కై అరెస్ట్‌ పర్వం సృష్టించడం వల్లే జనం అవినీతిని పట్టించుకోలేదని తెదేపా ఘొల్లుమంది. అయినా 10 స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం పెద్ద ఊరటే. ఫలితాల నేపథ్యంలో ముంచుకొస్తున్న జగన్‌డం నుంచి ఎలా తప్పించుకోవాలా అని తెదేపా, కాంగ్రెస్‌లు మల్లగుల్లాలు పడుతున్నాయి. 


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి:అంతా ఊహించినట్లుగానే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 15, కాంగ్రెస్‌ రెండు, తెరాస ఒక శాసనసభ స్ధానాల్లో విజయం సాధించాయి. నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి 2.91 లక్షల అత్యధిక అధిక్యతతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఒక్క స్ధానాన్ని కూడా దక్కంచుకోలేక పోయింది. ఉప ఎన్నికలు జరిగిన స్ధానాలు తమవి కానప్పటికీ గట్టి పోటీనిచ్చి అత్యధిక స్ధానాల్లో రెండవ స్ధానంలో నిలబడగలిగామనే సంతృప్తిని వ్యక్తం చేసింది. పరకాల నియోజక వర్గంలో తెరాస వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధుల మధ్య చివరి వరకు హోరా హోరీగా సాగిన పోరులో తెరాస అభ్యర్ధి ఎం. భిక్షపతి 1562 ఓట్ల అత్యల్ప ఆధిక్యతతో గెలుపొందారు. రామచంద్రాపురం, నర్సాపురం స్ధానాలను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి నియోజక వర్గం ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులను ఒడ్డించినప్పటికీ 17,975 ఓట్ల ఆధిక్యతతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 13 కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్‌ నిర్వహించారు. తొలి రౌండ్‌ నుండే రాజంపేట, రాయదుర్గం, ప్రత్తిపాడు, అనంతపురం అర్బన్‌, పాయకరావుపేట, ఎమ్మిగనూరు, మాచర్ల, పోలవరం, రాయచోటి, ఆళ్లగడ్డ శాసనసభ నియోజక వర్గాలు, 


నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యతను కనబరుస్తూ విజయం దిశగా దూసుకుపోయింది. కాంగ్రెస్‌, తెదేపా, వైఎస్‌ఆర్‌సిపి, భాజపా, తెరాస, సిపిఎం, లోక్‌సత్తాతో పాటుగా పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే ప్రధానంగా పోటీ ఏర్పడింది. తెలంగాణలోని పరకాల నియోజక వర్గంలో మాత్రం వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కొండా సురేఖ తెరాస అభ్యర్ధి భిక్షపతిని ఢీ కొనవలసి వచ్చింది. చివరి వరకు హోరా హోరీగా పోరాడినప్పటీకీ విజయం తెరాసనే వరించింది. పార్టీ పెట్టిన 15 మాసాల వ్యవధిలోనే మూడవ సారి జరిగిన ఉప ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్ధానాలను కైవసం చేసుకొని సంబరాలు జరుపుకుంటోంది. విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిపితే అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ బలం 17కు చేరిందనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో ఆ పార్టీ బలం రెండుకు చేరింది. ఉప ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ప్రకటించారు. రామచంద్రాపురం నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తోటా త్రిమూర్తులు తన సమీప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పైన 11,919 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నర్సాపురం నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధి కొత్తపల్లి సుబ్బరాయుడు తన సమీప ప్రత్యర్ధి ఎం. ప్రసాదరాజు ( తెదేపా) పైన 4,464 ఆధిక్యతతో విజయం సాధించారు. పరకాల నియోజక వర్గం నుండి తెరాస అభ్యర్ధి ఎం. భిక్షపతి తన సమీప ప్రత్యర్ధి కొండా సురేఖ పైన ( వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) 1562 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి మేకపాటి రాజమోహరన్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి టి. సుబ్బరామిరెడ్డిపైన 2,91,745 లక్షల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. నర్సన్నపేటలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి ధర్మాన కృష్ణదాస్‌ 7312 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పాయకరావు పేటలో జి.బాబురావు (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) 14,362 ఓట్ల ఆధిక్యతను సాధించి సమీప తెదేపా అభ్యర్ధి చెంగల వెంకట్రావుపై విజయం సాధించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!