YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 June 2012

టీడీపీ ఔట్!

బాబు నేతృత్వంలో 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం
చంద్రబాబు నిర్వాకం వల్లే ఈ దుస్థితి: టీడీపీ సీనియర్లు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల కిందట ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సమీప భవిష్యత్తులో ఇక ఆ పార్టీ కోలుకునే పరిస్థితులు ఏమాత్రం లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1995 తర్వాత కాలం నుంచి ఆ పార్టీకి క్రమంగా తగ్గుతూ వస్తున్న ఓటు బలం.. మున్ముందు భవిష్యత్తు లేదని తేటతెల్లం చేస్తోంది. పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబునాయుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన 1995 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ప్రజల్లో బలం తగ్గుతోంది. 1999లో ఒకసారి పార్టీ అధికారంలోకి రావటం మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ బాబు నేతృత్వంలో టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూస్తోంది. తాజా ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 

ఎన్‌టీఆర్ స్థాపించిన టీడీపీ ఆయన నాయకత్వంలో ఉన్నంత వరకూ 1989లో మినహా విజయాలనే రుచిచూసింది. ఆయన పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకు జరిగిన ఎన్నికల్లో 46.3 శాతం ఓట్లను టీడీపీ తెచ్చుకుంది. 

1985 ఎన్నికల్లో టీడీపీకి 46.2 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత టీడీపీ అధికారాన్ని కోల్పోయిన సంవత్సరం 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా 36.8 శాతం, 1994లో 43.9 శాతం ఓట్లను సాధించింది. 

ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన తరువాత 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎదుర్కొన్న ఎన్నికల్లో 43.83 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. 

2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం 47 స్థానాల్లో మాత్రమే గెలిచిన టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని 37.59 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. 
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ 28.59 శాతం ఓట్లను సాధించింది (ఉప ఎన్నికలు జరిగిన నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన 16 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి 40 స్థానాల్లోని ఓట్లను లెక్కించటం జరిగింది). 

2009లో జరిగిన సాధారణఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 28.02 శాతం ఓట్లను మాత్రమే సాధించుకోగలిగింది. టీడీపీ ఏర్పడిన తరువాత సాధారణ ఎన్నికల్లో సాధించుకున్న అత్యల్ప ఓట్లు ఇవే. 

2004, 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 

2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (నెల్లూరు, కడప లోక్‌సభ స్థానాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి) ఉప ఎన్నికలు జరగ్గా.. ఆ పార్టీ పోటీ చేసిన 53 నియోజకవర్గాలకు గాను 26 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఒక్క స్థానంలోనూ గెలవలేదు. 

2010 జూలైలో తెలంగాణలోని 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్నిచోట్లా టీడీపీ డిపాజిట్ కోల్పోయింది. 

2011లో మరోసారి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభకు ఒక విడతగా, బాన్సువాడ అసెంబ్లీకి మరో విడతగా ఉపఎన్నికలు జరిగాయి. కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరుచోట్ల టీడీపీకి డిపాజిట్టు రాలేదు. 

2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు చోట్ల పోటీ చేసినప్పటికీ కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో టీడీపీ డిపాజిట్‌ను దక్కించుకోలేక చతికిలపడింది. 

2012 జూన్‌లో (తాజాగా) ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలవకపోగా.. ఐదు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆళ్లగడ్డ, రాజంపేట, రైల్వే కోడూరు, నర్సాపురం, రామచంద్రాపురం, (నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు పట్టణ, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా) డిపాజిట్ కోల్పోయింది. 
ఎన్‌టీఆర్ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఇటువంటి దయనీయమైన పరిస్థితి టీడీపీ ఎపుడూ ఎదుర్కోలేదు. వరుసగా 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఎనిమిదేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవటంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం లాభపడుతుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా కనిపించటం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో కూడా రెండు, మూడు స్థానాలకు పోటీ పడాల్సిన దుస్థితిలో టీడీపీ ఉంది. చంద్రబాబు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల వల్ల పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!