YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

ప్రజా జీవితంలో ఎదురులేని బాలినేని

 నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకునికి ఎదురులేదని స్పష్టమైంది. వలస నాయకులను ప్రజలు విశ్వసించరని రుజవైంది. ఢిల్లీ నాయకులు వచ్చి జనం లేని రోడ్‌షోలు చేసినా, ముఖ్యమంత్రి రెండుసార్లు పర్యటించినా, చిరంజీవితో చేతులూపించినా, చంద్రబాబు రెండు సార్లు వచ్చి రెండు ఏళ్లు చూపించినా అవన్నీ బాలినేని చరిష్మా ముందు దిగదుడుపేనని తేటతెల్లమైంది. పోటిచేసిన ప్రతిసారీ భారీ మెజార్టీతో గెలుస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగల రాజకీయ ఉద్దండుడు వాసు.

విద్యార్థి దశనుంచే రాజకీయ రంగప్రవేశం చేసిన బాలినేని.. సమకాలిన రాజకీయ నాయకునిగా.. రాజకీయ చతుర త.. చాణిక్యం ప్రదర్శించగల సమర్థుడుగా గుర్తింపు పొందారు. యువజన కాంగ్రెస్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాలినేని శ్రీనివాసరెడ్డి 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అభ్యర్థి యక్కల తులసీరావుపై పోటిచేసి 6222 ఓట్ల మెజార్టీ సాధించారు. అక్కడి నుంచి ఆయనకు నియోజకవర్గంలో ఎదురు లేదు. 2004లో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై 24,171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తదనంతరం 2009 ముక్కోణపు పోటీలో 22,986 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రకు జిల్లాలో మద్దతుగా నిలిచి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు. 

ఈనెల 12న జరిగిన ఒంగోలు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగి అత్యధికంగా 27,476 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ప్రత్యర్థులకు సవాల్ విసిరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రచారంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై బాలినేనిపై అసత్య ప్రచారం చేశాయి. వాన్‌పిక్ వ్యవహారంలో ఆయన ప్రజలకు మేలు చేస్తే దాన్ని మరోలా చిత్రీకరించాయి. ఏకంగా అధికార పార్టీ మంత్రి వాన్‌పిక్ భూముల్లో దుక్కిదున్ని రాజకీయ విత్తనాలు నాటాలని చూసినా ప్రజలు అవేవీ విశ్వసించలేదు.

ఎన్నికల ప్రారంభం నుంచే బాలినేని వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. వార్డుల వారీగా ఇన్‌చార్‌‌జ లను నియమించి వారి పర్యవేక్షణలో స్థానిక నాయకులు కార్యక్రమాలు చేసే విధంగా పథక రచన చేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించి వార్డుల వారీగా డబ్బులు వెదజల్లినా ప్రజలు మాత్రం మంచి మనిషికే పట్టం కట్టారు. బాలినేని నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా ఎలా గెలుస్తున్నారని విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవ్వుతూ మాట్లాడటం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం.. పేద, ధనిక భేదం లేకుండా అందరూ తనతో నేరుగా మాట్లాడే విధంగా అవకాశం కల్పించడం ఆయన విజయ రహస్యమని ఇతర పార్టీల నాయకులే పేర్కొంటున్నారు. ఆ మంచి తనమే బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రజా జీవితంలో ఎదురులేని నేతగా నిలిపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!