YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 June 2012

‘చిరు’ లాభమూ లేదు.. అంతా నష్టమే!

పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ బలమే తగ్గిపోయింది
2009 ఎన్నికల ఫలితాలతో పోల్చితే కాంగ్రెస్‌కుఇప్పుడొచ్చినవి సగం ఓట్లే!
18 స్థానాల్లో కాంగ్రెస్, పీఆర్పీల ఓట్లకు 10.12 లక్షల గండి
తేలిపోయిన చిరంజీవి బలం.. 
విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం శూన్యం
చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతిలోనూ బోర్లాపడ్డ కాంగ్రెస్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి ప్రయోజనం కలగకపోగా, పెద్ద నష్టమే జరిగిందని ఈ ఉప ఎన్నికల్లో తేలిపోయింది. కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని చిరంజీవి సినీ గ్లామర్‌తో గట్టెక్కించుకోవాలన్న ఢిల్లీ పెద్దల ఆశలు అడియాశలయ్యాయి. చిరంజీవి సత్తా ఏమిటో ఈ ఎన్నికలు తేల్చేశాయి. 

చిరంజీవిని అందలమెక్కించి రాజ్యసభకు పంపినా, కించిత్తు ఉపయోగం లేకపోయింది. పైగా, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తిరుపతి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ బోర్లాపడింది. 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, పీఆర్పీ విడివిడిగా పోటీ చేసి గెలుచుకున్న స్థానాల్లోనే ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగాయి. ఇటీవల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. అంటే.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ బలానికి పీఆర్పీ బలమూ తోడవ్వాలి. కానీ, ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే చాలా తక్కువ వచ్చాయి. పైగా, ఈ రెండు పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకులో 63 శాతం మేరకు పెద్ద గండే పడింది.

ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్, పీఆర్పీలకు చెందిన చిన్నాచితకా నేతలందరూ ఈ ఉప ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు. అయినప్పటికీ, అధికారంలో ఉండీ రెండు పార్టీల బలంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన ఆరు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మిగిలిన చోట్ల కూడా 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీ రెండింటికీ వచ్చిన ఓట్లకంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల సంఖ్య అతి తక్కువ. రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉండే మూడు ప్రధాన సామాజికవర్గాల ఓటర్లు ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ విలీనం ప్రభావం నామమాత్రంగా కూడా కనపడలేదు. 2009 ఎన్నికల్లో ప్రత్తిపాడులో కాంగ్రెస్‌కు 66,324 ఓట్లు, పీఆర్పీకి 33,889 ఓట్లు వచ్చాయి. 

అంటే.. అక్కడ రెండు పార్టీల బలం 1,00,213 ఓట్లు. కానీ, ఈ ఉప ఎన్నికల్లో పీఆర్పీ ఓట్లతో కలిపి కాంగ్రెస్‌కు వచ్చినవి 15,908 మాత్రమే. ఇదే సమయంలో.. గతంలో కాంగ్రెస్, పీఆర్పీల నుంచి గెలిచి, ఆ తరువాత బయటకు వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రం ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఒకటెండ్రు మినహా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గతంలో కాంగ్రెస్ లేదా పీఆర్పీ అభ్యర్థులుగా వారు తెచ్చుకున్న ఓట్లకన్నా 20 వేలకంటే ఎక్కువ తెచ్చుకోగలిగారు. గతంలో చిరంజీవి 15 వేల మెజార్టీతో గెలిచిన తిరుపతిలో ఇప్పుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరుణాకర్‌రెడ్డి 17 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున రామచంద్రపురం నుంచి పోటీ చేసి, ఇప్పుడు అదే స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈసారి 9 వేలకుపైగా ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగారు.

2009 ఎన్నికల్లో ఈ 18 స్థానాల్లో కాంగ్రెస్‌కు మొత్తం 10,74,870 ఓట్లు రాగా.. పీఆర్పీకి వచ్చినవి 5,38,042 ఓట్లు. ఈ స్థానాల్లో రెండు పార్టీల బలం 16,12,912 ఓట్లు. కానీ, ఈ రెండు పార్టీలు కలిసిపోయినా, ఈసారి వాటికి వచ్చిన ఓట్లు 6,00,441 మాత్రమే. అంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీలకు వచ్చిన ఓట్ల మొత్తంతో పోలిస్తే ఇప్పుడు 10,12,471 ఓట్లు తగ్గాయి. ఆ రెండు పార్టీల ఓట్లలో దాదాపు 63 శాతం ఓట్లకు ఈసారి గండిపడింది. 2009లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 55.8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. కాంగ్రెస్ ఓట్లలోనే దాదాపు 42 శాతం గండి పడింది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన వారికి మొత్తంగా 12,87,986 ఓట్లు రావడం గమనార్హం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!