YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 June 2012

సర్కారంతా అక్కడే...అయినా గెలిచింది రెండే

ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీని తేరుకోకుండా చేసింది. ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. ఏకంగా 10 చోట్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. అందులోనూ ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ భారీ తేడాతో పరాజయం పాలైంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా, స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతిలోనూ 18 వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది. 

ఇంతటి దారుణమైన ఫలితాలతో చావు దెబ్బతిన్న కాంగ్రెస్‌కు రామచంద్ర పురం, నరసాపురం నియోజకవర్గాల్లో గెలుపు కాసింత ఊరటను మిగిల్చాయి. అయితే ఆ రెండు చోట్లా గెలవటానికి కొన్ని ప్రత్యేక కారణాలే తప్ప కాంగ్రెస్ పట్ల సానుభూతి కాదని.. అదే పార్టీ నేతలు విశ్లేషించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఆరుగురు కేంద్ర మంత్రులు, 25 మంది రాష్ట్ర మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, స్టార్ క్యాంపెయినర్ చిరంజీవి.. వీరంతా కలిసి కాలికి బలపం కట్టుకున్నట్లుగా ఉప ఎన్నికల్లో ఊరూరా తిరిగి విస్తృతంగా ప్రచారం చేసినా.. ఫలితం లేకపోయింది. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరుడంటూ ఎంత దుష్ర్పచారం చేసినా.. చివరకు కీలకమైన ఎన్నికలకు ముందు కుట్ర పన్ని జగన్‌ను అరెస్టు చేయించి జైల్లో పెట్టినా.. ఓటరు మహాశయులు మాత్రం కాంగ్రెస్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించటం పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. 

సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో సర్వశక్తులు ఒడ్డినా, అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను వాడినా ఓటర్లను తమవైపు తిప్పుకోలేకపోయామని పార్టీ పెద్దలు వాపోతున్నారు. ముఖ్యంగా ఏడుచోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవటం వారిని తీవ్ర నైరాశ్యానికి గురిచేసింది. అందులోనూ పరకాల, అనంతపురం స్థానాల్లో పట్టుమని పదివేల ఓట్లు కూడా రాకపోవటంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అసమ్మతి కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీని ఎలా గట్టెక్కించాలో తెలియక సతమతమవుతున్న పెద్దలకు ఈ ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండేళ్లపాటు అధికారాన్ని కాపాడుకోవటమెలా? అనే అంశంపైనే చర్చసాగుతోంది. 

ఎమ్మెల్యేల్లో అంతర్మథనం: మరోవైపు ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అంతర్మథనం ప్రారంభమైంది. ఫలితాలను చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టడం అసాధ్యమనే భావనకు వస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు సమాధి కావటమూ తథ్యమనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!