YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

బస్సు ప్రమాదంపై సర్కారు నిర్లిప్తత

తెల్లవారుజామునే సమాచారం అందినా స్పందించని సర్కారు 
సకాలంలో వైద్యం అందించేందుకు కనీస ఏర్పాట్లు చేయని వైనం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందినవారు మృత్యువాత పడ్డారని తెలిసినా... సత్వర సహాయక చర్యలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలపాటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం గురించి శనివారం తెల్లవారుజాముకే రాష్ట్ర సర్కారుకు సమాచారం అందినా... టీవీ చానళ్లలో స్క్రోలింగులు వస్తున్నా... ఉదయం ఎనిమిది గంటలవరకూ ప్రభుత్వం స్పందించకపోవడంపై బస్సు ప్రమాదంలో మృత్యువాతపడినవారి బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సహాయక చర్యలు అందించడంలో రాష్ట్ర సర్కారుతోపాటు, మహారాష్ట్ర సర్కారు కూడా విఫలం కావడంవల్లనే మృతుల సంఖ్య పెరిగిందని రోదించారు. 

తెల్లవారుజామునే సమాచారం...

మహారాష్ట్ర ఉస్మానాబాద్ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని, రాష్ట్రానికి చెందిన అనేకమంది మరణించారని ఉదయాన్నే అందిన వార్తలతో రాష్ట్రమంతటా ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదం జరిగిన తర్వాత అర్ధగంటలో ఘటనా స్థలానికి చేరుకున్న ఉస్మానాబాద్ పోలీసులు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని, ఎక్కువమంది చనిపోయారని జిల్లా కలెక్టర్ తెల్లవారుఝామున నాలుగున్నర గంటల సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతో పాటు రెవెన్యూ కార్యదర్శి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. అదే సమాచారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలిపారు.ఉదయం ఐదు గంటలకే టీవీ ఛానళ్లలో ప్రమాదం వార్త ప్రసారమైంది. ప్రమాదానికి గురైనది హైదరాబాద్ నుంచి బయలుదేరిన కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు అని తెలియగానే ప్రయాణికుల కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అంతకు దాదాపు గంటముందే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందినా... బస్సు ప్రమాదంలో మృతిచెందిన, క్షతగాత్రులైన వారి కుటుంబాలకు తగిన సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో బంధువులు మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతజరిగినా... లక్డీకాపూల్‌లోని కాళేశ్వరి ట్రావెల్స్ కార్యాలయం ఉదయం తొమ్మిది గంటల దాకా తెరవలేదు. ప్రమాదఘటన విషయం తెలిసినా వారి బంధువులను ప్రమాదస్థలికి పంపించేందుకు అటు కాళేశ్వరి ట్రావెల్స్ యాజమాన్యంగానీ, ఇటు ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరకు మీడియాలో వ్యతిరేక కథనాలు రావడంతో ప్రభుత్వం మేల్కొని మధ్యాహ్నం 12 గంటలకు బస్సులు ఏర్పాటు చేసింది.

సత్వర సహాయంపై నిర్లక్ష్యం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉదయం 8 గంటల సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. అప్పటికే ప్రమాదం జరిగి ఐదున్నర గంటలైంది. తీవ్రంగా గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్ల ద్వారా ఇటు హైదరాబాద్ లేదా అటు ఔరంగాబాద్, పుణే వంటి వైద్య సదుపాయాలు ఉన్న నగరాలకు తరలించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య సదుపాయాలు అంతంతమాత్రం ఉన్న షోలాపూర్, ఉస్మానాబాద్ వంటి పట్టణాలకు తరలించారు. ఆస్పత్రులకు తరలిస్తుండగా కొందరు చనిపోయారు. సకాలంలో వైద్య సహాయం అందిఉంటే వారిలో కొందరైనా బతికి ఉండేవారనే వాదన విన్పిస్తోంది. తెల్లవారుజామునే ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ.. ఉదయం 11 గంటలకు గానీ సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేయలేదు. 

అధికారులపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: షిర్డీ బస్సు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల వివరాలు అందించకపోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణా శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం శనివారం సచివాలయంలో అత్యున్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సరైన వివరాలు చెప్పకపోవడంతో తక్షణమే ట్రావెల్ ఏజెన్సీ నుంచి వివరాలు తెలుసుకోవాలని, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్యం సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వారి వైద్యానిక య్యే వ్యయం మొత్తం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మృతదేహాలను నగరానికి తీసుకుని రావడానికి అవసరమైన అంబులెన్స్‌లను పంపించాలని సూచిం చారు. ప్రమాద స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి హెలికాప్టర్‌లో అక్కడకు వెళ్లాలని మంత్రి శ్రీధర్‌బాబును, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్‌ను ఆదేశించారు. దీనికి ముందు సీఎం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌తోనూ, ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారని, సహాయ చర్యలు అందించాలని కోరినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!