శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వంగర మండలం లక్ష్మీపేటలో దళితులపై జరిగిన మారణకాండను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులను వెంటనే శిక్షించాలని, మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 3 ఎకరాల భూమి, అర్హులకు రూ.5 వేల పింఛను, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆమె కుమార్తె షర్మిల, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుతో కలిసి లక్ష్మీపేటకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మద్దివలసలో ప్రజలనుద్దేశించి విజయమ్మ మాట్లాడా రు. ‘‘ఈ ఘటన గురించి తెలిసి జగన్ బాబు చాలా బాధపడ్డారు. బాధితులను పరామర్శించి రమ్మన్నారు. భూములు అడిగితే చంపుతారా? ఇదెక్కడి అన్యా యం? ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి అండగా ఉంటాం.
వారికే కాదు ప్రతి ఒక్కరికీ వైఎస్ కుటుంబం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మనది కాదు. ఈ ప్రభుత్వంలో పేదవాడికి సుఖమంటూ లేదు. ఎవరికీ సంతోషం లేదు. న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వా న్ని డిమాండ్ చేద్దాం. ప్రభుత్వానికి చలనం ఉంటుందా? అనే ది చూడాలి. దళితులపై దాడి చేసిన వారికి అండగా ఉండటమేంటి? బాధ్యులను శిక్షించాలి కదా! ఎవరు బాధ్యులో వారిపై మనం అడగక ముందే వేటు వేయాలి కదా? దీనిపై అసెంబ్లీలో కూడా మాట్లాడుతా. బాధ్యుల్ని శిక్షించమని డిమాండ్ చేస్తా’ అని అన్నా రు. దాడికి కారకులైన వారిని అరెస్టు చేసి, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు క్షతగాత్రులను ఆదుకోవాలని కోరా రు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దళితులకు లక్షల ఎకరాలు పంపిణీ చేశారనీ, ఆయన మరణానంతరం ప్రభుత్వం ఒక్క ఎకరా భూమిని కూడా పంపిణీ చేయలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ హయాంలో జరిగినట్లు భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నిద్రపోతోందా...
నటిస్తోందా: షర్మిల
‘‘ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక నిద్ర నటిస్తోందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘లక్ష్మీపేటలో నలుగురు దళితులను ఘోరం గా హతమార్చారు. 35 మంది గాయపడ్డారు. మారణకాండకు కారణమైన వాసుదేవరావునాయుడు నిర్దోషిలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆయన బొత్స గారి అనుచరుడట. కోండ్రు మురళి అండగా నిలుస్తున్నారట. పట్టుకున్న నాథుడే లేడట. ఎఫ్‌ఐఆర్‌లో 46వ నిందితుడిగా చేర్చారట. వాస్తవానికి ఒకటో ముద్దాయిగా చూపించాలి. మానవత్వం లేనివారు మనుషులేనా? ఇలాంటి ప్ర భుత్వం ఉండకూడదు. వైఎస్ హయాంలో ఇలాంటివి జరిగేవా!. ఈ ఘటన తెలిసి జగనన్న చాలా బాధ పడ్డారు. ఆయన బయటలేని కారణంగా మమ్మల్ని పంపిం చారు. మేమున్నామని ధైర్యం చెప్పడానికొచ్చాం. బాధితులకు అండగా ఉంటాం’’ అని అన్నారు.
మంత్రి బొత్సకు తొత్తువా కోండ్రూ : జూపూడి
‘మంత్రి కోండ్రు మురళీ... వైఎస్ దళిత వ్యతిరేకి అని అవాకులు, చవాకులు పేలావ్. కానీ నీ నియోజకవర్గంలో సాటి దళితులను ఊచకోత కోస్తే ఎందుకు కిమ్మనడం లేదు. దాడి చేయించిన వాసుదేవరావునాయుడ్ని ఎందుకు రక్షిస్తున్నావు? అతన్ని ఎందుకు అరెస్టు చేయించలేకపోయావ్? పీసీసీ అధ్యక్షుడు బొత్సకి భయపడేనా? సాటి దళితులు హతమైనా ఫర్వాలేదు గానీ బొత్సకు తొత్తు లా ఉండాలనుకుంటున్నావా’ అని ఎమ్మెల్సీ జూపూడి మంత్రి కోండ్రు మురళీమోహన్‌పై నిప్పులు చెరిగారు. మృతుల కుటుం బాలను పరామర్శించిన అనంతరం విజయ మ్మ, షర్మిల శ్రీకాకుళానికి వెళ్లి అక్కడ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామ ర్శించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, పలువురు నేతలు ఉన్నారు.
No comments:
Post a Comment