YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Monday, April 07, 2025

Friday, 15 June 2012

జనమే జయం!

సాగరాల్లోకి విసిరేసినా, తటాకాల్లో పడేసినా, గదలతో మోదినా, శూలాలతో పొడిచినా, విషసర్పాలతో కాటువేయించినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లోకి నెట్టేసినా, దూషించినా, శపించినా... ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా సజీవుడై తిరిగొస్తున్న ప్రహ్లాదుణ్ణి చూసి ‘...ఇన్ని చేసినా చావడిదేమి చిత్రమో!’ అని ఆశ్చర్యపోతాడు హిరణ్యకశిపుడు. మన రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారం కోసమని రోడ్డునపడిన ఇలాంటి హిరణ్యకశిపులు చాలామంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయాన్ని చూసి ఇలాగే ఆశ్చర్యపోతున్నారు. పుట్టి పదిహేను నెలలైనాకాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఈ ఆధునిక హిరణ్యకశిపులు పగబట్టారు. 

ఈ ఉప ఎన్నికల్లో దాన్ని ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. చాటుమాటు ఒప్పందాలు చేసుకున్నారు. పరస్పరం సహకరించుకున్నారు. డబ్బు వెదజల్లారు. మద్యం పారించారు. తమ చేతుల్లో ఉన్న ఖాకీ యంత్రాంగాన్ని రెండుచేతులా దుర్వినియోగంచేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అభాండాలు వేస్తూ ఊరూరా తిరిగారు. ఏంచేసినా ప్రజల్లో ఆయనకున్న ఆదరణను వీసమెత్తయినా ఆవిరిచేయలేక పోయామని గ్రహించి ఆయనను ఖైదుచేశారు. ఇన్ని చేసినా 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప ఎన్నికల స్థానాల్లో పార్టీకి ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. మూడుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు తక్కువ మార్జిన్‌తో ఓడిపోయిన తీరు ఆ ప్రాంతాల్లోని జన హృదయాల్లో సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌కున్న ఎనలేని ఆదరణను తిరుగులేని విధంగా నిరూపించింది. 

కనీస విలువలకు, నీతి నియమాలకు ఎన్నడో తిలోదకాలిచ్చిన అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఈసారి మరింత దిగజారారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన కుటుంబీకులే హతమార్చి ఉండవచ్చని నోరు పారేసుకున్నారు. ‘జగన్ మా పార్టీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్లం. ఏదో ఒకనాడు ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం. బయటకు వె ళ్లడంతో ఏమైంది... ఇప్పుడు జైలుపాలయ్యాడు’ అని తమ కుట్రను తామే జనం ముందు బయటపెట్టుకున్నారు. మూడేళ్లనాడు భర్తను కోల్పోయి, ఇప్పుడు కుమారుడు జైలుపాలైన నేపథ్యంలో ప్రచార రంగంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హేళనగా మాట్లాడారు. 

ఆమెపట్ల, ఆమె కుమార్తె షర్మిల పట్ల అమానవీయంగా వ్యవహరించారు. అమర్యాదగా ప్రవర్తించారు. విజయమ్మకు కొడుకును ఎలా పెంచాలో తెలియదంటూ దూషించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వరసగా రెండోసారి సైతం తాము అనుభవిస్తున్న అధికారానికి మూలకారకుడైన దివంగత నేత సతీమణి అనికూడా చూడకుండా, వారి సూట్‌కేసులను రోడ్డునపడేసి తనిఖీలకు దిగారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే మీరంతా జైలుకు పోతార’ని ప్రజల్ని బెదిరించారు. నిజానికి రాష్ట్రంలో ఈ తరహా దూషణలకు, దుష్ర్పచారానికి, దుర్నీతికి తెరలేపింది చంద్రబాబే. 

1995లో సొంత మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని ఆక్రమించుకున్నది ఈ దారిలోనే గనుక... ‘ఆ విధంగా ముందుకుపోతే’ మళ్లీ అధికారం దక్కుతుందన్న దురాశ ఆయనలో చావలేదు. కానీ, అధికార కాంగ్రెస్ నేతలకు ఏమైందో... అచ్చం బాబు మార్కు లక్షణాలను పుణికిపుచ్చుకొని వీరంగం వేశారు. తప్పుడు ఆరోపణలు పుక్కిటినిండా పట్టి ఊరూరా తిరిగారు. వీటన్నిటినీ మౌనంగా వీక్షించిన ప్రజానీకం జన్మజన్మలకూ బుద్ధొచ్చేవిధంగా వీరందరికీ జవాబిచ్చారు. మమ్మల్ని పాలించే అర్హత ఇద్దరికీ లేదని అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు మొహం మీద గుద్ది చెప్పారు. 

ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ తాము ప్రజలకు చేసినవేమిటో, చేయబోతున్నవేమిటో చెప్పలేదు. 

ఇందుకు భిన్నంగా తొలిసారి ప్రచార రంగంలోకి అడుగుబెట్టిన విజయమ్మ, భిన్న వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడమేకాక, తమ పార్టీకున్న భవిష్యత్తు ప్రణాళికలేమిటో వివరించారు. ఆయా ప్రాంతాల్లో జన సంక్షేమం కోసం దివంగత నేత వైఎస్ చేపట్టిన పథకాలను గుర్తుచేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఎనిమిదేళ్లనుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లాగిస్తున్న బాబుగానీ, పైనుంచి లెసైన్స్ తెచ్చుకుని సీఎంగా కాలక్షేపం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిగానీ ఇన్నిరోజుల ప్రచారంలో ఒక్కసారి కూడా ప్రజల గురించి మాట్లాడితే ఒట్టు. ఇరుపార్టీల తీరూ ఇలా ఉందిగనుకే, వైఎస్ కనుమరుగైన తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ రెండూ ఓటమినే చవిచూశాయి. ఇప్పుడు కాంగ్రెస్ నెగ్గిన రెండు స్థానాలూ తనకు బద్ధ శత్రువుగా ఉండాల్సిన తెలుగుదేశం విదిల్చిన ఓట్ల పుణ్యమే. బాబు అయితే, 2004 తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ నెగ్గింది లేదు. కాంగ్రెస్ అధికార పీఠంమీద ఉండి ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే దారుణమనుకుంటే... ఆ పార్టీ ఏడుచోట్ల డిపాజిట్లు సైతం పోగొట్టుకుంది. 

అటు టీడీపీ ఐదుచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ గెల్చుకున్న 15 స్థానాల్లో ఆ రెండు పార్టీలూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ భారీ మెజారిటీలను సాధించింది. పరకాలలో చివరివరకూ గట్టి పోటీ ఇచ్చి, స్వల్ప తేడాతో ఓడిపోయిన తీరు ఆ పార్టీకి తెలంగాణలో సైతం ఉన్న పట్టును నిరూపించాయి. 

ఇరు పార్టీలూ ప్రజా అవిశ్వాసాన్ని నిండా మూటగట్టుకున్నాయని తాజా ఉప ఎన్నికలు నిరూపించాయి. అంతేకాదు, గిట్టనివారిపై సీబీఐని ప్రయోగించి దారికి తెచ్చుకోవాలనుకుంటున్న కేంద్ర పాలకుల కుట్ర బుద్ధినీ తిప్పికొట్టాయి. తమ గుండెల్లో ఎన్నడో బందీ అయిన వ్యక్తిని జైలుగోడలు బంధించలేవని ఈ తీర్పుద్వారా జనం చాటిచెప్పారు. ప్రజాస్వామ్యమంటే తమ సొంత జాగీరుగా, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే పెద్ద నేరంగా పరిగణించే కాంగ్రెస్ అధిష్టానాన్ని చాచికొట్టారు. ఈ శక్తులకు బాకాగా మారి, తప్పుడు కథనాలను రోజూ తలకెత్తుకుంటున్న యెల్లో మీడియాకూ బుద్ధిచెప్పారు. అందుకే, అంతిమంగా ఇది జన విజయం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!