YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 14 June 2012

భవిష్యత్తుకు ఏదీ భరోసా! కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం

* మహానేత వ్యతిరేకుల పెత్తనంపై అసహనం
* తమను పట్టించుకునే నాథుడే లేడనే ఆవేదన.. వైఎస్ అన్నీ తానై చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్న నేతలు
* ఇలా ఎంతకాలం కొనసాగగలమనే భావన
* ఇటీవల కొందరు సహచరులు పార్టీ వీడటాన్నీ ప్రస్తావిస్తున్న ఎమ్మెల్యేలు 
* భవిష్యత్ కార్యాచరణకు వారంరోజుల్లోగా సమావేశానికి నిర్ణయం.. 60 మంది వరకు హాజరయ్యే అవకాశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉపఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనుండగా కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన తీవ్రమైంది. పార్టీలో భరోసా ఇచ్చే నాథుడు కరువవడంతో వారు ఇక ఒక నిర్ణయానికి రావాలన్న ఆలోచనలో పడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా మెలిగిన ఎమ్మెల్యేలంతా త్వరలోనే భేటీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. 

‘వైఎస్ మరణానంతరం తొందరపాటు నిర్ణయాలెందుకని కొంత సహనంతో ఉన్నామని, అయితే పరిస్థితి ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థమైన తర్వాత కూడా ఏదో ఒక నిర్ణయానికి రాకపోతే ఎలా అని మథనపడుతున్న ఎమ్మెల్యేలు పార్టీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లంతా సమావేశమవ్వాలని నిర్ణయించాం’ అని ఒక సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకావచ్చని ఆ ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశం కోసం కొందరు సీనియర్ సభ్యులు చొరవ తీసుకుని ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో రాజకీయ భవిష్యత్తుకు హామీ లేదని, అండగా నిలబడే నాయకుడెవరూ లేరనీ.. దీనికి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంటూ త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలన్న ఆలోచనతో ఉన్నామని మరో సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు. 

వైఎస్ ఉన్నంత కాలం ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వారే ఈరోజు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని, భవిష్యత్తులో టికెట్ వస్తుందని భరోసా ఇచ్చే నాథుడు కూడా పార్టీలో లేరని నేతలు తర్జనభర్జన పడుతున్నారు. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలన్న అంశంపై అందరిలోనూ ఒక రకమైన టెన్షన్ నెలకొందని, అయితే ఈ మొత్తం వ్యవహారాలకు ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉన్నందునే ఒక భేటీ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. 

‘‘కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులను అధిగమించడమెలా? వైఎస్ వ్యతిరేక నాయకత్వాన్ని ఢీ కొంటూ కాంగ్రెస్‌లో కొనసాగేదెలా? ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా?’’అనే విషయంపై కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకోసం ఓ ముఖ్యనేత ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే వైఎస్‌ను అభిమానించే పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఈ అంశంపై చర్చించడంతోపాటు వారంరోజుల్లో భేటీ ఏర్పాటు చేయబోతున్నామని, తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నారు. 

సదరు ముఖ్య నేత మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌లో వైఎస్‌ను అభిమానించే ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. వైఎస్ బతికున్నన్నాళ్లూ మా సాధక బాధకాలన్నీ ఆయనకే చెప్పుకునేవాళ్లం. అన్నీ ఆయనే చూసుకునేవాడు. చివరకు టికెట్లు కూడా ఇప్పించేవారు. హైకమాండ్ ఢిల్లీలో ఉన్నా ఆయనే అక్కడికి వెళ్లి మాట్లాడేవారు తప్ప మేమేనాడు ఢిల్లీ పెద్దలను కలిసిన పాపానపోలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. హైకమాండ్ పట్టించుకోవడం లేదు. పైగా వ్యతిరేక నాయకత్వం పెత్తనం చేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్ మరణానంతరం కొందరు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ తాము మాత్రం కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో పార్టీలోనే ఉండిపోయామన్నారు. అయినప్పటికీ వైఎస్ వ్యతిరేక నాయకత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు తమకూ రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందన్నారు. వైఎస్ విషయంలో రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన విభజన వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులపై గత కొన్ని రోజులుగా తామంతా దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు గల కారణాలను ఉదాహరణలతో ఆయన వివరించారు. 

‘‘బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కే రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు వెళ్లడానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ. ఆయన పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నందున తనను ఎదగనీయడని, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కూడా రాకుండా చేస్తారనే నిర్ణయానికొచ్చి జగన్‌వైపు వెళ్లాడు. అంతెందుకు గండ్ర వెంకటరమణారెడ్డినే ఉదాహరణగా తీసుకోండి. పరకాల ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టికెట్ ఇస్తామని చెప్పి ప్రచారం కూడా చేసుకోమన్నారు. చివరకు ఆమెకు కాకుండా టీడీపీకి చెందిన సమ్మారావుకు టిక్కెట్ ఇచ్చారు. గండ్ర సామాన్యుడేమీ కాదు. ప్రభుత్వ చీఫ్‌విప్. పైగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అలాంటి నాయకుడికే ఇట్లా జరిగితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? అదే వైఎస్ ఉంటే ఇలా జరిగేదా? మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబడతారు. ఎంతవరకైనా పోరాడి హైకమాండ్‌ను ఒప్పించి పని చేయించగల సమర్థుడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదే! పై రెండు ఉదంతాలే ఇందుకు నిదర్శనం’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ను అభిమానించే ఎమ్మెల్యేలమంతా వారంరోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోనున్నట్లు సదరు ముఖ్యనేత తెలిపారు. 

మిగతా ఎమ్మెల్యేల్లోనూ సందిగ్ధమే 
ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌కు ఒకటి, రెండు స్థానాలైనా దక్కుతాయా? ఒకవేళ ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఆ ప్రభావం ఏమేరకు ఉంటుంది? హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? పార్టీ, ప్రభుత్వంలో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి...? ఇలాంటి సవాలక్ష చిక్కు ప్రశ్నలు వారిని పట్టిపీడిస్తున్నాయి. సర్వత్రా ఇదే చర్చ సాగుతోంది. 

పరకాల ఉప ఎన్నికల ఫలితాలనుబట్టి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు తగిన భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకునే పనిలో పడ్డారు. మరోవైపు సీమాంధ్ర ప్రతినిధులు కొందరు సీమాంధ్ర ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాల సరళిని బట్టి తీవ్ర నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉన్నారు. మరికొందరు మాత్రం ఫలితాలను అదనుగా తీసుకొని నాయకత్వ మార్పు కోసం ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర గందరగోళంలో పడేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, భారీగా వలసలు తప్పేలా లేవని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

1 comment:

  1. Sonia Gandi decided to ruin AP and all of you have supported her. She doesn't want to stop here.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!