YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

తదేపాకు తలసాని షాక్‌!కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీ నుండి కూడా భారీ ఎత్తున వలసలు!

రాష్ట్రంలో ఉపఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రావడంతో వివిధ పార్టీల నుండి ఆ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు భారీ స్థాయిలో ఉండడం ఏదో ఒకనాటికి ఆ గూటికి చేరడం ఖాయమనే వాదనలు ఉండగా, తెలుగుదేశం పార్టీ నుండి కూడా భారీ ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దికాలంగా తెలుగుదేశం నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ త్వరలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్‌తో ఆయన ఎప్పటినుండో సంబంధాలు నెరపుతున్నట్లు సమాచారం. జగన్‌ అవినీతిపై ఎంత మొత్తుకున్నా ప్రజలు దాన్ని పట్టించుకోలేదని ఆయన చేసిన వ్యాఖ్యల్లో బలమైన ఆధారాలున్నాయి. తలసాని ఈసారి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి వైకాపా నుంచి పోటీచేస్తారనే ప్రచారం సాగుతోంది.


 కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు మరోసారి బయటపడింది. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో లింగాపూర్‌ యూత్‌ అసోసియేషన్‌తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఒకవైపు వైఎస్‌ జగన్‌, విజయమ్మల నిలువెత్తు ఫోటోలను ముద్రించగా, అదే ఫ్లెక్సీపై మరోవైపు నాని ఫోటోను ముద్రించారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని పరోక్షంగా వెల్లడించినట్లయింది. ఒకటిరెండు రోజుల్లో చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను కలిసి పార్టీలో చేరిక విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న, కృష్ణా జిల్లాకే చెందిన సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య కూడా దేవినేని ఉమా మహేశ్వరరావుపై అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. తన పార్టీలోనే తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నందిగామ నియోజకవర్గం నుండి తాను పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానేమోనన్న భయంతో ఇప్పటికే దేవినేని ఉమ తన సోదరుడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పంపారని, తన అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తారని, ఒకవేళ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే తనను ఓడించేందుకు కృషి చేస్తాడంటూ ఆయన ధ్వజమెత్తారు. గతంలోనే విజయవాడ అర్బన్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని బహిరంగంగా కలిసి ఆలింగనం చేసుకోవడంపై దుమారం చెలరేగింది. ఆగ్రహానికి గురైన చంద్రబాబు ఆయనకు షోకాజ్‌ నోటీసులను జారీ చేయించారు. దీంతో వంశీ సమాధానం ఇవ్వడంతో ఆ గొడవ సద్దుమణిగింది. అయితే జూనియర్‌ ఎన్‌టిఆర్‌తో సత్సంబంధాలు ఉండి ఆయన వర్గంగానే కొనసాగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, దివంగత వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారిద్దరినీ జగన్‌ వద్దకు రప్పించేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరూ తెదేపాను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కూడా తెలుగుదేశం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన వైఎస్సార్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలపై దృష్టి సారించారు.

 సీమాంధ్రలో పలువురు తెలుగుదేశం నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదిఏమైనా ఉప ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జోరును పెంచేలా కనిపిస్తున్నాయి.

source:  andhraprabha news 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!