YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

కొత్త ఎమ్మెల్యేలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ సూచన

జైల్లో తనను కలిసిన కొత్త ఎమ్మెల్యేలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ సూచన
ధర్మం, న్యాయం, నిజాయతీ వైపు నిలబడ్డాం: ఎమ్మెల్యేలు
రాక్షసంగా, అమానవీయంగా జగన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు
కానీ ఆయన కడిగిన ముత్యమని ప్రజలు విశ్వసించి తీర్పునిచ్చారు
విజయమ్మ నేతృత్వంలో సుశిక్షితులైన కార్యకర్తల్లా పనిచేస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ధర్మం, న్యాయం, నిజాయితీ వైపు నిలబడ్డ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు సమర్థిస్తున్నారని, అది సానుభూతి అయితే.. ఆ సానుభూతి ద్వారా గెలిచినందుకు గర్వపడుతున్నామని ఉప ఎన్నికల్లో గెలిచిన వైఎస్‌ఆర్‌సీసీ శాసనసభ్యులు చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారు తొలిసారిగా శనివారం చంచల్‌గూడ జైలుకు వెళ్లి పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. జగన్‌ను కలిసిన వారిలో భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారు. 

జగన్‌తో భేటీ అనంతరం జైలు వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి కరుణాకరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడాలని పార్టీ అధినేత తమకు సూచించారని వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని, ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని, ప్రజల పక్షాన నిలబడే పోరాటపార్టీగా వైఎస్‌ఆర్‌సీపీకి గుర్తింపు తీసుకురావాలని సూచన చేశారని తెలిపారు.

ఎన్నికల్లో సానుభూతి గురించి విలేకరులు పదేపదే అడిగినప్పుడు... ‘‘దుర్మార్గుడిని అరెస్టు చేస్తే కించిత్ సానుభూతి కూడా రాదు. ధర్మం, న్యాయం, నిజాయితీ పట్ల అకుంఠిత దీక్షతో ఉన్న నాయకుడు కాబట్టే.. జగన్ అరెస్టును ప్రజలు తీవ్రంగా నిరసించారు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గట్టిగా సమర్థించారు. మేం ఆ సానుభూతినే కోరుకున్నాం. అలాంటి నాయకుడు నేతృత్వంలో పనిచేస్తున్నందుకు ఉప్పొంగిపోతున్నాం’’ అని సమాధానం ఇచ్చారు. పార్టీ అధినేత సూచనలు, ఆదేశాలను పాటిస్తూ పార్టీని నడిపిస్తామని, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో సుశిక్షితులైన కార్యకర్తల్లా పనిచేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. తప్పుడు అభియోగాలు మోపి అన్యాయంగా, రాక్షసంగా, అమానవీయంగా జగన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టినా.. ఆయన కడిగిన ముత్యమని ప్రజలు విశ్వసించి ఉప ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పారు. అక్రమంగా జగన్‌ను అరెస్టు చేసిన ప్రభుత్వానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. ప్రజాతీర్పును గౌరవించి తక్షణం అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. షోలాపూర్ బస్సు ప్రమాదం పట్ల తమ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబాలు సానుభూతి తెలిపారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తన నియోజకర్గానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు మరణించారని, బాధిత కుటుంబాలని పరామర్శించనున్నామని చెప్పారు. 

సంగ్మా అభినందనలు

ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని లోక్‌సభ మాజీ స్పీకర్, ఎన్సీపీ నేత పి.ఎ.సంగ్మా అభినందించారు. తన సందేశాన్ని పార్టీ నేత మైసూరారెడ్డి ద్వారా జగన్‌కు పంపించారు. సంగ్మా సందేశాన్ని జగన్‌కు అందించిన వచ్చిన తర్వాత జైలు వెలుపల ఈ విషయాన్ని మైసూరారెడ్డి వెల్లడించారు. జగన్ జైల్లో కులాసాగా ఉన్నారని, ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!