YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 11 July 2012

26 జీవోలు సరైనవేనంటున్న సర్కారు


దర్యాప్తుకు ఆదేశించక ముందే సర్కారుకు హైకోర్టు నోటీసులు
అప్పుడు మాత్రం మౌనంగా ఊరుకున్న రాష్ర్ట ప్రభుత్వం
అప్పుడే ఈ సమాధానం చెప్పి ఉంటే ఈ దర్యాప్తే ఉండేది కాదేమో!
అందుకే నాడు ఊరుకుని... నేడు మంత్రుల కోసం ఈ వైఖరి

హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కొందరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, అందుకు ప్రతిఫలంగానే వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది.. సీబీఐ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నేతలు వేసిన పిటిషన్ ఆధారంగా దీనిపైనే అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కక్రూ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ.. ప్రభుత్వ నిర్ణయాల జోలికి పోలేదు. సీబీఐ దర్యాప్తు మొత్తం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సంస్థలు, వాటిలోని ఇన్వెస్టర్ల చుట్టూనే తిరుగుతుండటంతో నెల్లూరుకు చెందిన పి.సుధాకరరెడ్డి అనే న్యాయవాది దీనికి అభ్యంతరం చెప్తూ కేసు వేశారు. ‘‘ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటంతో వారు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. అంటే ముందు ప్రభుత్వం కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందా? లేక అంతా నిబంధనల ప్రకారమే జరిగిందా? అన్నది తేలాలి. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సరైనవో కావో తేల్చాలి. అవేమీ తేల్చకుండా దర్యాప్తు మొత్తం జగన్ చుట్టూనే తిరుగుతుండటం పక్షపాతాన్ని కళ్లకు కడుతోంది. దయచేసి నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించండి’’ అంటూ సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని సీబీఐ కోర్టు కొట్టివేయటంతో న్యాయవాది సుధాకరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పిటిషన్‌ను తిరస్కరించటంతో చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. 

సుప్రీంకోర్టు దీనిపై స్పందించి ఆ జీవోలు జారీ చేసిన ఆరుగురు మంత్రులకు, కొందరు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. అలా నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ మినహా మిగిలిన ఐదుగురు మంత్రులకూ న్యాయ సహాయం అందజేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీన్ని సమర్థించుకుంటూ... ‘‘వారు తప్పు చేశారని నేననుకోవటం లేదు. ఆ జీవోలు ప్రభుత్వం ఇచ్చినవి. అవి ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టే సాయం అందిస్తున్నాం. అయితే క్విడ్ ప్రో కోలతో మంత్రులకు సంబంధం ఉందనుకోవటంలేదు’’ అని ముఖ్యమంత్రి బుధవారం వ్యాఖ్యానించారు. నిజానికి ఈ కేసులో దర్యాప్తునకు ఆదేశించకముందు ప్రభుత్వం వైఖరేమిటో చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది కూడా. ప్రభుత్వం గనక తమ నిర్ణయాలన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయని, తప్పేమీ లేదని చెప్పి ఉంటే.. బహుశా ఈ విచారణ, ఈ దర్యాప్తు ఇవన్నీ ఉండేవి కావేమో! కానీ ప్రభుత్వం అప్పట్లో తన వైఖరిని కోర్టుకు చెప్పలేదు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ కక్రూ తన తీర్పులోని 41వ పేరాలో ప్రస్తావిస్తూ.. అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చామని, కానీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకూడదని భావించినట్లుందని వ్యాఖ్యానించారు. రికార్డులు కూడా అందజేయలేదని, అలాంటపుడు తగిన విధంగా అర్థం చేసుకోవటం తప్ప ఈ కోర్టు చేయగలిగిందేమీ లేదని అన్నారు. 

ప్రభుత్వం చేత బలవంతంగా అఫిడవిట్ వేయించలేమని కూడా స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కనక, రికార్డులు ఇవ్వలేదు కనక పిటిషనర్ కోరినట్టు దర్యాప్తునకు ఆదేశించలేమని చెప్పలేం. మా ముందున్న మిగిలిన ఆధారాలు, ఇతర అంశాల ఆధారంగా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కానీ బుధవారం నాడు సీఎం మాత్రం.. ‘‘ఆ కేసులో ప్రభుత్వం పార్టీ కాదు. అందుకే మేం కోర్టుకు సమాధానం చెప్పలేదు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. చివరికి కోర్టు తన తీర్పులో సైతం.. ప్రతివాదుల జాబితాలో మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వాన్నే పేర్కొంది. దాని ప్రతినిధిగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని పేర్కొంది. ప్రభుత్వం మాత్రం తాను భాగస్వామిని కాదని చె ప్పటం గమనార్హం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!